కంచెలను తొలగిస్తమంటే
మిమ్ముల కాడెడ్లమై మా మెడలమీదకు ఎక్కించుకున్నం
మీరే ‘‘కంచ’’ను మేస్తరని తెలుసుకోలేకపోయినం
మీరు రంగమెక్కేముందటి మీ రూపాన్ని
గతకాలపు భయం కళ్ళతో జూశిన మేము
నీదుత్త వేషమేనని మరిశిపోయినం
మీరు రంగమెక్కి ఆడుతుంటే
ఒక్కొక్కటిగా యెలిసిపోతున్న రంగుల్లోకెళ్ళి
మీ అసలు రూపం బుసలు కొడుతుంది
అధికారం రూపకమంతా
ఎప్పటికైనా ఒకటేనని బోధపడుతుంది
అయ్యా…
అది మీ భూమో మా భూమో కాదు
ఈ నగరపుజీవి ఆక్సిజన్ బండ
నగరమిప్పుడూ వెంటిలేటర్ మీద ఉన్నది
కొన ఊపిరిని తీసి మీరు కట్టే ఈ అభివృద్ధి శవపేటిక
ఎవరికోసం??
ఏ పిట్టలు ఎటువైపునుండో ఆకలితో వత్తయని
గుడిశె ముందర సూరుకిందా
వరి కంకులు యాలాడగడ్తం
గుడిశెలొక్కలే మలుసుకోను జాగున్న
ఏ పిచ్చుకలన్నొచ్చి ఇంత సాటుజేసుకుంటే
సూశి మస్తు సంబురపడ్తం
అసువంటి ఈ గడ్డమీద
మీ మరయంత్రాల రోదలకు
జడిసిన జీవుల పరుగులు పచ్చులు చేస్తున్న ఆర్తనాదాలు
మీ మనసునెట్లా కదిలిస్తలేవు ప్రభూ!
ఓ…మీ హృదయాలకు అధికారపు కంచెలు తొడుక్కున్నారు కాబోలు
ఏమీ కనబడకుండా…ఏవీ వినబడకుండా…
మీరు ఊపిరి గొంతుకలను నలుపాలని సూడకుర్రి
రేపటి మీకూ పానముండదు
మాకు కంచెలను తీసేసుకునుడే గాదు
‘‘కంచ’’ను కాపాడుకునుడు తెల్సు.
– దిలీప్.వి
జిల్లా ప్రధానకార్యదర్శి
ఉమ్మడి వరంగల్ జిల్లా
మానవ హక్కుల వేదిక
సెల్:8464030808





