(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
ఖాళీ కాబోతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనున్నాయి. ఎట్టి పరిస్థితిలో ఈ రెండు స్థానాలను గెలువాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నది. ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ గెలువగల అభ్యర్ధులను ఎంచుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రభావం రానున్న శాసనసభ ఎన్నికలపైన పడే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా దాదాపు సగానికి ఎక్కువగా ఈ రెండు ఎంఎల్సీ స్థానాల పరిధిలో ఉండడం గమనార్హం. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎంఎల్సీ స్థానం పరిధిలో దాదాపు 34 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్సీ పరిధి 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉంది. అంటే మొత్తం 77 నియోజకవర్గాలకు సంబందించిన పట్టభద్రులు ఈ ఎన్నికల్లో భాగస్వాములవుతారన్నమాట. విద్యావంతులు ముఖ్యంగా యువకులు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యే ఈ ఎన్నికలు భవిష్యత్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనడంలో సందేహంలేదు. అందుకే రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు జెన్ జీ ప్రభావం బాగా వినిపిస్తున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తమ డిమాండ్లను సాధించుకున్న ఘనత వారికుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లోకూడా ఇలాంటి ఉద్య మాలే విస్తరిస్తున్న క్రమంలో యువతను మచ్చిక చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పవచ్చు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుగానే మేల్కొన్నారు. 21 ఏళ్ళకే ఎంఎల్యే, 25 ఏళ్ళకు ఎంఎల్సీ, ఎంపీ అయ్యే అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనపై అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపిస్తాననికూడా ఆయన ప్రకటించడాన్నిబట్టి ఆయన యూత్‌కు ముందస్తుగానే గాలంవేసినట్లు కనిపిస్తున్నది. సిఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనపైన కేవలం మన రాష్ట్రంలోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, మేదావులమద్య ఇదొక చర్చకు దారితీసింది. అదే తరహాలో త్వరలో జరుగనున్న రెండు ఎంఎల్సీ ఎన్నికలకుగాను అభ్యర్థులను యువకులనే ఎంపికచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని, చాలాకాలంగా ఎలాంటి పదవులు లేకుండా ఉన్న వృద్ధ నాయకులను పక్కకు పెట్టి యువకులకే రేవంత్‌రెడ్డి సర్కార్ అవకాశం కలిగిస్తుందనడానికి అలాంటి పేర్లే వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎంఎల్సీ స్థానానికి పీసీసీ మీడియా కమిటీ చేర్మన్, యువకుడైన సామా రామ్మెహన్‌రెడ్డి పేరు బలంగా వినవస్తున్నది. అలాగే పార్టీ నాయకులు గౌరీ సతీష్, హర్షవర్థన్‌రెడ్డిలతోపాటు, దివంగత మంత్రి దామోదర్‌రెడ్డి కుమారుడు సరోత్తమరెడ్డికూడా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ నియోజకవర్గానికి కూడా యువకులే పోటీ పడుతున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి, టూరిజం కార్పోరేషన్ మాజీ చేర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతగా పనిచేసిన డాక్టర్ లోకేష్ యాదవ్, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా పనిచేసిన చనగాని దయాకర్ మరికొందరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఎన్నికలను హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతోఉన్నప్పటికీ ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో ఇన్‌ఛార్జి మంత్రులకు అభ్యర్థులను ఎంపికచేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. ఈ నెల 15 లోగా ఆశావహుల పేర్లను పంపించాల్సిందిగా అధిష్టానం పేర్కొనడంతో తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతున్నది. అయితే బిఆర్‌ఎస్, బిజెపి నుండి ఆ పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రెండు పార్టీలుకూడా ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నాయి.
ప్రతిష్టగా భావిస్తున్న బిజెపి
కాంగ్రెస్ లాగానే బిజెపి కూడా ఈ ఎన్నికలను గెలవడమన్నది ప్రతిష్టగా భావిస్తున్నది. ఎందుకంటే రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేస్తామన్న గట్టి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్న బిజెపి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్సీ స్థానం విషయానికొస్తే ఆ స్తానం పరిధిలోని సికిందరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాలను కలిగిఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఎంఎల్సీ స్థానంలో ప్రస్తుతం బిఆర్‌ఎస్ నేతగా పివి కుమార్తె సురభి వాణి ప్రాతినిద్యం వహిస్తుండగా, ఇప్పుడు బిజెపి పివి మనుమడు ఎన్‌వి సుభాష్‌ను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా చదువులు చదివిన ఇతనితోపాటు ఐఐటీ రూర్కెలో విద్యాభ్యాసం చేసిన కాంగ్రెస్ నేత అమర్‌నాథ్ పేరునుకూడా బిజెపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బిఆర్‌ఎస్‌కూడా తన స్థానాన్ని పదిలపర్చుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నది. బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని చెబుతున్నప్పటికీ ఈ రెండు పార్టీలో లోపాయికారిగా ఒకదానికొకటి సహకరించుకునే ఆలోచనలో ఉన్నాయని సాక్షాత్తు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో బిజెపికి బిఆర్‌ఎస్ సహకరిస్తే, వరంగల్‌లో బిఆర్‌ఎస్‌కు బిజెపి సహకరించుకోనున్నాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




