ఆగస్టు నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ప‌నులు ప‌రిశీలించిన మంత్రి

వేంసూరు/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 26 : పామాయిల్ సాగు రాష్ట్ర రైతాంగానికి వరంగా మారిందని, దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా రాష్ట్రం మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం కల్లూరుగూడెం వద్ద నిర్మిస్తున్న పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పామాయిల్ సాగు విస్తరణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగులో ఉండగా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే 70 లక్షల ఎకరాల్లో విస్తరణ జ‌ర‌గాలన్నారు. దేశవ్యాప్తంగా 36 శాతం సాగు విస్తరణతో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని మంత్రి హ‌ర్షం వ్యక్తం చేశారు. వంట నూనెల దిగుమతుల కోసం మ‌న దేశం ఏటా రూ.లక్ష కోట్లు ఖర్చు చేసే పరిస్థితులు ఉన్నాయ‌ని, కేంద్ర ప్రభుత్వం పామాయిల్ ఇంపోర్ట్ టాక్స్ 44 శాతం పెంచాల‌ని,అపుడే దేశీయంగా రైతాంగానికి మద్దతు ధరలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాదజోషిలను ఇటీవల కలిసి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం పామాయిల్ ఫ్రూట్ బంచ్ టన్ను గెలలు ధర రూ.23,852లు ఉందని, కనీస గ్యారంటీ ధర రూ.25 వేలుగా కేంద్రం ప్రకటించాలని కోరినట్లు గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఉండగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉండగా ఖమ్మం జిల్లాలో కల్లూరు గూడెం(కొణిజర్ల), గద్వాల జిల్లా బీచ్ పల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు లో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చెయ్యాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వం రైతు భరోసా, రైతు భీమా పథకం, ఉచిత విద్యుత్ సరఫరాతో పామాయిల్ రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ చేస్తే తెలంగాణలో గ్రీన్ కవర్ పెరగటంతోపాటు రాష్ట్ర ఆర్ధిక ప్రగతిలో ముఖ్య భూమిక వహించనున్నదని అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా రైతులు పామాయిల్ సాగు చేపట్టాలని రైతాంగాన్ని కోరారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *