– యువత డ్రగ్స్ కు దూరంగా వుండాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ఈగల్ ఫోర్స్, సామాజిక న్యాయం సాధికారత శాఖలు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రామచంద్రన్, సినీ నటులు రామ్ పోతినేని, మీనాక్షి చౌదరి, అంతర్జాతీయ జిమ్నాస్ట్ అరుణ బుద్ధా రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఈగల్ ఫోర్స్ విభాగం అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన యువతే తెలంగాణ భవిష్యత్తు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు తెలంగాణలో ఎలాంటి స్థానం ఉండదని స్పష్టం చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు చట్టాలు మాత్రమే సరిపోవని, సమాజంలో అవగాహన, బాధ్యత, విలువలు పెరిగినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్నారు. విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు అందరూ కలిసి యువతను ప్రభావితం చేయాలని అన్నారు. సినీ హీరో రామ్ పోతినేని, నటి మీనాక్షి చౌదరి యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని, జీవితంలో లక్ష్యాలను సాధించడమే నిజమైన విజయం అని పిలుపునిచ్చారు. క్రీడాకారిణి అరుణ బుద్ధా రెడ్డి కూడా క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారానే యువత ఉన్నత శిఖరాలను చేరుకోగలరని పేర్కొన్నారు.
ప్రతి యువకుడు డ్రగ్స్‌కు ‘నో’ చెప్పాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని సమాజం దూరం పెట్టకుండా వారికి సరైన మార్గం చూపాలని, మిత్రుల్లో ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడితే వారిని ఆ ప్రమాదం నుంచి బయటపడేలా సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ సైనికులుగా మారాలని, యువత సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలని సూచించారు.
డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వ సహకారం
డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దేశంలోనే అత్యుత్తమ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థగా తీర్చిదిద్దిందని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ అత్యంత సవాళ్లతో కూడుకున్న బాధ్యత అని అన్నారు. ఈ పోరాటంలో ఈగల్ బృందానికి అవసరమైన ప్రత్యేక వాహనాలు, డ్రగ్ డిటెక్షన్ పరికరాలు, ఆధునిక సాంకేతిక వనరులను తెలంగాణ ప్రభుత్వం అందించిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ తమకు అండగా నిలుస్తోందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
డ్రగ్స్ వ్యతిరేక అవగాహనలో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, ఇతర పోటీలలో విజేతలైన విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సి.వి. ఆనంద్ తదితరులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





