అసైన్‌మెంట్ భూములు లాక్కుంటున్నారు

– రేవంత్ అరాచకాలను మరిచిపోవద్దు
– పేదలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుంది
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పరిగి, ప్రజాతంత్ర, జూన్ 26 : అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను లాక్కుంటున్నారని, పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతోని దళిత, గిరిజన పేదల భూములను గుంజుకుంటున్నారని కాంగ్రెస్ పాలకులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పరిగి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పరిగిలోను పారిశ్రామికవాడల పేరుతోని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రభుత్వం అక్రమంగా భూములు గుంజుకుంటున్నదన్నారు. లగచర్లలో రేవంత్ రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మరిచిపోవద్దని, తమ భూములు ఇవ్వనందుకే లగచర్ల గిరిజనులపై పోలీసు కేసులు పెట్టించి, దాడులు చేయించి జైలులో పెట్టాడని ఆరోపించారు. గుండెపోటు వస్తే ఆయనకు వైద్యం అందించకుండా బేడీలు వేసి మరీ తిప్పించారన్నారు. పరిగి నియోజకవర్గంలో అడ్డగోలుగా అసైన్డ్ భూములు పేదల నుంచి లాక్కుంటామంటే ఒప్పుకునేదే లేదని హెచ్చరించారు. ఆ పేదలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటికి పట్టాలు ఇచ్చి పట్టాలకు ఇవ్వాల్సినంత నష్టపరిహారం ఇచ్చి రైతుల అంగీకారంతోని భూములు సేకరించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ని నమ్మొద్దు.. నమ్మితే మోసపోతాము.. తెలంగాణ ఆగమయిపోతుందని కేసీఆర్ రెండేళ్ల కిందటే స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. పరిగి లాంటి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంలోని రైతన్నలకు రైతుబంధు ఇస్తామని చెప్పి పెన్షన్లు, పంటల బోనస్, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఘోరంగా మోసం చేసిండన్నారు. కేవలం రైతన్నలకే కాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేందుకు 420 హామీలు ఇచ్చి డిక్లరేషన్లు గ్యారెంటీలతో సబ్బండ వర్గాలను మోసం చేసిర్రు అని కేటీఆర్ విమర్శించారు. పరిగి నియోజకవర్గానికి గ్రావిటీతోని కేసీఆర్ నీళ్లు తీసుకొస్తామంటే రేవంత్ రూ.4,400 కోట్లతోని ప్రత్యేకంగా ఒక స్కీమ్ తయారు చేసి కమీషన్ల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకమని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్న రేవంత్ రెడ్డి కనీసం వారికి ఇస్తామన్న రూ.2,500లు ఇస్తే లక్షాధికారులు అవుతారన్నారు. ఒక్కొక్క ఆడబిడ్డకి రూ.లక్షన్నర వారి బ్యాంకు ఖాతాలో వేస్తే శాశ్వతంగా రాజకీయల నుంచి వైదొలుగుతానని సవాలు విసిరారు. పదేపదే కాంగ్రెస్ చేతిలో మోసపోకుండా మనం కలిసి కొట్లాడవలసిన అవసరం ఉన్నదని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాబందు పోవాలెñ, రైతుబంధు కేసీఆర్ రావాల అన్న లక్ష్యంతో కలిసి పనిచేద్దామన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టించాలంటే అందరం సమష్టిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పరిగిలోని ప్రతి గ్రామానికి, తండాకి, ఇంటింటికీ కేసీఆర్ నీళ్ళిచ్చారన్నారు. ఈ సందర్భంగా ఎసఐఆర్‌తోపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపైన శ్రేణులకు కేటీఆర్ అవగాహన కల్పించారు. పార్టీ కార్యకర్తలపైన అరాచకాలు, అక్రమ కేసులు పెడితే ఆ పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో కార్యకర్తలకు దక్కాల్సిన గౌరవం, పదవుల అంశంలో తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *