– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు. ఐటీ, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, అంతరిక్ష పరిశోధనలు మరియు రక్షణ రంగంలో స్వదేశీ యుద్ధ విమానాలను తయారు చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నాడు దేశంలో కేవలం ఆరు ఐఐటీలు ఉంటే నేడు వాటి సంఖ్య 20కి చేరడంతోపాటు ఎయిమ్స్, ఐఐఎంలు, ఎన్ఐటీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, యువతను ఉద్యోగాలు కోరేవారిగా కాక ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేర్చేందుకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర పథకాల ద్వారా కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల ఆదర్శాలతో యువత ముందుకు సాగాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.4.5 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే మరో రూ.2 లక్షల కోట్లకుపైగా భారం మోపిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలను, బీసీ రిజర్వేషన్ల హామీలను కాంగ్రెస్ తుంగలో తొకిందన్నారు. విద్యార్థులకు అందాల్సిన రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరిట రియల్ ఎస్టేట్ బడాబాబులకు విలువైన భూములను ధారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు కార్పొరేషన్ల పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత బియ్యం పథకానికి 90 శాతానికి పైగా నిధులు కేంద్రానివేనంటూ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ పొటో పెట్టకుండా ప్రజలను వంచించడం తగదన్నారు. సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్, రామగుండం ఫెర్టిలైజర్స్ పునరుద్ధరణ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎంఎంటీఎస్ విస్తరణ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం అందించిందని రామచందర్ రావు వివరించారు. దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ హమ్ కరేంగే.. హమ్ కరేంగే అంటూ ముందుకు రావాలని, ‘అగర్ భారత్ మే రహనా హోగాతో వందేమాతరం కహనా హోగా అని జాతీయ భావనతో ప్రతి పౌరుడూ నిలబడాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన పవిత్రమైన వందేమాతరం గేయం ఆలపిస్తుంటే కూర్చుని అవమానించే మజ్లిస్ నాయకుల తీరును సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ కర్ణాటక-తమిళనాడు కో-ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, వేముల అశోక్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




