తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ₹7,345.12 కోట్ల వ్యయంతో ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫేజ్-1)’ కి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2024-25, 2025-26) బడ్జెట్‌లో ఒక్కో ఏడాది ₹1,500 కోట్లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఖర్చు చేసింది చాలా స్వల్పం (వరుసగా ₹11.25 కోట్లు, ₹6.21 కోట్లు మాత్రమే). దీన్నిబట్టి చూస్తే కేటాయించిన నిధులకు, ఖర్చు చేస్తున్న దానికి పొంతనే ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రధాన ప్రశ్న.
అదీకాకుండా కేబినెట్ ఆమోదించిన ₹7,345 కోట్లలో భూసేకరణ నిర్వాసితుల పునరావాస (ఆర్ అండ్ ఆర్) ఖర్చులు చేర్చలేదు. కాబట్టి, భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది ఆర్థికంగా పెద్ద సవాలు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వంటి అంతర్జాతీయ సంస్థల నుండి కూడా నిధులు సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సింగపూర్‌కు చెందిన మేన్‌హార్ట్ కన్సల్టెన్సీ సమర్పించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రకారం, తొలి దశలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ మూలాల నుండి బాపూఘాట్ సమీపంలో ప్రతిపాదించిన ‘గాంధీ సరోవరం’ వరకు ఈ 21 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా కేవలం నదిని శుద్ధి చేయడమే కాకుండా, పర్యాటక రంగాన్ని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను ‘హైడ్రా’ ద్వారా బలవంతంగా కూల్చివేతలను విపక్షాలు,ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు జరిగి, కరెంట్ బిల్లులు కడుతున్న ఇళ్లను అక్రమ కట్టడాలుగా ఎలా ముద్రిస్తారని ప్రశ్నిస్తున్నాయి. మూసీ ప్రక్షాళన వెనుక పేదల సంక్షేమం లేదని, కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మూసీ తీర ప్రాంత భూములను కట్టబెట్టడానికే ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నాయి.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్టీపీ ల నిర్మాణం ద్వారా మూసీ శుద్ధికి శ్రీకారం చుట్టామని, వాటిని పూర్తి చేయకుండా కేవలం ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కేటీఆర్ వంటి నేతలు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల నుండే అసలు కాలుష్యం వస్తోందని, వాటిని నియంత్రించకుండా కేవలం నగరంలోని పేదల ఇళ్లను టార్గెట్ చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు (కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్) ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాలు పొలిటికల్ మైలేజ్ కోసం రూ. 1.5 లక్షల కోట్లు అంటూ కల్పిత అంకెలను ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది.అధికారికంగా కేబినెట్ మొదటి దశ పనుల కోసం రూ. 7,345.12 కోట్లకు మాత్రమే పరిపాలనా అనుమతులు ఇచ్చిందని, ప్రతీ పైసాకు లెక్కలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 2026-27 బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1,500 కోట్లు మరియు విడుదల చేసిన రూ. 375 కోట్లు దీనికి నిదర్శనమని పేర్కొంటోంది. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో కాలయాపన చేసిందని, ఆక్రమణలను ఇష్టారాజ్యంగా ప్రోత్సహించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.తాము అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి పనులు ప్రారంభించడం తమ ఘనతగా ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఎవరినీ రాత్రికి రాత్రి రోడ్డున పడేయడం లేదని, బాధితులకు ముందుగానే ఇళ్లు కేటాయించి, సామరస్యపూర్వకంగా తరలింపు ప్రక్రియ చేపడుతున్నప్పటికీ విపక్షాలే రాజకీయ స్వార్థం కోసం పేదలను రెచ్చగొడుతున్నాయని ఎదురుదాడి చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం బాగానే ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లోప్రభుత్వం మారితే ప్రాజెక్టు పరిస్థితేంటనేది మరో కీలక ప్రశ్న. ఇప్పటికే ప్రాజెక్టుపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ద్వారా మొదటి దశకు ఆమోదించిన రూ. 7,345 కోట్ల బడ్జెట్, విపక్షాలు ఆరోపిస్తున్న భారీ అంచనాలపై బీఆర్‌ఎస్ కచ్చితంగా పునఃసమీక్ష జరిపితీరుతుంది. ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయకపోయినా, దాని పరిధిని తగ్గించి, తమ పాత ప్రణాళికలకు అనుగుణంగా రీ-డిజైన్ చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ విధానం ప్రకారం… మూసీని అందంగా మార్చడం కంటే ముందు దాన్ని కాలుష్య రహితం చేయడం ముఖ్యం. అందువల్ల, నది ఇరువైపులా ఎక్స్‌ప్రెస్‌వేలు, ఐకానిక్ బ్రిడ్జిల వంటి హంగుల కంటే, నగరంలోని మురుగునీరు మూసీలోకి చేరకుండా గతంలో తాము ప్రతిపాదించిన 100% సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు.
తాము అధికారంలోకి వొస్తే ఒక్క ఇల్లు కూడా కూల్చబోమని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి, ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. అలాగే, కూల్చివేతలకు వాడుతున్న ‘హైడ్రా’ సంస్థ అధికారాలను పరిమితం చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం ఖాయం.. కాంగ్రెస్ హయాంలో మూసీ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీల ఎంపిక, నిధుల కేటాయింపులపై బీఆర్‌ఎస్ అవినీతి ఆరోపణలు చేసింది. అధికారంలోకి రాగానే ఈ టెండర్లు, నిధుల విడుదలపై ఉన్నత స్థాయి విచారణలు జరిపే అవకాశం ఉంది, ఇది ప్రాజెక్ట్ పనులను మరింత ఆలస్యం చేస్తుంది. కూల్చివేతల భయంతో ఉన్న మూసీ పరివాహక ప్రాంత పేదలకు రెగ్యులరైజేషన్ (పట్టాలు ఇవ్వడం) లేదా సురక్షితమైన ప్రత్యామ్నాయాలు చూపిస్తామని హామీ ఇవ్వడం వల్ల వీరు బీఆర్‌ఎస్‌కు పెద్ద వోటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది.
అధికార మార్పిడి జరిగిన ప్రతిసారీ పాత ప్రభుత్వాల ప్రాజెక్టులను నిలిపివేయడం లేదా మార్చడం వల్ల ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా, నగర అభివృద్ధి దశాబ్దాల కాలం వెనక్కి పోతుంది. మూసీ శుద్ధి అనేది హైదరాబాద్ నగర అత్యవసర అవసరం. రాజకీయ పంతాల కోసం ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టకుండా… గత ప్రభుత్వాల మంచి ప్రణాళికలను కొనసాగిస్తూ, లోపాలను సవరిస్తూ ముందుకు సాగినప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.





