ప్రజాపాలన ముసుగులో ‘నయా ఫాసిజం’!

  • తెలంగాణలో ఏడో గ్యారెంటీ అపహాస్యం
  • హామీలు తుంగలో తొక్కి.. అణచివేత దాడులు
  • ఇనుపకంచెల విధ్వంసం నుంచి నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి
“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరులకు పరిపాలనను చేరువ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మంత్రుల వైఖరి నాటి ఫ్యూడల్ భూస్వామ్య పద్ధతులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలను ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు, నేడు తాము అధికారంలోకి వచ్చాక పౌర సమాజానికి మరింత దూరం జరిగారు. సచివాలయంలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నియంత్రించడం, ప్రజావాణి అర్జీలను నామమాత్రపు ప్రక్రియగా మార్చడం ద్వారా పాలన మరింత యాంత్రికంగా మారింది.”
తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో 2023 ఒక చారిత్రాత్మక మలుపుగా భావించబడింది. దశాబ్ద కాలం పాటు సాగిన బీఆర్ఎస్ ఏకపక్ష కేంద్రీకృత పాలన, నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పౌర సమాజానికి, ప్రతిపక్షాలకు కల్పించని కనీస ప్రాప్యత, ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలు ప్రజలలో తీవ్ర అసంతృప్తిని రగిలించాయి. ఈ ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పునరుద్ధరణే ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగింది. ముఖ్యంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు సంక్షేమ హామీలతో పాటు, పౌర హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణను “ఏడో గ్యారెంటీ”గా అభివర్ణించారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘ప్రజాపాలన’ దర్బార్ నిర్వహిస్తామని ప్రమాణస్వీకార వేదికపై నుంచి ప్రకటించారు.
అయితే అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే, ఈ ప్రజాస్వామ్య వాగ్దానాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. నిరసనలపై ఉక్కుపాదం మోపడం, పౌర సమాజ చర్చా వేదికలను రద్దు చేయడం, విమర్శనాత్మక జర్నలిస్టులపై కఠినమైన దేశద్రోహ, ఉగ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగించడం వంటి చర్యలతో ప్రస్తుత ప్రభుత్వం గత నిరంకుశ పాలనను తలపిస్తున్నది. పేరుకు ‘ప్రజాపాలన’ అని పిలుస్తూ, ఆచరణలో అసమ్మతిని నిర్దాక్షిణ్యంగా అణచివేసే ఈ సరికొత్త రాజకీయ ధోరణిని రాజకీయ విశ్లేషకులు “నయా ఫాసిజం”గా అభివర్ణిస్తున్నారు.మంత్రుల ‘నయా భూస్వామ్య’ ధోరణి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరులకు పరిపాలనను చేరువ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మంత్రుల వైఖరి నాటి ఫ్యూడల్ భూస్వామ్య పద్ధతులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలను ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు, నేడు తాము అధికారంలోకి వచ్చాక పౌర సమాజానికి మరింత దూరం జరిగారు. సచివాలయంలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నియంత్రించడం, ప్రజావాణి అర్జీలను నామమాత్రపు ప్రక్రియగా మార్చడం ద్వారా పాలన మరింత యాంత్రికంగా మారింది. కొందరు మంత్రులైతే తమ క్యాంపు కార్యాలయాలను తమ బంధువులకే అప్పగించారు. ఆ కార్యాలయాలలోకి సామాన్య ప్రజలను రానీయకుండా దోపిడీకి నిలయాలుగా మార్చారు.

భూకబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ విభాగాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించడం ప్రస్తుత మంత్రుల శైలిగా మారింది. ప్రభుత్వ విధానాలలోని లోపాలను ఎత్తిచూపిన ప్రజాప్రతినిధులను, రాజకీయ ప్రత్యర్థులను చర్చకు ఆహ్వానించి, ఆపై పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారిని గృహ నిర్బంధాలు చేయడం లేదా ముందస్తు అరెస్టులు చేయడం ప్రస్తుత మంత్రుల వ్యూహాత్మక బలహీనతను ప్రతిబింబిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి పోలీసు బలగాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 పత్రికా స్వేచ్ఛపై పంజా
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి సభలోనూ రాజ్యాంగ పరిరక్షణ, భావప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తుండగా , తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ సూత్రాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వంపై వస్తున్న చిన్నపాటి విమర్శనాత్మక కథనాలను కూడా సహించలేని అసహనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. మార్చి 2025లో ‘పల్స్ డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్’ కింద పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు పొగడదండ రేవతి (మేనేజింగ్ డైరెక్టర్), తన్వి యాదవ్ (రిపోర్టర్)లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకు వారి నివాసాల నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఒక వృద్ధ రైతుతో చేసిన ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో ప్రసారం చేయడమే వారు చేసిన నేరం. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద వ్యవస్థీకృత నేరాల విభాగం సెక్షన్ 111 వంటి కఠినమైన సెక్షన్లను నమోదు చేయడం తీవ్ర కలకలం రేపింది.

“జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి సభలోనూ రాజ్యాంగ పరిరక్షణ, భావప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తుండగా , తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ సూత్రాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వంపై వస్తున్న చిన్నపాటి విమర్శనాత్మక కథనాలను కూడా సహించలేని అసహనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది..”
అనంతరం న్యాయస్థానం జోక్యంతో ఈ సెక్షన్ కొట్టివేయబడినప్పటికీ, ఈ పరిణామంపై మార్చి 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టులను భయాందోళనలకు గురిచేశాయి. పత్రికా స్వేచ్ఛ ముసుగులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషిస్తే, “బట్టలు ఊడదీసి వీధుల్లో ఊరేగిస్తామని” ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అంతేకాకుండా జర్నలిస్టులు ఎవరో ప్రభుత్వమే ఒక జాబితాను రూపొందించి నిర్వచిస్తుందని, అందులో లేనివారిని నేరస్తులుగా పరిగణిస్తామని బెదిరించడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా మారింది. ఏప్రిల్ 2026లో తెలంగాణ పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసి, సోషల్ మీడియా ఆధారిత స్వతంత్ర వార్తా సంస్థ ‘తెలుగుస్క్రైబ్’పై ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా)ను ప్రయోగించింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ) సెల్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఏప్రిల్ 18, 2026 నాటి నోటీసు ద్వారా, ఉపా చట్టంలోని సెక్షన్ 43ఎఫ్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 94 కింద తెలుగుస్క్రైబ్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు, యూసేజ్ లాగ్‌లు ఇవ్వాలని ఎక్స్ కార్పొరేషన్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై నిరంతరం విమర్శనాత్మక పోస్టులు పెడుతున్నందుకు గాను ఈ చర్యలు చేపట్టారు.

గత రెండున్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థపై దాదాపు 70 కేసులు నమోదు చేయడం ద్వారా వారి గొంతు నొక్కడానికి ప్రయత్నించింది. ‘ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’ (ఐఎఫ్ఎఫ్), ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ (సీపీజే) వంటి పౌర హక్కుల సంస్థలు దీనిని తీవ్రంగా ఖండించాయి. దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ప్రయోగించాల్సిన కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాన్ని, కేవలం రాజకీయ విమర్శలు చేసే ఆన్‌లైన్ జర్నలిస్టులపై ప్రయోగించడం చట్టాన్ని హేయంగా దుర్వినియోగం చేయడమేనని ఐఎఫ్ఎఫ్ స్పష్టం చేసింది. జూన్ 30, 2026 రాత్రి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ నివాసం ఉండే జర్నలిస్టు కె. వెంకట్రామిరెడ్డి (కేవీఆర్)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విధానం తెలంగాణ సమాజంలో పోలీసుల నిరంకుశత్వానికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల ‘రెడ్ బుక్’ పరిపాలనను విమర్శిస్తూ కేవీఆర్ తన ‘మైరా మీడియా’ చానెల్‌లో “ఎర్ర‌ బుక్ రాజ్యాంగం” అని వ్యాఖ్యానించినందుకు, ఆయన జాతీయ సమగ్రతకు ముప్పు తెచ్చారంటూ తీవ్రమైన దేశద్రోహ సెక్షన్ల కింద బాడంగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ సమయంలో స్థానిక తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులకు మద్దతుగా నిలిచి, కేవీఆర్ భార్య, పిల్లలు రోదిస్తున్నప్పటికీ బలవంతంగా లాక్కెళ్లడం పట్ల తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇతర పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

పౌర సమాజం, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల, ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులను అణచివేయడానికి ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలను అనుసరిస్తున్నది. ఈనెల 5న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్ వీకే)లో విప్లవ రచయితల సంఘం(విరసం) “ఫాసిజంపై సెమినార్” ను నిర్వహించతలపెట్టగా, చివరి నిమిషంలో ప్రభుత్వం అడ్డుకున్నది. ముందస్తు శాంతిభద్రతల పరిరక్షణ నెపంతో సభను అడ్డుకున్నారు. దీనితో శాంతి చర్చల కమిటీ నిరసన తెలిపింది. ఇండోర్ సభల నిషేధంపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 2న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అమరుల కుటుంబాల ప్రతినిధులు చేసిన బోడుప్పల్ ‘భూ పోరాటం’ ప్రదర్శనపై లాఠీచార్జ్ చేసి, మహిళా నిరసనకారులను బలవంతంగా నిర్బంధించారు.

అమరుల కుటుంబాలకు ఇచ్చిన 250 గజాల ప్లాట్ల హామీని అడిగినందుకు ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ నిబంధనల పేరుతో పోలీసులతో అరాచకంగా దాడి చేసిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల సవాల్ మేరకు రూ. 2,000 కోట్ల గురుకుల టెండర్ అవినీతిపై చర్చకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులు టి. హరీశ్ రావు, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ను  తెలంగాణ భవన్ వెలుపల అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత ఏప్రిల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మహిళా రిజర్వేషన్ బిల్లు స్థంభనకు వ్యతిరేకంగా నిరసన తెలపకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాస్తున్నదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గురుకుల టెండర్ల వివాదం
జూలై 2, 2026న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన పరిణామాలు కేవలం సాధారణ రాజకీయ ఘర్షణ మాత్రమే కాదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే బలమైన ఆధారాలను ప్రతిపక్షాలు ముందుకు తెచ్చాయి. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల సంక్షేమం పేరుతో జరిగిన కొనుగోళ్లలో దాదాపు రూ.2,000 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు డాక్యుమెంటరీ ఆధారాలతో ఆరోపించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు వివిధ సందర్భాలలో ప్రతిపక్షాలకు బహిరంగ చర్చల సవాళ్లు విసిరారు. అయితే హరీశ్ రావు, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అవినీతికి సంబంధించిన ఫైళ్లతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సమావేశానికి సిద్ధమవగా, కాంగ్రెస్ మంత్రులు చర్చా వేదికను హఠాత్తుగా గన్ పార్క్ (అమరవీరుల స్మారకం) వద్దకు మార్చారు. సవాల్‌ను స్వీకరించి గన్ పార్క్ వైపు వెళ్తున్న హరీశ్ రావును, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు మధ్యలోనే బలవంతంగా నిర్బంధించి డీసీఎం వాహనాలలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కారణమైన గురుకుల నిధుల మళ్లింపు, కొనుగోలు విధానాలలోని అక్రమాలను బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు.

“రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల, ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులను అణచివేయడానికి ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలను అనుసరిస్తున్నది. ఈనెల 5న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్ వీకే)లో విప్లవ రచయితల సంఘం(విరసం) “ఫాసిజంపై సెమినార్” ను నిర్వహించతలపెట్టగా, చివరి నిమిషంలో ప్రభుత్వం అడ్డుకున్నది. ముందస్తు శాంతిభద్రతల పరిరక్షణ నెపంతో సభను అడ్డుకున్నారు.”

గత ప్రభుత్వం హయాంలో గురుకుల విద్యార్థుల యూనిఫారాలను కేవలం ప్రభుత్వ చేనేత సంస్థ ‘టెస్కో’ ద్వారానే కొనుగోలు చేసి నేత కార్మికులకు ఉపాధి కల్పించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం టెస్కోను దాటవేసి పెద్ద ఎత్తున గుత్తేదారులైన ప్రైవేటు కార్పొరేట్ వ్యాపారులకు టెండర్లు కేటాయించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో నేత కార్మికుల పొట్టకొట్టి, ప్రైవేటు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన ఉన్నదని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకమైన సాధారణ టెండర్ విధానం ద్వారా స్థానిక వ్యాపారులకు అవకాశం దక్కేదన్నారు. దళిత పారిశ్రామికవేత్తల సంస్థ ‘లిడ్‌కాప్’ ద్వారా చర్మకారులకు ఉపాధి కల్పించేలా కొనుగోళ్లు ఉండేవని, ఇప్పుడు లిడ్‌కాప్ నిబంధనలను ఉల్లంఘించి ఇతర ప్రైవేట్ బహుళజాతి కంపెనీలకు ఆర్డర్ల బదిలీ చేశారన్నారు. నియంత్రిత మార్కెట్ ధరల ఆధారంగా స్థానిక సరఫరాదారుల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు నిత్యావసరాలను సరఫరా చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యవస్థాపకుల ఉపాధిని దెబ్బతీస్తూ, ‘చేవెళ్ల డిక్లరేషన్’ లోని హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఆహార సరఫరా కాంట్రాక్టులను కేంద్రీకృతం చేసి, ధరలను కృత్రిమంగా పెంచడం ద్వారా దాదాపు కాంగ్రెస్  రూ. 800 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టిందంటున్నారు.

 ప్రభుత్వ అణచివేత వ్యూహం
ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ విమర్శలను క్రిమినల్ నేరాలుగా మారుస్తూ పౌరులను వేధిస్తున్న తరుణంలో, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులు రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులకు బలమైన రక్షణ కవచంగా నిలిచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూ, “కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన తెగులు” అని ఒక నెటిజన్ తన ఎక్స్ ఖాతా @నల్లబాబు (దుర్గం శశిధర్ గౌడ్) ద్వారా చేసిన రాజకీయ వ్యంగ్య పోస్టులపై పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసులో న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ తీర్పునిస్తూ, తీవ్రమైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం సంపూర్ణ రక్షణ కలిగి ఉంటాయని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించనంత కాలం లేదా శాంతిభద్రతలకు తక్షణ ముప్పు లేనంత కాలం కేవలం కఠినమైన రాజకీయ విమర్శలను క్రిమినల్ నేరాలుగా పరిగణించలేమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసుల ఇష్టారాజ్య వ్యవహారాలకు అడ్డుకట్ట వేయడానికి హైకోర్టు పటిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. క్రిమినల్ పరువు నష్టం అనేది ఒక నాన్-కాగ్నిజబుల్ నేరమని, దీనిపై బాధితుడు కాకుండా పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరన్నది. సోషల్ మీడియా పోస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ జరపడం తప్పనిసరి అని చెప్పింది. రాజకీయ ప్రాధాన్యత కలిగిన కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకోవాలన్నది. ఫిబ్రవరి 2026లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి. పార్థీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసి, హైకోర్టు మార్గదర్శకాలను సంపూర్ణంగా ధృవీకరించింది. కోర్టుల ద్వారా లభించిన రాజ్యాంగ రక్షణలను దాటవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం “తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాల, ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు – 2026” ను తెరపైకి తెచ్చింది. ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత నిరంకుశంగా ఉన్నాయి.

వాటి ప్రకారం ఒక నియమిత ఎగ్జిక్యూటివ్ అధికారి కోర్టుల ముందస్తు అనుమతి లేకుండానే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని డిజిటల్ సమాచారాన్ని బ్లాక్ చేయడానికి లేదా తొలగించడానికి నిరంకుశ అధికారాలు కలిగి ఉంటారు. ఈ బిల్లు కింద నమోదు చేసే నేరాలు కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ కావడంతో, పోలీసులు ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే వీలున్నది. మొదటి తప్పుకు 1 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా, పదేపదే తప్పు చేసేవారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేస్తుందని, ప్రభుత్వ వ్యతిరేక గొంతులను నొక్కడానికి ఉపయోగపడే “రాజకీయ అణచివేత ఆయుధం” అని విపక్షాలు, పౌర హక్కుల మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ బిల్లును శాసనసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాల్సి వచ్చింది.

మరో ప్రజాస్వామ్య తిరుగుబాటు తప్పదా?
తెలంగాణ ఆత్మగౌరవ ప్రస్థానంలో ఏకపక్ష కేంద్రీకృత అధికారానికి, నిరంకుశత్వానికి చోటు లేదని 2023 ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది సంక్షేమ పథకాలతో పాటు ప్రజాస్వామ్య స్వేచ్ఛను ఆస్వాదించడానికే. కానీ నేడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గత పాలకుల నిరంకుశ విధానాలను మించిపోతున్నాయి. ‘ప్రజాపాలన’ అనే ఆకర్షణీయమైన బోర్డు వెనుక ‘నయా ఫాసిస్టు’ పోకడలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. బహిరంగ సభలపై నిషేధాలు, రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, జర్నలిస్టులపై దేశద్రోహ చట్టాల ప్రయోగం, సరికొత్త బ్లాక్‌మెయిలింగ్ చట్టాల రూపకల్పన వంటి పరిణామాలు తెలంగాణ స్వయంపాలన ఆకాంక్షను, బలిదానాలను అపహాస్యం చేస్తున్నాయి. ఒక ప్రభుత్వం తనను ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో తొక్కిపెట్టాలని చూస్తే, అదే ప్రజలు తిరిగి తిరగబడతారనేది చారిత్రక సత్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యం నేడు సంక్షోభంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవ్యవస్థ, పౌర సమాజం సాగిస్తున్న పోరాటం భవిష్యత్తుపై ఆశలను రేకెత్తిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడో గ్యారెంటీని చిత్తశుద్ధితో అమలు చేయకపోతే, తెలంగాణ గడ్డపై మరో ప్రజాస్వామ్య తిరుగుబాటు తప్పదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

✍️ మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *