కాకతీయ కలగూర గంప – 9
ఒడ్డూ పొడుగు ఆకారంబీ చామనచాయ శరీరంబీ మెరుస్తున్న కళ్లుబీ సాధారణ తెల్లని కాటన్ లూజ్ పైజామా, లాల్చీబీ కంచు కంఠం – ఇదీ నేను ఎప్పుడో 60 ఏండ్ల క్రితం కనీసం 50 సార్లైనా చూసిన సురమౌళిగారు. మా ఇంట్లోనో లేదా వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రక్కన వున్న మా కాకతీయ ప్రెస్ లోనో కనీసం ఒక గంటైనా కూర్చునేవారు. రోడ్డుపై చూసిన సందర్భాల్లో చేతిలో పుస్తకంతో ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న ఆ ఆకారం! రిక్షా ఎక్కిన సురమౌళి గారిని నేనెప్పుడూ చూడలేదు. ఆయనకు కాళోజీ గారిని, పీ వీ గారిని, ‘నువ్వు’ అని పిలిచే అంత దగ్గరితనం. ఇక పాములపర్తి సదాశివరావు గారితో గంటల తరబడి చర్చలు, వాదనలు. పీ వీ గారు హైదరాబాద్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రి గా వున్నప్పుడు తరచుగా కలిసే వారు. పీ వీ గారు ఎప్పుడైనా ఎక్కడైనా ముఖ్య విషయం పై ఉపన్యాసం చేస్తే దానిపై ‘సురమౌళి కామెంట్స్ ఏమిటి?’ అని సదాశివ రావును అడిగే వారు నేటి తరానికి తెలియని ‘సురమౌళి’, 60 ఏండ్ల కింద తెలంగాణ అంతటికీ బాగా పరిచయమైన పేరు. ఆ రోజుల్లో సురమౌళి అంటే ఒక నడుస్తున్న కుల నిర్మూలన, హేతువాద, నాస్తికోద్యమం! అంతేకాదు – ఆయన తెలుగు రచనా ప్రక్రియలలో వివిధ రంగాలు స్పృశించిన గొప్ప సాహితీవేత్త. కథకుడిగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, నాటక కర్తగా, అనువాదకుడిగా పేర్గాంచారు. ఆయన అడ్వకేటుగా, రేడియో ప్రయోక్తగా, న్యూస్ రీడర్
గా, సహకార సంఘ ప్రచారకుడిగా, వివిధ పత్రికలకు జర్నలిస్టుగా పనిచేసారు. సురమౌళి కథలన్నింటిలో (15 దాకా వుంటాయి) అప్పటి తెలంగాణ జీవితం, భాష రెండూ చిత్రితమయ్యాయి. హైదరాబాద్ లో వున్నపుడు ప్రతి సంవత్సరం కులాంతర వివాహ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వాటికి విస్తృత ప్రచారం గావించారు. లబ్ధప్రతిష్టులైన వ్యక్తుల చేత వివిధ సభల్లో ఉపన్యాసాలిప్పించారు. అంబేద్కర్ గారి గురించి తెలుగు ప్రజలకు సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రముఖ సోషలిస్ట్ పార్టీ నాయకుడు మధూ లిమాయే రాసిన పుస్తకాన్ని తెలుగు లోకి ఆ రోజుల్లోనే ‘వైతాళికుడు అంబేద్కర్’ అని అనువదించారు.
ఇక గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారు గొప్ప నాస్తిక వాదే కాకుండా నాస్తిక వాద ప్రచారానికి తన జీవితమంతా ధారపోసిన వ్యక్తి. ఒరిస్సాలోని ఒక సాంప్రదాయ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1902 లో జన్మించిన ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో వృక్ష శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొంది కొంత కాలం మధురై, కోయంబత్తూర్, కొలంబో, కాకినాడల్లోని వివిధ కాలేజీలలో బాటనీని బోధించారు. 1920లోనే మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. 1922 లో వారి వివాహం సరస్వతి గారితో జరిగింది. 1940లో ఆయన భార్య సహకారంతో కృష్ణా జిల్లా లోని ముదునూరు గ్రామంలో నాస్తిక కేంద్రాన్ని నెలకొల్పారు. 1947 లొ దానిని విజయవాడకు మార్చారు. గాంధీగారితోనూ, తర్వాత వినోబాభావేగారితోను ఆయనకు చాలా సాన్నిహిత్యముండేది. గాంధీ గారితో ఆయన అనేక ప్రత్యుత్తరాలు గావించారు. గాంధీని మొదటి సారిగా కలిసిన గోరా తాము చేస్తున్న కుల మతాల కతీత సామూహిక భోజన కార్యక్రమాలూ, వయోజన విద్యా తరగతుల నిర్వహణా గురించి వివరించారు.
అప్పుడు గాంధీ ‘మీ మాటల్లో నాకు ఒక ఆదర్శం కనబడుతుంది. నా దైవారాధన గొప్పదీ, మీ నాస్తికత్వం తప్పనీ నేను చెప్పలేను. మనిద్దరమూ ‘సత్య’ పరిశోధకులం. మన మార్గంలో తప్పు తెలుసుకున్నప్పుడు ఆ మార్గ దిశను మార్చుకునే సంకల్పం మనకు వుంది.’ కాబట్టి మీ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించుకోండి. మీ పధ్ధతులు నాకు నచ్చకున్నా నా సహాయం మీకు వుంటుంది.’
గాంధీజీ దృష్టిలో ‘భగవంతుడంటే సత్యం’. నాస్తికులు కూడ సత్యాన్ని గౌరవిస్తారు కనుక ఈ విధంగా ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య సాన్నిహిత్య మేర్పడిరది.

1961 లో అనుకుంటా, సురమౌళి, గోరా గారిని వరంగల్ కు ఆహ్వానించారు. ఆంతకు ముందే గోరాగారికి మా నాన్న (పాములపర్తి సదాశివరావు) తో సాన్నిహిత్యమున్న కారణంగా ఆయన రెండు రోజులు మా ఇంట్లోనే బస చేసారు.పొద్దున్నే 5 గంటలకే లేచి ఆయన మా ఇంటి వెనక గల చేద బావిలో నీళ్ళు తోడుకొని చన్నీళ్ళు స్నానం చేయడమే కాకుండా పక్కనే వున్న గంగాళం, కొప్పెర నింపే వారు. కుటుంబ సభ్యులలో ఒకడిగా మెలిగి ఎంతో అప్యాయతతో అందరినీ పలకరించే వారు. ఇంటి వెనుక పెరడులో అమర్చిన రాళ్ళ పొయ్యిలో కట్టెలను వెలిగించి వేడి నీళ్ళను (మిగతా వారి కొరకు) కాచే వారు. ఆ రెండు రోజుల్లోనే ఆయన ఇంట్లో అందరికీ చాలా దగ్గరి వ్యక్తిగా అయ్యారంటే అది ఆయన సాధారణ జీవిగా మెలిగే భావాలు కల అతి గొప్ప వ్యక్తి కాబట్టే! చివరగా, గోరా షష్టి పూర్తి సందర్భంగా (1962లో) రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సన్మాన సంఘంలో కాళోజీ, పాములపర్తి సదాశివరావు (వరంగల్ ), కానా (సూర్యాపేట) గార్లు ముగ్గురు తెలంగాణా జిల్లాల నుండి ప్రాంతీయ కార్యదర్శులుగా నియమింపబడ్డారు. ఆ సందర్భంగా గోరాగారు చేసిన వివిధ ఉద్యమాల గురించి సదాశివరావు రాసిన వ్యాసం ‘ఉద్యమాలు’ గోరా అభినందన సంచికలో ప్రచురింపబడిరది.
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్ రావు





