– హెచ్‌ఎండీఏ/హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అన్ని రోడ్ నెట్‌వర్క్స్‌ను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని, భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ సహా అన్ని అంశాలను ఇందులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌ఎండిఏ/హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధిలోకి రావాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేదంటూ ఆ రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ‘ఔటర్’ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నాడంటూ ఆ రోడ్డు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. టీడీఆర్‌పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. .ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చేయాలని, ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చెయ్యాలని చెప్పారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాలన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్-1ను డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. రోడ్డు నిర్మాణం నాణ్యతలో రాజీ లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణంలో వాడే మట్టిపై జాగ్రతలు తీసుకోవాలని, రోడ్లకిరువైపులా పచ్చదనం ఉండేలా చూసుకోవాలని సూచించారు. బద్వేల్ ఇంటర్ ఛేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకమన్నారు. ఎలేవేటెడ్ కారిడార్ 111 పనులు వేగవంతం చేయాలని, కారిడార్ బంజారాహిల్స్ నుంచి శిల్పా లే అవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందన్నారు. భూ సేకరణను వేగవంతం చేయాలని, అధికారులు అలసత్వం చూపించొద్దని, రోడ్ల ప్లానింగ్, నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దని స్పష్టం చేశారు. సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎంఏయూడీ) జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





