22ఏలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : భూభారతి- 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భూభారతి, 22ఏపై శనివారం మహాధర్నా నిర్వహించారు. శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ మహా ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో మధ్యతరగతి కుటుంబాలను, రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. గత బీఆరఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఒక బ్లాక్‌లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వ్యవస్థను అప్పగించి అవకతవకలకు పాల్పడితే ఆ లోపాలను సరిదిద్దేందుకు భూభారతి తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత ఘోరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితాలోని భూములను తొలగిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పు జరిగిందని ముఖ్యమంత్రి, మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. రైతులే కాక మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లోో చిన్నచిన్న ప్లాట్లు కొనుక్కుని నిర్మించుకున్న మధ్యతరగతి ప్రజల ఇళ్లను, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని నిర్మాణాలను కూడా 22ఏ జాబితాలో చేర్చడం శోచనీయ మని అన్నారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు భూముల పేరు చెప్పి ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం(మాలఫైడ్ ఇంటెన్షన్) స్పష్టంగా కనిపిస్తోందని, ఇది కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికేనని ఆరోపించారు. ఏదైనా సర్వే నంబర్‌లో కొంత భాగంపై వివాదం ఉంటే ఏకంగా మిగతా సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కడుపు కొట్టేలా సాగుతున్న ఈ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, రైతులు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కలెక్టర్లు సమయం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది తమ భూములను అమ్ముకోలేక, పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకోలేక తీవ్ర క్షోభకు గురవుతున్నారన్నారు. సొంత భూమిపై హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన మానవ హక్కు అని, రాష్ట్ర ప్రభుత్వం ఆ హక్కులను తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడితే, కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ మాత్రమే బాగుపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే సభను రెండు రోజులకే పరిమితం చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ధర్నాలకు కూడా అనుమతులు ఇవ్వడానికి భయపడుతోందని అన్నారు. 22ఏలోని రైతుల, ప్రజల భూములన్నింటినీ తక్షణమే విముక్తి చేయాలని, లేనిపక్షంలో సడక్ నుంచి సదన్ వరకు బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని రామచందర్ రావు హెచ్చరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, డి.కె.అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ కొమురయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, డాక్టర్ గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *