వేధింపులకు గురిచేయడం తగదు

– సిబ్బంది, ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి
– ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం హితవు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: కిందిస్థాయి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్‌స్థాయి అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శుక్రవారం జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ప్రవర్తించి పనులు చేయించుకోవాలన్నారు. డిపో మేనేజర్లు ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఈనెల 17 లోగా డిపోలు, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం, పరిశుభ్రత పాటించాలన్నారు. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు వంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ ఎంలు, డిపో మేనేజర్లు సమీక్షించుకోవాలన్నారు. టికెట్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోవాలని, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదని అన్నారు. సంస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయమన్నారు. ప్రతి రెండో మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుంచి మొదలు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంచి సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దామని, మంత్రి నుంచి సిబ్బంది వరకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెలో కార్మికులు డిమాండ్ చేసిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. జూమ్ సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఆర్ఎంలు, వివిధ విభాగాల హెచఓడీలు, డీఎంలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *