కాంగ్రెస్ కు మళ్లీ అధికారం క‌ల్ల‌

– అడ్డూఅదుపు లేకుండా అవినీతి
– ఆ పార్టీ అరాచకాలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
– ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న బీజేపీ
– గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి పెంపు ఇందులో ఒకటి
– ఉమ్మడి రంగారెడ్డి పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేసే అవకాశమే లేదని, ఆ పార్టీ కనీసం ఇరవయ్యేళ్లపాటు అధికారంలోకి రావడం కల్ల అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికితోడు ఆ పార్టీ నేతలు చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో నంది నగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కమీషన్లు, కాసుల కక్కుర్తితో వ్యవహరిస్తున్నదని, రంగారెడ్డి జిల్లాలో భూములతోపాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు మంత్రులే స్వయంగా పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. నిన్న కమర్షియల్ గ్యాస్ ధర రూ.వెయ్యి పైన పెంచడమే ఇందుకు ఒక ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై నిత్యావసర సరకుల భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడి నాయకులు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచకుండా ఉండడంతోపాటు నిన్న సిలిండర్ ధర పెంచినందుకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరను వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. కాగా, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బీఆరఎస్ చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్, బీజేపీల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రతి ఒక్క యువతి, యువకుడి ఓటు హక్కు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. అలాగే త్వరలో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సమయత్తం కావాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసినందుకు పార్టీ నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *