ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే

– బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నాడు కేసీఆర్ సర్కారు నిర్బంధం.. నేడు రేవంత్ అహంకారం.. కార్మికులారా అధైర్యపడకండి, మీకు తోడుగా బీజేపీ ఉంది అని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆవేదన ఈ స్థాయికి చేరుకోవడం చూస్తుంటే మనసు తరుక్కుపోతోందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకార పాలనకు నిదర్శనమని, ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు. రెండేళ్లుగా కార్మికులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. సమస్యలు తీర్చాల్సింది పోయి సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించడం, మానసిక వేదనకు గురిచేయడం రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యానికి పరాకాష్ట అన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, సర్కారు ఉద్యోగులుగా చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. 2019లో ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేసినప్పుడు అప్పటి కేసీఆర్ సర్కారు చేసిన అరాచకాలను మర్చిపోలేదు.. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను స్వయంగా నిరాహార దీక్షకు దిగితే తమని ప్రభుత్వం అరెస్టు చేసింది అని గుర్తు చేశారు. ఆనాడు 40 మందికిపైగా కార్మికులు బలిదానమైతే కనీసం వాళ్ల అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వకుండా మృతదేహాలను కూడా లాక్కెళ్లిన దుర్మార్గపు పాలన అది అని వివరించారు. ఆనాడు కార్మిక సంఘాలను రద్దు చేసి పీఎఫ్ బకాయిలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టిన బీఆరఎస్ నేతలకు ఇవాళ మద్దతు అని మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని నిలదీశారు. కాంగ్రెస్ అయినా, బీఆరఎస్ అయినా ఆర్టీసీ కార్మికులకు ద్రోహం చేసిన పార్టీలేనన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, 32 న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని. ఉచిత బస్సు పథకం బకాయిలు వెంటనే ఆర్టీసీకి విడుదల చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, అణచివేత రాజకీయాలు మానుకుని ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాంమని హెచ్చరించారు. ఆర్టీసీ కుటుంబ సభ్యులారా.. దయచేసి ఎవ్వరూ అధైర్యపడకండి.. ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబాలను రోడ్డున పడేయకండి.. ప్రాణం తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదు అని విజ్ఞప్తి చేశారు. మీ కోసం, మీ హక్కుల కోసం పోరాడేందుకు బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. మీ విజయం వరకు విశ్రమించం.. ఇది బీజేపీ సంకల్పం అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *