– కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు
– శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం
నర్సంపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే విషయమపై ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. శంకర్‌గౌడ్, ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో అంతిమ యాత్రను కొనసాగించేందుకు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరిపేందుకు ఆర్టీసీ జేఏసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్టీసీ జేఏసీ, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల నిర్ణయమే ఫైనల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మండుటెండలో రోడ్డు పక్కనే మూడు గంటలుగా కేంద్ర మంత్రి ఉండిపోయారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసులు మంతనాలు జరిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జేఏసీ నేతలకు నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నించారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులతోనూ మంతనాలు జరిపారు. ముత్తోజీపేటలోనే అంత్యక్రియలు జరిగేలా సహకరించాలని కోరారు.
ముత్తోజీపేట నుండి బయలుదేరిన బండి సంజయ్
శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ విజ్జప్తి మేరకు ముత్తోజీపేట నుండి బయలుదేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘నేను పబ్లిసిటీ కోసం రాలేదు. ఆర్టీసీ జేఏసీ, శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల నిర్ణయానికే వదిలేశాం.. వాళ్లు మాట్లాడుకుని అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.. శంకర్ గౌడ్ కుమారుడిని సైతం పోలీసులు కొట్టి స్టేషన్‌కు తరలించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. శంకర్ గౌడ్‌కు సొంత ఇల్లు కూడా లేదు.. ప్రభుత్వం చేసే రూ.10 లక్షల సాయం దేనికి పనికొస్తుంది..
శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి.. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరుతున్నా.. ఆర్టీసీ కార్మికులకు యుద్దం కొత్త కాదు.. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది..
డిమాండ్ల సాధనలోనూ కొట్లాడాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తిగా మద్దతిస్తోంది.. వారి పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు.
మృతదేహంతో పోలీసుల రాజకీయాలేంది?
అంతకుముందు ఆయన నర్సంపేటలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. శంకర్ గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉంచి నివాళి అర్పించాలన్నది కుటుంబ సభ్యుల కోరిక.. 22 ఏళ్ల అనుబంధమున్న ఆర్టీసీ డిపో వద్ద శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళి అర్పించాలన్నది ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష అని తెలిపారు. డిపో వద్ద శంకర్ మృతదేహాన్ని ఐదు నిమిషాలు ఉంచేలా అనుమతించాలని కోరితే ఇంత గొడవ ఎందుకు.. శాంతిభద్రతల సమస్యే ఉండదు కదా అని పోలీసులను ప్రశ్నించారు. శంకర్ గౌడ్ ఇంటి ముందు టెంట్ వేసిన వాళ్లను సైతం పోలీసులు బెదిరిస్తున్నారని, తాము చెప్పినట్లు వినకపోతే బెనిఫిట్స్ ఇవ్వబోమని శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ సహచరుడిని కడసారి చూసుకుందామనుకుంటే ఎందుకు అనుమతించడం లేదు అని నిలదీశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అంటూ లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా నేను చూసుకుంటా అని స్పష్టం చేశారు. 5 నిమిషాలపాటు ఆర్టీసీ డిపో వద్ద శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని ఉంచండి.. నివాళి అర్పించిన తరువాత దహన సంస్కారాలు జరిపించండి అని కోరారు. శవ రాజకీయాలు చేస్తున్నామంటూ తమపై కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం సిగ్గు చేటన్నారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్ బాబు భౌతిక కాయం విషయంలో కాంగ్రెస్ నేతలు చేసింది శవ రాజకీయమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




