అధికార స్థిరీకరణకు దారి విజన్2047?

“గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా పాలించినా ప్రజలు తమకిచ్చిన ఐదేళ్ళకాలంకే ప్రణాళిక రచించి అమలుచేశారు. ప్రాజెక్టులు,దారిద్య రేఖ దిగువన నివసించే ప్రజలకు శాశ్విత పధకాలు, ఆధునిక విద్యా విధానం, ఆధునిక టెక్నాలజీ అలా వచ్చిందే! కొంతలో కొంతైనా శాశ్వత అభివృద్ధి కనిపించింది.”

ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514.
ఇమెయిల్ ఐడి: thirmal.1960@gmail.com

అధికారం తలకెక్కిన ఏ ప్రభుత్వం అయిన సుదీర్ఘ కాలం అధికార భాగస్వామ్యం కోరుకుంటుంది.తానొవ్వక, నొప్పించక అనే రీతిలో పాలన చేసిన పాలకవర్గాలు అలా కోరుకోవడంలో తప్పులేదు.. కానీ ఎడాపెడా అప్పులు చేసి,కనీసం ప్రణాళిక లేనీ, వీలు చిక్కినప్పుడల్లా కనీస ప్రజాస్వామ్య విలువలను మరచి నిరంకుశ విధానాలను స్వీకరిస్తున్న ఆధునిక పాలక పక్షాలు నోట తరచుగా వినిపిస్తున్న మాట.ఈ విజన్ 2047.అంటే 2047నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ళు పూర్తి అవుతుంది. ఈ 75ఏళ్ళలో చేయలేని పనిని ప్రస్తుతం పాలక పక్షాలు మరో 25ఏళ్ళు మాకే అధికారం ఇవ్వండి.. మేం చేసి చూపుతాం అంటున్నారు. అధికార స్థిరీకరణ కొరకు పాలకులు తెస్తున్న కొత్త నినాదం తప్ప దీనిలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు..! పార్టీలు వేరైనా పాలకులు అందరూ అదే పాట పాడుతున్నారు.

కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ డెబ్బయి అయిదేళ్ళ వయోబారం మోస్తూ కూడా మరో ఇరవై ఐదేళ్ళు తానే అధికారం లో ఉంటానని, 2047నాటికి ఆత్మ నిర్భర భారత్,వికసిత్ భారత్ తన లక్ష్యమని ఆయన కోరుకుంటున్నారు.ఏక పార్టీ వ్యవస్థ ఉన్న రష్యాలోని పుతిన్ లాగా ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో అంతకాలం ఒకే వ్యక్తి అధికారం చెలాయించడం సాధ్యం అయ్యేపనేనా? అందుకోసం ఆయన ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నారు. రాజ్యాంగం స్వతంత్ర సంస్థలుగా నిర్వచించిన కేంద్ర సంస్థలను కనుసన్నల్లో నడిపించే వ్యూహాలు ఆయన ఇప్పటికే అమలు చేస్తూనే ఉన్నారు. నిరంకుశ, నియంతృత్వ విధానాలని ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా ఆయన మౌనంగా ఉండి ఖాతరు చేయడం లేదు. దేశపరిపాలనలో స్థిరత్వం అటుంచి, అంతర్జాతీయ సంబంధాల్లో కూడా మునుపెన్నడూ లేని గందరగోళానికి బాటలువేశారు. సంఘ్ పరివార్ ఎజెండాను దేశంలో విస్తరించడం తన సుదీర్ఘ స్వప్నం గా ధృవీకరించుకున్నారు.మతప్రసక్తిలేని లౌకిక రాజ్యాంగ పరిధిలో అధికారికంగా వంద రూపాయల బిళ్ళపై తన పరివారం బొమ్మలు,మత జెండాను ముద్రించి తన పగటి కలలను అందరూ చూస్తుండగానే నెరవేర్చుకున్నారు.

ప్రభుత్వరంగ వనరులు,సంస్థలన్నింటినీ అదేపనిగా ఆశ్రిత పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నారు. అరచిగీపెట్టిన కంఠశోష తప్ప మరో సమాధానం లేదు.ఇక ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అప్పు మిగతా ప్రధానులు అందరూ కలిసి చేసిన అప్పుకు రెట్టింపు అయ్యింది,హిందీ భాషలో తియ్యటి షుగర్ కోటింగ్ నినాదాలు తప్ప నిర్థిష్టమైన ప్రణాళిక ఒక్కటీ కనపడదు.అయినా మనకున్న ఏదో ఒక జాడ్యం ఆయన అధికారం చుట్టూ ఇనుప కంచెగా కాపలా గా నిలబడింది.ఎవరేమను కున్నా మరో ఇరవై ఏళ్ళు ఇలాగే అధికారం లో ఉండాలని 2047కల్లా సంపూర్ణ భారత్ కలలతో దేశ ప్రజలను బతుకు మంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలకొస్తేకేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ వెన్ను దన్ను తో అధికారంలోకి వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచ్చం అదే అంటున్నారు, మిగిలిన మూడేళ్ల పాలనా కాదు,2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్గ తుల్యం చేస్తానని ప్రకటించారు. ఈయన కూడా కాలం తెచ్చిన మార్పులను చక్కగా తన ఖాతాలో వేసుకొని తనకంటే ప్రణాళిక బద్దమైన పరిపాలకుడు నలబై ఏళ్ళలో ఎవరూ కనపడరు,వినపడరు అంటారు. నరేంద్రమోదీ మాదిరిగా ఆంధ్రలో పాలన కొనసాగించే దిశగా పోలీసు వ్యవస్థను వాడుకొని ప్రతిపక్ష లపైన క్రూర నిర్బంధ పద్ధతులు అనుసరిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో మరో రెండు లక్షల కోట్ల పైగా అప్పులు తేవడం తప్ప ఈయనలో కొత్తగా కనిపించిన దీర్ఘ కాలిక ప్రణాళిక లేవీ మచ్చుకీ లేవు, నరేంద్ర మోదీ దిల్లీలో అనుసరించిన సిబిఐ,ఇడీ తరహా దాడులను మక్కీకి మక్కీ తీసుకొని అమలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో సిట్ పేరుతో మద్యం కుంభకోణం కట్టి పార్లమెంటు సభ్యులు,అధికారులను జైలుపాలు చేస్తున్నారు.

ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చినా అధికార వర్గాలు తనదైన పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్ళాలి. తాజా పాలక పక్షాలు అధికార వర్గాలను పక్షపాతకులుగా,అధికారులను కోర్టులుగా మార్చుకోవడం వలన స్థిరంగా, నిబ్బరంగా ఉండాల్సిన అధికారవర్గాలలో గుబులు పుట్టించే పరిస్థితి, ఊబిలోకి దించే పరిస్థితి కనపడుతోంది. ఇంచుమించు నరేంద్ర మోదీ కంటే వయస్సులో పెద్దవాడైన చంద్రబాబు కూడా తన విజన్2047కు మద్దతు ఇవ్వమని,అంటే మరో ఇరవై ఐదేళ్ళు అధికారం తమఖాతాలో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. పేరుకు విపక్షం కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాను ఏమీ తక్కువ తినలేదు .రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ తో భవిష్యత్తు ఇందిరమ్మ పాలనా నమూనా త్రీడీలో చూపించారు. ఇక నెంబర్ వన్ తెలంగాణా రైజింగ్ విజన్ 2047 పేరుతో ఇప్పటికే సర్వే ప్రారంభించారు.

ఈ మేరకు రాష్ట్రం లో ఉన్న మేధావి వర్గానికి ప్రణాళిక రూపకల్పన భాగస్వాములు కావాల్సిందిగా మెసేజ్ లు పంపించారు.ఓ నాలుగు లక్షలమంది స్పందించినట్లు సమాచారం కూడా ఉంది. ఒక రకంగా వయస్సు రీత్యా చూసినప్పుడు నరేంద్ర మోదీ , చంద్రబాబు నాయుడు కంటే రేవంత్ రెడ్డి కల కనడం లో కొంత అర్థం మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన యువకుడిగా అత్యున్నత పీఠంపై అధిష్టించారు. 420 వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిలో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారు,ఎన్ని అసంపూర్ణం గా అమలు పరిచారు, ఎన్ని అసలు మరిచిపోయారు? నిజంగా ప్రజల్లో రేవంత్ పాలనపట్ల ఉన్నసంత్రృప్తి ఎంత? తదితర అంశాల కంటే తన స్వపక్షంలో చెలరేగుతున్న అసంత్రృప్తి మంటలు చల్లార్చడంలోనే ఆయన కాలం కాస్తా కరిగిపోతుంది .ఇప్పటికే రెండేళ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా దీర్ఘ కాళిక ప్రణాళిక ఒక్కటీ కనబడడం లేదు. తెలంగాణా ముఖ్యమంత్రి అనే సోయి పోయి హైదరాబాద్ అభివృద్ధి గురించి పదేపదే మాట్లాడుతున్నా అక్కడా తనదైన ముద్ర తో పూర్తిచేసిన పాలనా సంస్కరణ ఒక్కటీ లేదు..!

పార్టీలు ఏవైనా కానివ్వండి..పాలకులు ఎవరైనా కానివ్వండి…ఎన్నికలముందు విచ్చలవిడిగా నగదు బదిలీ వాగ్దానాలు చేసి ,మితీమీరిన ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన వారే..అధికారం లోకి వచ్చి అప్పులతో సంసారం నెట్టుకొస్తున్న వారే! ఇక తాము చేసిన వాగ్దానాలు ఐదేళ్ళ కాలంలో అణాపైసా వంతు నెరవేర్చలేదనే వాస్తవాలు గ్రహించి నవారే!! అయితే, వీరంతా ప్రజలకు మతిమరుపు ఉందని నమ్మడంకంటే,చిన్న ఆశకంటే మరింత పెద్ద ఆశ కల్పించడం శ్రేయస్కరం అని నమ్మిన వాళ్ళే.. అందులో భాగమే అందరూ ఎత్తుకున్న అభివృద్ధి మంత్రం ఒక్కటే,అది విజన్2047. గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా పాలించినా ప్రజలు తమకిచ్చిన ఐదేళ్ళకాలంకే ప్రణాళిక రచించి అమలుచేశారు.

ప్రాజెక్టులు,దారిద్య రేఖ దిగువన నివసించే ప్రజలకు శాశ్విత పధకాలు, ఆధునిక విద్యా విధానం, ఆధునిక టెక్నాలజీ అలా వచ్చిందే! కొంతలో కొంతైనా శాశ్వత అభివృద్ధి కనిపించింది. 1980 నుండి రాజకీయ పక్షాల విధానాల్లో మార్పులు వచ్చాయి. ఎన్నికల్లో లబ్దికోసం అప్పటికప్పుడు ప్రజల వ్యక్తిగత లబ్దిని దృష్టిలో పెట్టుకొని ఉచిత పధకాలకు రూపకల్పన జరిగింది. అబద్ధాలు, మోసాలు, తప్పుడు ప్రచారం రాజ్యం తేలుతుంది..దీనితో, తాత్కాలిక ఉపశమనం తప్ప,దారిద్య్రరేఖకు దిగువన నివసించే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడలేదు..సరికదా..దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలు మూలన పడ్డాయి. అటు తర్వాత ఉచిత పథకాల స్వరూపం మరింత మారి నేరుగా నగదు బదిలీ వైపు పాలకులు మోగ్గారు. పేదరిక నిర్మూలన పేరుతో కొన్ని ఉచిత నగదు పంపిణీ పధకాల రూపకల్పన ఆయా పాలకవర్గాల ఎన్నికల అవసరాలు తీర్చాయో ,కానీ,ప్రజలు మౌళిక అవసరాలు తీర్చలేదు..దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలు పూర్తిగా అడుగంటాయి. ఇప్పుడు ఆధునిక పాలకులు అనుకుంటున్న నూతన పాలకులు విజన్2047లక్ష్యం మాత్రం ఒక్కటే. ఎన్నికలముందు చేసిన వాగ్దానాలు మరిపించే మంత్రం,పెద్ద ఆశ కల్పించి చిన్న ఆశలకు గండికొట్టడం,ఐదేళ్ళ చిన్న కలలకు బదులు పాతికేళ్ళ శాశ్వత రంగులకలకు అంకురార్పణ! మరో పాతికేళ్ల పరిపాలనా స్థిరీకరణ ప్రణాళికకు పునాది వేస్తున్న దీర్ఘకాలిక నినాదం మాత్రమే విజన్ 2047.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page