– జేఎన్టీయూ అధికారుల అవినీతి లీలలు
– ప్రిన్సిపాల్, అధ్యాపకులు లేకున్నా అఫిలియేషన్ గ్యారంటీ
– కోర్సులకు సరిపడా అధ్యాపకులుండరు
– చేతులు తడిపితే చాలు పనైపోతుంది
– తెలంగాణలో ఉన్నత విద్యకు అవినీతి చీడ
“జేఎన్టీయూ హైదరాబాద్ అనుబంధంగా ఉన్న 141 ఇంజినీరింగ్ కళాశాలల్లో సగానికి పైగా కళాశాలలకు ప్రిన్సిపాల్స్ లేరు. 2026-27 2 సంవత్సరానికి అన్ని కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చినా యూనివర్సిటీ యంత్రాంగం అరవై శాతం పైగా అధ్యాపకులు, ఏ మాత్రం ల్యాబులు లేని కళాశాలకు సైతం అఫిలియేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఏడు నెలలు జీతాలివ్వని కళాశాలలు, కాలేజీ యాజమాన్యం హత్య కేసులో జైల్లో ఉన్న కళాశాలకు కూడా అఫిలియేషన్ ఇచ్చారు.”
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలం గాణలో ఉన్నత విద్య నియంత్రణ లేక పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుంది. మున్సి పల్, పోలీస్, విద్యాశాఖ ఇలా కీలకమైన అన్ని శాఖలు తన దగ్గర ఉంచుకొని ఏ శాఖ సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ అనుబంధంగా ఉన్న 141 ఇంజినీరింగ్ కళాశాలల్లో సగాని కి పైగా కళాశాలలకు ప్రిన్సిపాల్స్ లేరు. 2026-27 విద్యా సంవత్సరానికి అన్ని కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చినా యూనివర్సిటీ యంత్రాంగం 60శాతం పైగా అధ్యాపకులు, ఏ మాత్రం ల్యాబులు లేని కళాశాలకు సైతం అఫిలియేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఏడు నెలలు జీతాలివ్వని కళా శాలలు, కాలేజీ యాజమాన్యం హత్య కేసు లో జైల్లో ఉన్న కళాశాలకు కూడా అఫిలియే షన్ ఇచ్చారు. ప్రతి కళాశాలలో సిఎస్ఈ, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఉన్నాయి వీటికి సరిపడా అధ్యా పకులు లేరు. కనీసం డెఫిషియెన్సీ చూపించాల్సిన పర్యవేక్షక బృందం కళాశాల యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకుని అన్నీ సక్రమంగా ఉన్నట్లు అఫిలియేషన్ ఇచ్చారు. వందకు పైగా కళాశాలల్లో అధ్యాపకులు లేరు. కొన్ని కళాశాలలకు డెఫిషియన్సీ చూపిస్తే ఫ్యాకల్టీ ప్లస్ పోర్టల్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూ జరపకుండానే వాటిని యూనివర్సిటీకి పంపుతున్నారు. ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తించాలంటే కనీసం ఇద్దరు పిహెచ్‌డి పూర్తి చేసిన విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించి వుండాలి. కానీ, ప్రిన్సిపాల్స్ చాలామంది ఉత్తరాదిన పనికిమాలిన విశ్వవిద్యాలయాల్లో రీసర్చ్ గైడ్ గా వ్యవహరిస్తున్నట్లు దొంగ సర్టిఫికెట్ తీసుకువస్తున్నారు. ఉదాహరణకు 2019 లో పిహెచ్‌డి పూర్తి చేసిన వ్యక్తి దగ్గర 2021లోనే ఇద్దరు పరిశోధన విద్యార్థులు పిహెచ్‌డి పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించిన పదిహేను మందిని ప్రిన్సిపాల్ గా ర్యాటిఫై చేశారు. డబ్బులిస్తే జేఎన్టీయూ అధికారులు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతారు. సన్ రైస్, జయప్రకాష్ నేషనల్ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సల్ యూనివర్సిటీ, గోల్డెన్ స్టేట్ యూనివర్సిటీ, శిక్ష ఓ అనుసంధాన్ యూనివర్సిటీ, జబల్పూర్ జంబనియా, జంబర్వాల్ టైబ్రేవాలా జెజెటియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గజ్రోల, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పసిఫిక్ యూనివర్సిటీ, లింగయ్య యూనివర్సిటీ, శ్రీ సాయి హెల్త్ యూనివర్సిటీ లలో పిహెచ్‌డి చేసిన వారిని ప్రొఫెసర్ గా రాటిఫై చేసి ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్న ఎంసీఏ, ఎంటెక్, పిహెచ్డి గవర్నమెంట్ యూనివర్సిటీ లో చేసినవారికి చుక్కలు చూపిస్తున్నారు. చాలా కళాశాలల్లో ప్రిన్సిపాల్ ప్రొఫైల్ చూస్తే భారతరత్న తప్ప అన్ని అవార్డులు ఇచ్చినట్టు ఉంటుంది. సాధారణంగా విశ్వవిద్యాలయ అధికారులు అటానమస్ కళాశాలకు బోర్డు ఆఫ్ స్టడీస్ మీటింగుకు వెళ్తుంటారు. మీటింగ్ తరువాత ఐదు వేలు లేకపోతే పది వేలు ముడుతుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక కళాశాలలో జరిగిన బోర్డు అఫ్ స్టడీస్ మీటింగుకు ఏకంగా లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక రాటిఫికేషన్ కు వచ్చిన వ్యక్తులకు గరిష్టంగా పది వేలు ఇస్తారు కానీ ఎందుకు పనికిరాని డిగ్రీలు చదివిన ఈ వ్యక్తులను రాటిఫై చేయడానికి లక్షల్లో చేతులు తడపాల్సిందే. మరి ఇలాంటి కళాశాలలకు వెళ్లిన ప్రతి విశ్వవిద్యాలయ అధికారి వట్టి చేతులతో వచ్చినట్లు చరిత్రలో లేదు. నవ్వి పోదురు కాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకడు యూజీసీ కి సంబంధం లేని విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసిన, ఇంకొకరు అసలు బి.టెక్ చదవలేదు. ఇంకొకరు ఎందుకు పనికిరాని గుర్తింపులేని సిఎంజే విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. ఇంకొక మేడం ఏకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సంతకం, ఉపకులపతి నాగేశ్వరరావు సంతకం ఫోర్జరీ చేసి ఏకంగా అడ్డంగా దొరికారు. సదరు మేడమ్ పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ వద్దని వారించినా వినక అడ్డంగా పులి నోట్లో తల దూర్చారు. జేఎన్టీయూ పరీక్షల విభాగంలో గత ముప్పై సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉంటారు. కీలకమైన విభాగాలలో మూల్యాంకనం, ప్రశ్న పత్రాలు టాబులేషన్ డీటీపీ పనులు వీరితో చేయిస్తుంటారు, ఇక భద్రత ఎక్కడ ఉంటుంది ? జేఎన్టీయూ అనుబంధంగా ఉన్న కాన్‌స్టిట్యూట్ కళాశాలల్లో అధ్యాపకులు లేక టెంపరరీ వేకెన్సీ ఉద్యోగాలకు అభ్యర్థులు కరువయ్యారు. ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లో విశ్వవిద్యాలయాలు మూసుకొని పోవాల్సిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





