మెగా ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో దందాలు

– రూ.70 లక్షల భూమి రూ.21 లక్షలకే ధారాదత్తం
– సింగరేణిలో మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు
– కేంద్ర నిధులకు ఎసరు
– కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
– భూ బాగోతం, బొగ్గు కుంభకోణాలపై శ్వేతపత్రం ఏది?
– సీబీఐ విచారణకు బీజేపీ నేత సుధాక‌ర్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 19: అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టును ప్రభుత్వం తమ అనుయాయులకు, ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు కేంద్రంగా మార్చేసింద‌ని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది నిధులను దుర్వినియోగం చేస్తున్న‌ద‌న్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న పారదర్శకత లేని చీకటి ఒప్పందాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఈనెల 17న లేఖ రాసిన‌ట్లు తెలిపారు. వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించాల్సిన ఈ ప్రాజెక్టు కార్పొరేట్ సంస్థల జేబులు నింపే సాధనంగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ  లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్  ద్వారా సమగ్ర విచారణ జరిపించాల‌ని డిమాండ్ చేశారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను చేకూర్చడం, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ వ్యవస్థలతో కూడిన ప్రపంచ స్థాయి వ్యవసాయ మౌలిక సదుపాయాలను నిర్మించాలనే సమున్నత లక్ష్యంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016 ఫిబ్రవరి 5న ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపింది. సుమారు రూ.109.59 కోట్ల భారీ అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.49.79 కోట్ల  నిధులను గ్రాంట్ రూపంలో విడుదల చేసింది. స్థానిక రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే ఈ ఫుడ్ పార్క్ భూములపై ఇప్పుడు బడా బాబుల కన్ను పడింద‌ని ఆరోపించారు. ఏకంగా 72 ఎకరాల విస్తీర్ణమైన విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు తెరవెనుక పక్కా స్కెచ్ వేసింద‌న్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర రూ.70 నుంచి 80 లక్షల వరకు పలుకుతుండగా కేవలం రూ.21 లక్షల అతి తక్కువ ధరకే ఆ ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఈ వివాదాస్పద టెండర్‌ను రద్దు చేయాలని, ప్రాజెక్టు అమలులో కేంద్ర మార్గదర్శకాలు ఎంతవరకు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు తక్షణమే ఒక సమగ్ర నివేదికను తెప్పించుకోవాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను అభ్యర్థించారు.
రాష్ట్రానికి గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్  సంస్థను సైతం అధికార ప్రభుత్వం అక్రమాలకు అడ్డాగా మార్చేసిందని ఆరోపించారు. కృష్ణారం ప్రాంతంలో అత్యంత కీలకమైన సైలో బంకర్ నిర్మాణంలో కోల్‌కతా కంపెనీతో కుమ్మక్కై నాణ్యతను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. దానికితోడు, సింగరేణిలో ఏకంగా 4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు (పిట్ హెడ్ స్టాక్) మాయమైపోయాయని ఆరోపించారు. సంస్థ లెక్కల ప్రకారం 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, అందులో కేవలం 65.23 మిలియన్ టన్నులు రవాణా జ‌రిగిందని, మిగిలిన ఆ నాలుగు మిలియన్ టన్నుల బొగ్గును ఏ బడా నాయకులు మింగేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు. సంస్థ కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ  నిధులు కూడా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా సాగుతున్న ఈ పచ్చి దోపిడీ, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో భూ కేటాయింపుల బాగోతం, సింగరేణి బొగ్గు మాయం వ్యవహారాలపై వాస్తవాలను వివరిస్తూ తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉందా అని డాక్టర్ సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వర రావు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *