– మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీవోఏ) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వీవోఏలతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క వారికి అందుతున్న సదుపాయాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ అవసరాలపై స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి సంక్షేమం, సేవా భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళా సంఘాల సమాఖ్యలు (వీవోలు) గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, ఆ సమాఖ్యలను సమర్థవంతంగా నడిపించడంలో వీవోఏలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. వారి కృషిని గుర్తించి దేశంలోనే ప్రత్యేకంగా గౌరవ వేతనం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. జీవో 58 ప్రకారం రాష్ట్రంలోని 17,609 గ్రామ సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న వీవోఏలకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వీవోఏల గౌరవ వేతనాల కోసం రూ.661.92 కోట్లకుపైగా ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. మహిళా సంఘాల సమాఖ్యల ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు ప్రభుత్వం అనేక ఆదాయ వనరులను కల్పిస్తోందని మంత్రి తెలిపారు. బ్యాంకు లింకేజ్ రుణాలపై 0.3 శాతం కమీషన్‌ను గ్రామ సంస్థలకు అందిస్తున్నామని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యేటా రూ.50 నుంచి రూ.52 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోందని చెప్పారు. ఒక్కో గ్రామ సంస్థకు సగటున రూ.28,500కు పైగా ఆదాయం లభిస్తోందన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే మార్కెటింగ్ కమీషన్‌లో 90 శాతం వాటాను గ్రామ సంస్థలకు కేటాయిస్తున్నామని, గత ఏడాది 3,195 గ్రామ సంస్థలు ఈ విధానంతో సగటున ఒక్కో సంస్థకు రూ.2.70 లక్షల వరకు లాభాలను ఆర్జించాయని వివరించారు. స్త్రీనిధి రుణాలపై మార్జిన్ వడ్డీ రూపంలో కూడా గ్రామ సంస్థలకు ఆదాయం లభిస్తోందని, ఏ-గ్రేడ్ వీవోలు సంవత్సరానికి సగటున రూ.25 వేల వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నాయని తెలిపారు. గ్రామ సంస్థల ఆదాయాన్నిబట్టి నెలకు గరిష్ఠంగా రూ.25 వేల వరకు అదనపు గౌరవ వేతనం చెల్లించేలా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వీవోఏల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీవిత బీమా, ప్రమాద బీమా, ప్రసూతి ప్రయోజనాలు, చేయÖత పెన్షన్లు, మరణించిన వారి కుటుంబాలకు సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందించే కార్యక్రమాలు అమలులో ఉన్నాయని తెలిపారు. త్వరలో ప్రత్యేక గుర్తింపు కార్డులు, యూనిఫాం చీరలు అందజేయనున్నట్లు చెప్పారు. డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేయడానికి గ్రామ సంస్థలకు దశలవారీగా ట్యాబ్‌లు అందించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కొత్త బుక్ కీపర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వీవోఏలపై పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని వివరించారు. సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సెర్ప్ డైరెక్టర్లు వై.ఎన్.రెడ్డి, నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




