– ‘తెలంగాణ-జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి
– జీఐబీఏ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : సెమీ కండక్టర్ తయారీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్(జీఐబీఏ) ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. కెల్‌స్టర్‌బాక్ నగర మేయర్ మాన్‌ఫ్రెడ్ ఓకెల్ నేతృత్వంలో జీఐబీఏ ప్రతినిధులు సచివాలయంలో ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రెసిషిన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఆటోమేషన్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుకూలతలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వారికి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జర్మనీ కంపెనీల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రెసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను తెలంగాణలోని టాలెంట్ పూల్, ఇండస్ట్రీ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు జర్మనీ, యూరప్ మార్కెట్లకు సులభంగా చేరేలా ప్రత్యేక లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7,8,9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’పై జర్మనీ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జీఐబీఏ చైర్మన్ సెల్వకుమార్ పెరియసామి, సీఈవో నిర్మల్ రామన్ కన్నయ్యన్, ఇన్నోవేషన్ హబ్ రైన్‌మెయిన్ సీఈవో స్టెఫాన్ విట్‌కిండ్ట్, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు కేకే మహేశ్వరి, శ్రీనివాస్ గరిమెళ్ల, వినోద్ కుమార్ అగర్వాల్, లోకేష్ ఫతేపురియా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





