ప్రతిష్థాత్మకంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
– ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ప్రారంభించండి
– సీనియర్ అధికారులతో వివిధ కమిటీల ఏర్పాటుకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
– సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై ప్రజాభవన్‌లో సోమవారం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు హాజరయ్యారు. సమ్మిట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. దీని ద్వారా రోజువారీగా ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. సమ్మిట్ నిర్వహణకు అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్, ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, ప్రోగ్రామ్ డిజైనింగ్, మీడియా-కాంటాక్ట్ అండ్ కమ్యూనికేషన్, ఎంఓయూ కమిటీ తదితర కమిటీలు ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్‌లకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సమ్మిట్-2026కు ప్రత్యేకమైన లోగోను రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేసి వాటితో సమావేశాలు నిర్వహించి సమ్మిట్ కార్యాచరణపై చర్చించాలని తెలిపారు.

దిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం

సమ్మిట్‌కు విస్తృత అంతర్జాతీయ, జాతీయ ప్రచారం కల్పించడంలో భాగంగా అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో దేశ రాజధాని దిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ అధికారులు, ఇతర ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమ్మిట్‌పై ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి సమ్మిట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ రంగాల్లో అభివృద్ధి అవకాశాలను ప్రచారంలో ప్రధానంగా ప్రదర్శించాలని తెలిపారు. సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ రోజువారీ పురోగతి నివేదికను రూపొందించి తనకు అందజేయాలని ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రతి కమిటీకి అప్పగించిన బాధ్యతలు, వాటి అమలు తీరు, పెండింగ్ అంశాలు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. తెలంగాణను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేసేలా ఇన్వెస్ట్ సమ్మిట్-2026ను నిర్వహించాలని, ఇందుకోసం అన్ని శాఖలు ఒకే లక్ష్యంతో సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమావేశంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫ్యూచర్ సిటీ సీఎండి శశాంక, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *