అంబర్‌పేట అభివృద్థికి ఎంతో చేస్తున్నాం

– రెండేళ్లలో మూసారాంబాగ్ బ్రిడ్జిని నిర్మించాం
– పదెకరాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం
– వెయ్యి రోజుల పాలనపై కార్యాచరణ తీసుకున్నాం
– మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి
– రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం
– మెరుగు కానున్న అంబపేట, మూసారాంబాగ్ కనెక్టివిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : విశ్వనగరంగా మారి విద్య, ఉద్యోగావకాశాలతోపాటు ఐటీ, సినిమా పరిశ్రమలకు అవకాశం ఇచ్చింది.. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడేలా ముందుకు పోతోంది.. ఎంత వేగంగా జనాభా పెరుగుతుందో అంత వేగంగా మౌలిక వసతులను పెంచుకోలేకపోతున్నాం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని, తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ అని విభజించామని చెప్పారు. మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని సోమవారం ప్రారంభించిన అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అంబర్‌పేట నియోజకవర్గం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోందని, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు లేవు.. మూసీ మురికి ఒక వైపు, వరదలు మరో వైపు అంబర్‌పేటను ఇబ్బందిపెడుతున్నాయని, చిన్న వర్షం వచ్చినా మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద వచ్చేదని, అనేకమంది ప్రాణాలు పోయాయని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు బ్రిడ్జి కట్టలేదు అని ప్రశ్నించారు. తాము రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.. పదేళ్లలో అంబర్‌పేటలో ఇళ్లు కట్టించి ఇచ్చారా అంటూ తాము పదెకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్‌లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరో అందరికీ తెలుసునని, బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరాయని, బతుకమ్మ కుంటకు వచ్చి విమలక్క పాటలు పాడిందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాం.. ఈ వెయ్యి రోజుల పాలనపై మేం కార్యాచరణ తీసుకున్నాం.. నిరసన తెలుపుతామని కొందరు బయలుదేరారు.. పదేళ్లు తెలంగాణను నడిపించిన వాళ్లు, కబళించిన వాళ్లు ఇప్పుడు నిరసనలు తెలుపుతామంటున్నారు అంటూ విమర్శించారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి సెక్రటేరియట్‌కు వెళ్లి సమీక్ష చేస్తే 11 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు.. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని చెప్పారు.. రూ.16 వేల కోట్ల మిగులుతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు తెలంగాణను అప్పగించింది.. ఏడాదికి రూ.6,500 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తే సరిపోయేది.. తొమ్మిదిన్నరేళ్లలో ఒకే ఒక కుటుంబం రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లో తెలంగాణను నిండా ముంచింది.. జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చింది అని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమస్యలను తాను అర్థం చేసుకుంటా.. 32 నెలల్లో ఎప్పుడైనా 1వ తేదీన జీతాలు ఇవ్వకుండా ఆపామా.. ఉద్యోగులు ఆలోచించాలి.. తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా ఒకటో తేదీనే జీతాలు వేశాం.. ఏ బ్యాంకులు నమ్మడం లేదని ఉద్యోగులు తన దగ్గరకు వచ్చారు.. ఆనాడు ఎలా ఉంది.. ఈనాడు ఎలా ఉందో ఉద్యోగులు ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. ఐదున్నర లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గతంలో ఆరు నెలలకో£సారి జీతాలు ఇచ్చేవాళ్లం.. కానీ ఇపుడు 5నే జీతాలు ఇస్తున్నామన్నారు. 61 ఏళ్లకు ఉద్యోగ వయోపరిమితి పెంచడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.8 వేల కోట్ల బకాయిలు కేసీఆర్ పెట్టిపోయాడు.. రెండు నెలల్లో రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేశాం అని చెప్పారు. ఉద్యోగులు, వాళ్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించామన్నారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 60 మంది చనిపోతే కనీసం కన్నీరు కార్చలేదు.. ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు బయటకు రాలేదు.. ఆడబిడ్డలకు తాము ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం.. 32 నెలల్లో రూ.11 వేల కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. అని ఆయా పథకాల గురించి సీఎం వివరించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నానన్నారు. 25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని, పభుత్వ స్కూళ్లలో లక్ష అడ్మిషన్లు పెరిగాయని, 28వ స్థానంలో ఉన్న తెలంగాణను 18వ స్థానానికి తీసుకువచ్చామని తెలిపారు. పదేళ్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టలేదు..H Ãటిఫికేషన్లు ఇవ్వాలి, ప్రశ్నాపత్రాలు ముద్రించి లీక్ చేయాలి.. ఇదే గత ప్రభుత్వ విధానం.. తమ వెయ్యి రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం.. స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశాం.. రూ.1.70 లక్షల కోట్లను రైతుల కోసం ఖర్చు చేశాం.. కేసీఆర్ వరి వేసుకుంటే ఉరేనని అన్నాడు.. రూ.20,617 కోట్లను రైతు రుణమాఫీ చేశాం.. రూ.30 వేల కోట్లలను ఉచిత రైతు విద్యుత్ కోసం ఖర్చు చేశాం అని చెప్పారు. తెలంగాణలో అప్పులు లేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. కోహెడలో అంతర్జాతీయస్థాయి కొత్త పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నామని, కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకుని మహిళలు ఏనాడైనా బయటకు వచ్చారా అంటూ కమీషన్లకు కక్కుర్తిపడి ఆడబిడ్డలకు నాసిరకం చీరలు ఇచ్చారని ఆరోపించారు. తాము కోటిమంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చామని, ఆడబిడ్డలు తనను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. రూ.2,100 కోట్ల మహిళా సంఘాలకు వడ్డీ కింద బ్యాంకులకు చెల్లించాం..మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశామని, బస్సులకు యజమానులుగా ఆడబిడ్డలను చేశానని తెలిపారు. ఆడబిడ్డలకు ప్రభుత్వ భూములు ఇచ్చి పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తున్నాం.. హైటెక్ సిటీ పక్కన మహిళా సంఘాలకు రూ.1,000 కోట్ల విలువైన మూడున్నరెకరాల్లో వాళ్ల ఉత్పత్తుల విక్రయాల కోసం ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ఏర్పాటు చేశాం.. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను అమెజాన్‌లో అమ్ముతున్నారు అని సీఎం రేవంత్ వివరించారు.

అడిగిన వాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, 3 కోట్ల 48లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నామంటూ వీరిలో బీఆరఎస్ వాళ్లు కూడా ఉన్నారన్నారు. సన్న బియ్యం తింటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఏనాడైనా ఆలోచించాడా అని ప్రశ్నించారు. ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.. హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం.. ప్రజా పాలన అంటే ఇది కదా అన్నారు. వెయ్యి ఎకరాల్లో కేసీఆర్, వంద ఎకరాల్లో కేటీఆర్, జన్వాడలో 50 ఎకరాల్లో కవిత ఫామ్‌హౌస్ కట్టుకున్నారని తెలిపారు. శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను అనాథలా రోడ్డుమీద పడేస్తే మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశానన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీకి పెట్టాను.. వెయ్యి రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించానని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి ఏడాదిపాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారు.. మరి అసెంబ్లీకి ఒక్క రోజు కూడా రాని కేసీఆర్‌ను ఏం చేయాలి అని ప్రశ్నించారు.7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ల ఎదురుగానే అన్ని విషయాలు చెప్తా.. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలి.. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడో, వెయ్యి రోజుల్లో నేను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధం అన్నారు. రేపటి నుంచి ఆరు రోజులపాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. .కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  నవీన్ యాదవ్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *