చొరబాటుదారులూ.. పారిపోండి

– జైల్లో పెట్టి తిండి పెట్టేది లేదు
– బంగ్లాదేశ్ వలసదారులకు సీఎం సువేందు హెచ్చరిక
– సరిహద్దుల వద్దకు చేరుకుంటున్న అక్రమ వసలదారులు

కోల్‌కతా, మే 26: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్‌లోని అక్రమ వలసదారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ నుంచి ప్రభుత్వం వెళ్లగొట్టకముందే పారిపోవాలని అక్రమ వలసదారులకు సీఎం సువేందు సూచించారు. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అంశంపై మాట్లాడుతూ కొత్త చట్టంతో కాకుండా ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టం కిందే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్షణం అక్రమ వలసదారులు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లాల్సిందేనన్నారు. తమ పౌరులను వెనక్కి తీసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని తెలిపారు. బంగ్లా అక్రమ చొరబాటుదారులను జైళ్లకు పంపవద్దని తాను పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. వారికి మనమెందుకు ఆతిథ్యం ఇవ్వాలి.. దేశ వనరులను ఎందుకు దుర్వినియోగం చేయాలి. చొరబాటుదారులు ఏమైనా మన అల్లుళ్లా’ అని ప్రశ్నించారు. కాగా, అక్రమ వలసదారులను వెనక్కి పంపించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లా దేశీయులు స్వదేశానికి తిరుగుముఖం పడుతున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకింపూర్ సరిహద్దు వద్ద మంగళవారం ఉదయం పెద్దఎత్తున వారు గుమికూడారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం ‘గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి‘ అనే నినాదంతో విదేశీయులను దేశం నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడినట్లు గుర్తించిన వారికి, సరైన పత్రాలు లేని వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించడానికి నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. మాల్దాలో తొలి నిర్బంధ కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *