నన్ను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్న కవిత్వమా నీకు దాసోహం అని అవ్యాజమైన తన కవిత్వాను బంధాన్ని ప్రవహించే కాలం కవిత్వంలో ప్రఖ్యాత కవి పానుగంటి రామ మూర్తి ప్రకటించారు. 2016లో రామమూర్తి తన మొదటి సంపుటి మనిషై పుట్టాలని వెలువరించారు. 46 కవితలతో వెలువరించిన రెండవ సంపుటి ప్రవహించే కాలం లోని కవితలు భావ స్పోరకంగా పరిమళించాయి. కవిత్వం తనలో ఊహల రెక్కలు విచ్చుకొని విహరించే విహంగం అని కవి చెప్పారు. తన్మయత్వంతో వశమయ్యే ఒక గాంధర్వమే కవిత్వమని నిర్వచించారు. మనిషిగా అమే యమైన ప్రకృతి అనుబంధాన్ని ఆరాధించి ఆస్వాదిస్తానని ధీమాగా చెప్పారు. తన కవితా ప్రపంచంలో నుండి ఒక బీజాక్షరం చెదిరి పోయిందని నవీన సాహిత్యపు దారులు వెతి కిన తాత్విక అన్వేషి ఆచార్య కె యెస్ రమణకు అక్షరాంజలి సమర్పించి ఆయనతో తనకున్న కవిత్వానుబంధాన్ని తలచుకుని వేదన చెందారు. ముళ్ళ దారి కవిత లో వ్యాపారులు పాలకులైతే ప్రకృతిలోని ప్రతిదీ వినిమయ వస్తువే అని ఘాటుగా విమర్శించారు. శాశ్వత పేదరికమే సమాధానానికి అందిరాని లోప మని చెప్పారు.
సమర్చనం కవితలో తెలుగు సాహితీ వైభవాన్ని ఖండాంతరం చేసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె సాహిత్య విశిష్టతను అభివర్ణించారు. సాటి లేని సృజనకు ప్రతీకగా సినారెను తెలిపి ఆయన సాహిత్య మార్గం అనితర సాధ్యమని చెప్పారు. ఆర్ద్రతకు ప్రతి రూపమైన అమ్మ లోకంలోనే విలువైన ఆస్తి అని తెలిపారు. అంతరంగా రంగస్థలం గా మనసును, అనుభవాల అల్మారాగా జీవితాన్ని చెప్పారు. ఇక్కడి నుండి ఇక్కడికే అన్న కవి తలో రాతియుగంలోనూ కనిపించని రాగద్వే షాలు, రాక్షసుల కథల్లోనూ రాయని రక్తస్నా నాలను ప్రస్తావించి ఇప్పుడు అవి చదువుకునే కావ్యాలలో అద్భుతంగా ఒదుగుతున్న తీరు పట్ల బాధపడ్డారు. కనికరం కనిపించని ప్రతి పుటలోని వేదనలు, రోదనలు, హాహాకారాలను వెల్లడిరచారు. ఆశ్వాసాంత గద్యాల్లోనూ మరణ వేదనలే, ఆర్తనాధాలే అని ఆర్ద్రత నిండిన మనసుతో కుమిలిపోయారు. మనిషి మనీషి కావాలంటే నైరాశ్యం విడిచి,లక్ష్యం వైపు నడిచి, ముళ్ళు,రాళ్లు,బురద గుంటలు, అడవి మంటలు దాటి సుదీర్ఘ జీవిత గమ్యాన్ని చేరుకోవాలని అన్నారు.
సంకల్పం సాధనంగా, వివేకాన్ని ఆయుధంగా మార్చుకొని మనిషి చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించాలని ఉగాదికి స్వాగతం కవితలో ఆకాంక్షించారు. మృతి లేని ఆశకు శృతి చేస్తూ తిరగరాయని చరిత్ర కోసం ముందడుగు వేయాలని సూచించారు. షడ్రు చుల ఉగాది మనిషి లో మానవతా రాగాన్ని పలికించాలని అన్నారు. ఊహల బంగారు బొంగరాల్లో అంబరాన ఊరేగుతూ ఆశలను మోసుకొచ్చే ఉగాదిని మానవతకు మధుర గీతాలాపన చేస్తూ ఎడారి గుండెల ఆధునిక ప్రపంచానికి ఆత్మావలోకనం జరపడానికి రమ్మని ఆహ్వానించారు. మనిషికి చిరునవ్వుకి దోస్తీ పుట్టుక నుండి అని చెప్పారు. పుట్టి, పెరిగి ప్రాణం కోల్పోయి వెళ్ళిపోయిన మనిషి తన వాళ్లందరికీ మిగిల్చి వెళ్ళేది చివరకు ఏడుపే అన్నారు. జ్వలనం కవితలో నీరు కార్చే అవకాశం లేనప్పుడు కన్ను కూడా అగ్నిగోళం అవుతుందని స్పష్టం చేశారు. భగ్న ప్రయత్నాల భారం, ఊహల ఎండమావులైన ఊగిసలాటలు నిత్య జీవనయానంలో మనిషికి తప్పడం లేదని అన్నారు. నేనులో అహం కారం తప్ప ఏమీ లేదని చెప్పారు. ఆధునిక మానవ యంత్రానికి అంతరీక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. మనిషి మౌనగీతాల్లో ఎన్నో విషాదాల తుషారపుటశ్రు బిందువుల్ని గమనించారు. మనిషి తన దహనం కోసం మార్చుకున్న అనుక్షిపణుల్లా మానవ మేధస్సు మారిందని బాధపడ్డారు.
శూన్య ప్రపంచంలో ఒంటరిగా జీవించే మనిషికి ఒంటరితనమావల ఉన్న సుందర దృశ్యాలను, అద్భుత పరంపరకు సంకేతమైన ఆనందమయ విశాల ప్రపంచాన్ని వీక్షించమన్నారు. వ్యవస్థ లోపానికి మూర్తీ భూత సంకేతంగా బాల కార్మిక వ్యవస్థను చూపారు. నాయకుడు పేదవాడి ఆకలికి అన్నమై, దాహార్తికి నీటి చెలిమ కావాలన్నారు. అనుబంధాలను ఆత్మీయంగా నిర్వహించేది, నడకను, నడతను, రీతిని, నీతిని నేర్పేది చదివేనని చెప్పారు. మనిషితనం నింపుకొని సాటి మనిషికి సాయపడినప్పుడే మనిషి దేవుడవుతాడని అన్నారు. తెలంగాణ ఇంటి పేరే చైతన్యమని, ఇది స్వయం పాలన కలిగిన సమర భూమి, కర్మభూమి అన్నారు. శతాబ్దాల చరిత్రకు వారసుడైన మనిషిని నాగరికుడై ప్రవర్తించమన్నారు. అడవిలో గాయపడ్డ లేడి పిల్లలా అగ్రరాజ్యాధిపత్యంలో మనిషి పరిస్థితి మారిందని చెప్పారు. మళ్లీ తన ఉనికి కోసం ఊరు ఆత్మగౌరవం, స్వయం పాలన నినాదా లతో ఉద్యమిస్తోందని తెలిపారు. అంతు చిక్కని జీవన రహస్యాన్ని అన్వేషించడంలో తాను నిరంతరాన్వేషినని చెప్పుకున్నారు. సైబర్ సంస్కృతిలో అమ్మతనం అదృశ్యమై జీవితం శూన్యం అవుతుందని, ప్రకృతి ప్రళయాగ్నిగా మారుతున్నదని అన్నా రు.
విలువైన వోటును అమ్మితే ప్రజాస్వామ్యానికే చేటు అని హెచ్చరించారు. ఘన నవ తెలంగాణకు జయహోలు పలి కారు. సబ్బండుల పోరాట ప్రతిరూపమై ఆవిర్భవించిన తెలంగాణ శిశిరం నుండి వసంతం వైపు సాగాలని కోరుకున్నారు. జ్ఞాన వృక్షంగా, మన కాలపు బుద్ధునిగా బాబా సాహెబ్ అంబేద్కర్ ను అభివర్ణించారు. విశ్వ మంతా మానవత్వమై మనిషి విస్తరణ జరగా లని అన్నారు. పేజీల కనురెప్పలు తెరిచి విశ్వ జ్ఞానాన్ని అందించే పుస్తకానికి వినమ్రంగా నమస్కరించారు. నాన్న అనంతమైతే నువ్వు ఒక అద్భుతానివని అమ్మను తలుచుకున్నారు. స్వేచ్చా జ్ఞానం ఒక అపురూపమైన జ్ఞాపకమని చెప్పారు. కొరోనా విలయంతో పిల్లలెవరూ కనిపించని నిశ్శబ్దంలో ఆగమైన బడిని గురించి చదువుల ఒడి కవితలో చెబుతూ చదువుల చెట్టు మళ్లీ చిగురించాలని అన్నా రు. జీవజాలం నెత్తిన ముళ్ళ కిరీ టమే కొరోనా అని చెప్పారు. తెలంగాణ పోరుకు పాంచ జన్యం పూరించిన అక్షర సేనాని కాళోజీ అని చెప్పారు. తెలంగాణ సౌభా గ్యం కోసం, తెలుగు భాష సౌం దర్యం కోసం కలలుగన్న స్వాప్నిక యోగి కాళోజీ అని తెలిపారు.
వేయి రేకుల వికసిత పుష్పంలా తెలంగాణ అస్తిత్వ పరిమళాలను వెదజల్లుతున్నదని అన్నారు. చీకటి దుప్పటి కప్పుకున్న రాతితో భయాన్ని పోల్చారు. పేదల బతు కులు ఇంకా ప్రయోగశాలలే అని నిట్టూర్చారు. మానవత కను మరుగైతే మనిషి స్థానం ఎక్కడ అని చలనం కవితలో సూటిగా ప్రశ్నించారు. ఆకుపచ్చ పంట పొలంలా / పరచుకున్న చరిత్ర మాగాణంలోకి / తీ యటి నీరై సంస్కృతి ప్రవహి స్తోందని భారతదేశ దర్శనం కవి తలో హిమ వన్నగ శిఖర ప్రాయంగా, వేల ఏండ్ల క్రితమే నాగరికత అంకురాలు మొలచిన సౌందర్య సీమగా మాతృభూమిని ప్రస్తుతించారు. మంచి ఏదైనా దైవమేనని అన్నారు. అంతర్నేత్రంతో జనపదాలను చూస్తే ప్రాచీనతను సింధూరంగా దాల్చిన పెద్దమ్మ ఐన తెలంగాణ ప్రతి పుటలో దాగిన మహ నీయ చరిత్ర స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. కవి ఎదలోపల ఎన్నో యేళ్లు సలసల కాగి మాగి అనంతానంత ఆక్రోశమై, అగ్నిని తొడుక్కొని పెల్లుబికిన భావాలకు ప్రత్యక్షర రూపాలే ఈ కవితలు.
` డా. తిరునగరి శ్రీనివాస్
9441464764





