“దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ ల్లో బీజేపీ తన ప్రాబల్యం పెంచుకొనేందుకు గోదావరి కావేరి అనుసంధాన పథకాన్ని తలకెత్తుకొనింది.గత పదేళ్లుగా సాగలాగుతోంది. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో కెసిఆర్ అడ్డుపడకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అడ్డు ఉండేది కాదు గమనార్హమైన అంశమేమంటే కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చిన తర్వాత కూడా తన యత్నాలు మానుకోకుండా.అన్య మార్గాలు తొక్కుతోంది.”
నదుల అనుసంధానం నీటి ఎద్దడి ప్రాంత ప్రజల గొంతు తడపడం వాస్తవమైనా దీనికి తోడు నదుల అనుసంధానానికి కొన్ని నియమ నిబంధనలు ఉండి తీరాలి. ఏ నదీలోయలో నైనా ఆ ప్రాంత ప్రజల అవసరాలు తీరిన తరువాత మిగులు నీళ్లు ఉంటే మరో నదీ లోయకు తరలించాలి. అంతే కాకుండా ఆ నదీ లోయ భాగస్వామ్య రాష్ట్రాల వాటాలు నిర్థారింప బడిఉండాలి . కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి కావేరి అనుసంధాన పథకానికి ఈ రెండు నియమ నిబంధనలు లేవు. భారత దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియమ నిబంధనలకు నీళ్లు వదలి పెట్టింది. వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రాబల్యం పెంచుకొనేందుకు నదుల అనుసంధానం ఒక ఉపకరణంగా వాడుకొంటోంది. అడ్డ దారులు తొక్కుతోంది. నదీ జలాలు రాష్ట్రాల పరిధిలోని అంశం. కానీ జల వనరుల అంశంలో వివిధ రాష్ట్రాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడినప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర మాత్రమే వహించ వలసి వుంది.
అయితే ప్రస్తుతం తద్భిన్నంగా జరుగుతోంది. తత్ఫలితంగా వివిధ రాష్ట్రాల మధ్య ఇబ్బిడికిబ్బిడిగా వివాదాలు ఉత్ఫన్నమౌతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దురహంకార వైఖరి వలన దక్షిణాదిలో వివిధ రాష్ట్రాల మధ్య చిచ్చు రేగుతోంది. ఇందుకు ఉదాహరణ గోదావరి కావేరి అనుసంధాన పథకం. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. పైగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటాల అంశం వివాదంలో వుంది. అయినా ఇన్ని అననుకూల పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం పట్టు వదలకుండా ముందుకు పోతోంది.
అంతేకాదు. గోదావరి నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయనే అంశంపై ఇప్పటికి స్పష్టత లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద జలాల ఆధారంగా బనకచర్ల అనుసంధానం తెర మీదకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని నీళ్లు వున్నాయని తెలుసుకొనేందుకు సర్వే మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి. 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ శ్రీ రామ సాగర్ నుండి ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి లెక్కలు తీస్తే 75 శాతం నీటి లభ్యత కింద 2337 టియంసిలు జలాలు ఉన్నట్లు ఇచ్చంపల్లి వద్ద మిగులు ఉన్నట్లు తేలింది. ఈ గణాంకాల ఆధారంగానే దక్షిణాది లో మహానది నుండి కావేరి వరకు తొమ్మిది అనుసంధానాలు ప్రతిపాదించారు.
తిరిగి 1901-02 నుండి 2010-11వరకు ప్రవావ గణాంకాలు తీస్తే 231 టిఎంసిలు తగ్గి పోవడమే కాకుండా ఇచ్చంపల్లి వద్ద మిగులు లేక పోగా రెండు రాష్ట్రాల అవసరాలు తీరాలంటే ఇచ్చంపల్లి నుండి 150 టిఎంసిలు కిందకు వదలాలని తేలింది. అంటే వినియోగం బాగా పెరిగింది.తర్వాత జరిపిన అధ్యయనాల్లో కూడా ఒక దానికి మరొక దానికి సంబంధం లేక పోయింది. ఇన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా కేంద్రం ప్రభుత్వం ముందుకు పోయేందుకు వివిధ దారులు వెతకడమే నేటి విషాదం.
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ ల్లో బీజేపీ తన ప్రాబల్యం పెంచుకొనేందుకు గోదావరి కావేరి అనుసంధాన పథకాన్ని తలకెత్తుకొనింది.గత పదేళ్లుగా సాగలాగుతోంది. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో కెసిఆర్ అడ్డుపడకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అడ్డు ఉండేది కాదు గమనార్హమైన అంశమేమంటే కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చిన తర్వాత కూడా తన యత్నాలు మానుకోకుండా.అన్య మార్గాలు తొక్కుతోంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం వాడుకోని నికర జలాలు 149 టిఎంసిలు ఉన్నాయని వాటిని వాడుకొని అనుసంధానం కానీయాలని సమావేశాల మీద సమావేశాలు నిర్వహించుతోంది. ఇందులో ట్విస్ట్ ఏమంటే ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనూ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నా తమ వాటా నీళ్లు ఇవ్వ బోమని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
ఛత్తీస్ ఘడ్ తిరస్కారాన్ని పరిగణన లోనికి తీసుకోక పోవడం మరో విచిత్రం. మరో దుర్మార్గమేమంటే తరచూ జరిగే సమావేశాల్గో కేంద్ర ప్రభుత్వ అధికారులు హిమాలయ నదుల నుండి నీళ్లు వస్తాయని అంత వరకే ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర వాటా నీళ్లు ఉపయోగించు కొంటామని చెబుతున్నారు . వివిధ రకాల డిపిఆర్ తయారైన గోదావరి కావేరి అనుసంధానం పథకం పదేళ్లుగా కనీసం తుది డిపిఆర్ కు నోచుకోలేదు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు హిమాలయ నదుల నీళ్లు దక్షిణాది రాష్ట్రాలకు వస్తాయని నమ్మమని చెప్పడం చెవిలో పూలు పెట్టడమే అవుతుంది. రాజకీయ నాయకుల్లాగా అధికారులు కూడా మాట్లాడుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానం ప్రతిపాదించిన తర్వాత మరి కొన్ని తీవ్ర పరిణామాలు సంభవించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుండే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించాయి. రోజుకొక ప్రతిపాదన తెర మీదకు రావడంతో ప్రధానంగా తెలంగాణలో అధికార ప్రతి పక్షాల మధ్య రాజకీయ వేడి పెరుగుతోంది. ఆ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై పడుతోంది. తాజాగా గంగా కావేరి అనుసంధానం తెరమీదకు తీసుకు వచ్చింది. ఈ పథకం రాజకీయ నేతల ప్రకటనల్లో నానుతోంది తప్ప సాంకేతికంగా ఇందుకు చెంది పిసరంత పురోగతి లేదు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటక వెళ్లినపుడు గంగా కావేరి అనుసంధానం అమలు జరిగితే అన్ స్టాపబుల్ అనే ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవల చాల మంది రాజకీయ నాయకులు ప్రధాని మోదీ నోట ఏం వచ్చినా దాన్ని అందుకొని సాధ్యాసాధ్యాలు ఆలోచించ కూడా విస్తృత ప్రచారాలు కల్పించడం రివాజు అయింది. అందులో భాగంగా ఈ ప్రకటన భావించాలి. ఇప్పట్లో ఈ పథకం సాధ్యం కాదు.
1960 దశకంలో నెహ్రూ హయాంలో గంగా కావేరి అనుసంధానం ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో ఈ పథకానికి మూడు వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కె. యల్. రావు అంచనా వేశారు. పాట్నా వద్ద గంగా జలాల్ని 150 అడుగుల నుండి 1300 అడుగుల ఎత్తు వరకు పంప్ చేసి నర్మదా నదిలోనికి ఎత్తిపోయాలని ఆలోచన చేశారు. ఇందుకు ఏడు వేల కిలోవాట్ల విద్యుత్ అవసరమని ఇందుకు ప్రత్యేకంగా ఏడు వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అవసరమని అంచనా వేశారు. పైగా ఈ పథకం పూర్తయ్యే నాటికి మూడు నాలుగు రెట్లు పెరుగుతుందని ఆలోచన చేశారు.





