“గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక – మట్టెవాడలోని ఫైర్ స్టేషన్ ప్రక్కగా సాగే ఆ చిన్న సందులోని సదాశివరావు ఇంటి పైన గల చిన్న మేడ గది. దాని ముద్దు పేరు బంగ్లా గది. ఈ లోగా పీవీ హిందీ ‘సాహిత్య రత్న ‘ పూర్తిచేసాడు. మహాదేవి వర్మ కవితలపై సుదీర్ఘ సమీక్షలను రాసేవాడు, హిందీ సాహిత్యం నుండి అనేక రచనలను తెలుగులోకి అనువదించడం లాంటి వ్యాపకం పెట్టుకున్నాడు.”
(నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105 వ జయంతి సందర్భంగా బాల్య విశేషాల గురించి మరొక్కసారి )
అంతకు ముందే రాఘవరెడ్డి ప్రియ శిష్యుడు కాళోజీ నారాయణ రావు. ఆయనకు తోడుగా పీవీ, సదాశివరావులు శిష్యరికం చేసిన గురువు రాఘవరెడ్డి గారు. వీరిద్దరు రాజకీయ ఆలోచనా విధానం తప్పిస్తే సాహిత్యమైనా, సంగీతమైనా ఆస్వాదించడమే కాకుండా వాటిపై సమగ్ర విశ్లేషణను చేసే సామర్థ్యత కలిగిన జంట మేధావులు. ఈ విషయాన్ని ఆనాడే తెలుసుకున్న ఆ గురు రాఘవుడు వారిని ‘ జయ- విజయులు ‘ గా సంబోధించేవారు. క్రమేణా ఆ పేర్లే సార్థక నామధేయాలుగా మారాయంటారు. అలనాటి ‘కాకతీయ పత్రిక’ లో పీ వీ గారు రాసిన ‘గొల్ల రామవ్వ ‘ కథ రచయిత ‘విజయ ‘ పేరుతో ప్రచురితమైంది. వీరిద్దరూ రాఘవరెడ్ది గారిని ‘గురు’ అని సంబోధించేవారు. పీవీ తరచూ ఆశ్రమానికి పోయి రాఘవ రెడ్డి గారితో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాడు.
రాఘవరెడ్డిగారికి తిరుపతి వెంకట కవుల, ప్రబంధ కవుల, శతక కవుల వందలాది పద్యాలు కంఠస్థం. ఉభయుల మధ్య తిరుపతి వెంకట కవుల పద్యాలు, వెంకట పార్వతీశ్వర కవులు, దువ్వూరి రామిరెడ్డి, గుఱ్ఱం జాషువా, రాయప్రోలు సుబ్బారావు మున్నగు వారి కావ్య శిల్పంపై ఇష్టా గోష్టి సాగేది. అంతే కాదు రాఘవరెడ్డి గారు మను చరిత్ర, నైషధం లాంటి ప్రబంధాలు, కాళిదాసు, భవభూతి లాంటి కవుల శైలీ విన్యాసం పై పీవీ కి ఆసక్తి కలిగించారు. పీవీ కూడా గురువు గారికి వర్డ్సు వర్తు, షెల్లీ, కీట్స్, బైరన్ కవితలు, షేక్సు పియర్ నాటకాలు, థాకరే, హార్డీ, డికెన్సు నవలల పరిచయం చేసాడు. ఈ ఇరువురి కలయిక “ప్రాచీనత – ఆధునికత “సమ్మిశ్రితమై ఇద్దరిలోనూ సమంగా పెంపొందినట్లు తెలుస్తుంది. అందుకు ఉదాహరణగా రాఘవరెడ్డి గారు భావ గీతాలు, పీ వీ గారు శృంగార గీతాలు రచించడం లాంటి ప్రయోగాలు, 1946లో రాఘవరెడ్డి గారి ‘పరిదేవనం’ కావ్యం ప్రచురితమైంది.
గురువు గారికి తెలియకుండానే శిష్యుడు సదాశివుడు ప్రచురించడమే కాకుండా అందులో గురు కావ్యరచనకు ‘శిష్య పీఠిక’ గూర్చాడు. ఆ శిష్య పీఠిక ఇలా మొదలవుతుంది: “శ్రీ కాళోజీ ప్రియ శిష్యుడు, శ్రీ గార్లపాటి గురువుగారు. మా జయ విజయులము వీరిని గురువు గారని సంబోధించుట యాదృచ్ఛికంగా జరిగియున్నను రాను రాను సార్థక సంబోధన యగుచు వచ్చుచున్నది. పిన్నల గ్రంధములకు పెద్దలు పీఠిక వ్రాయుట యాచారం. కానీ ఇట శిష్యుడే గురుని గ్రంధమునకు పీఠిక వ్రాయుచున్నాడు….. ” “భారతీయ సాహిత్య సాంప్రదాయాన్ని చదవడానికి నన్ను అమితంగా ప్రోత్సహించడమే కాకుండా స్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేయడానికి నాలో తపన పెంపొందించిన నా సాహిత్య గురువు, దివంగత శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారికి నేను కృతజ్ఞున్ని” అని శ్రీ పీవీ గారే ఆయన ఆత్మకథలాంటి నవల ‘ది ఇన్ సైడర్’ (The Insider) లో పేర్కొన్నారు. కాళోజీ గారొక చోట యీ విధంగా అన్నారు: “గురువు గారు రాఘవరెడ్డి గారూ, రామేశ్వరరావు గారూ, పాములపర్తి సదాశివుడూ, పీవీ కలిసి హిందీ కవితలు చదువుకొని వినిపించి చర్చించే వారు. ఆ చర్చల ఫలితమే రాఘవరెడ్డి గారు చేసిన మహాదేవి వర్మ అనువాదాలు, నందలాల్ రచించిన ‘ఉద్ధవుడు –గోపికలు’ సంవాదానికి పీ వీ అనువాదం”.
గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక – మట్టెవాడలోని ఫైర్ స్టేషన్ ప్రక్కగా సాగే ఆ చిన్న సందులోని సదాశివరావు ఇంటి పైన గల చిన్న మేడ గది. దాని ముద్దు పేరు బంగ్లా గది. ఈ లోగా పీవీ హిందీ ‘సాహిత్య రత్న ‘ పూర్తిచేసాడు. మహాదేవి వర్మ కవితలపై సుదీర్ఘ సమీక్షలను రాసేవాడు, హిందీ సాహిత్యం నుండి అనేక రచనలను తెలుగులోకి అనువదించడం లాంటి వ్యాపకం పెట్టుకున్నాడు. ఇది బహుషా గురు రాఘవుడి ప్రోద్బలమేమో? ఈ నేపధ్యంలో ‘కాకతీయ పత్రిక’ను ఒక వార పత్రిక గా 1947 లో ప్రారంభించారు. ఐతే పత్రికా నిర్వహణకు గాను చేయవలసిన ముఖ్య రంగాలైన ‘వార్తా సేకరణ మరియు రచనా’ కార్యక్రమం, ముద్రణా కార్యక్రమం, పత్రికలను చందాదారులకు, ప్రజలకు అందించే కార్యక్రమం, ‘ఆఫీసు మరియు ‘జమా-ఖర్చుల’ నిర్వహణ మొదలగు పనుల సక్రమ నిర్వహణకు గాను ‘పని విభజన’ చేసుకున్నారు.
వీటన్నిటికంటే ముఖ్యమైన ఆర్ఠిక పటిష్ఠతా కార్యక్రమమైన ‘చందాదారులను’ చేర్పించే అతి ముఖ్య కార్యభారం పీవీ గారు తీసుకున్నారు. వార్తా సేకరణ విభాగం లో శ్రీయుతులు పీ ఎన్ స్వామి, కొండబత్తిని జగదీశ్వరరావు, పెండెం శ్రీనివాసరావు, తర్వాత క్రమం లో చలసాని ప్రసాదరావు గార్లు వుండగా పత్రికా రచనా కార్యక్రమంలో అప్పుడప్పుడే మేటి జర్నలిస్టుగా ఎదుగుతున్న శ్రీ ఎం ఎస్ ఆచార్య గారు సహాయకులుగా వుండే వారు. ఇక పత్రికా రచన, సంపాదకత్వం సదాశివరావు గారు చూసుకునే వారు. పీవీ గారు కూడా అనేక రచనలు చేయడం జరిగింది. ఇక ముద్రణా కార్యక్రమం (పేజ్ లే ఔట్, ప్రూఫ్ రీడింగ్ మొదలగునవి) శ్రీ చౌడవరపు రాజా నరేంద్ర గారు చూసేవారు. ఇక పోతే మరొక ముఖ్య కార్యక్రమమైన పత్రికా కార్యాలయ నిర్వహణ మొత్తం (ఉత్తర ప్రత్యుత్తరాలు, జమా-ఖర్చు లెక్కలు, చందాదారుల వివరాలు, పత్రికను చందాదారులకు పోస్టు చేయడం ఇత్యాది అనేక పనులు) శ్రీ దేవులపల్లి దామోదరరావు గారు చూసుకునేవారు. ఈ విధంగా “కాకతీయ పత్రికోద్యమం” ఒక సమిష్టి కార్య నిర్వాహకుల కృషి రూపమే.
కాకతీయ పత్రిక గురించి కాళోజీ గారి మాటల్లో … “1950 ప్రాంతంలో సదాశివుడు అపుడపుడూ కాకతీయ సారస్వత సంకలనాలు వెలువరిస్తుండే వాడు. అప్పుడే కాకతీయ పత్రిక కూడా సదాశివుని సంపాదకత్వంలో వెలువడేది. అప్పటి ‘వెల్లోడీ’ ప్రభుత్వం, వారి సిబ్బంది చేసే అవకతవక పనులను ప్రచురించడం, విమర్శించడం జరిగేది. పత్రికా సంపాదకత్వం అప్పుడప్పుడే ప్రారంభించినా ఎంతో అనుభవం ఉన్న వయో వృద్ధుడైన సంపాదకునిగా ఆ పత్రికా నిర్వహణ చేసేవాడు.” కాకతీయ పత్రిక గురించి కాళోజీ మిత్రమండలి సమావేశాల్లో వీలైనప్పుడల్లా చెప్పేవాడని శ్రీ నాగిళ్ళ రామ శాస్త్రి గారొక వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఆ పత్రికల ఎన్నో పేర్ల మీద వ్యాసాలన్నీ ఎక్కువగా సదాశివరావే రాసెటోడని, ‘వాడొక రాత రాక్షసుడ’ ని అనే వారు కాళోజీ. కాకతీయ పత్రిక ముద్రణాలయం, కార్యాలయం సదాశివరావు ఇంటి ముందు భాగంలోని గదుల్లో వుండేవి. పైన వున్న బంగ్లా రూం లో సదాశివరావు. ఆయన రచనా వ్యాసంగం, ఇతర మిత్ర బృందంతో చర్చా గోష్టులు. నెలలో 5 లేదా 6 సార్లు పీవీ గారి రాక. వచ్చినప్పుడు ఒకటో రెండు రోజులో మకాం, గార్లపాటి గారు, కాళోజీ సోదరులు వారానికొకసారి. దినమంతా అక్కడే!
ఎప్పుడూ సాహిత్య చర్చలూ, ఇతర వ్యాసాంగాలతో కళకళ లాడింది ఆ మేడ గది, 1955 దశకపు అర్ధభాగం దాకా ఈ సాహిత్య సమ్మేళనాలు జరిగేవి. అప్పుడప్పుడూ అనుముల కృష్ణమూర్తి, పల్లా రామకోటార్య, హరి రాధాకృష్ణమూర్తి లాంటి పండితులు కూడా పాల్గొనేవారు. కొన్ని వందల సార్లు ఆ గురు రాఘవుని సాంగత్యం లో జరిగిన ఆ సాహిత్య విమర్శనాత్మక చర్చాగోష్టులు అసలే మేలు రత్నం లాంటి పీవీ గారి మేధస్సుకు మరింత పదును పెట్టాయంటే అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పాలంటే పీవీ గారి జీవన మధురిమలు వారు వరంగల్ లో గడిపిన బాల్య విద్యార్థి దశా, ఆ తర్వాతి కాలంలో ఆయన ఆపుడప్పుడూ వచ్చి నెలలో పదిహేను రోజులైనా గడిపిన ఆ కాకతీయ పత్రిక ప్రచురణల సమయం కావచ్చు. ఇందుకు కారణం ఆయన అమితంగా యిష్టపడే సాహిత్య సంగీత రంగాల మిత్రులతో సాగించిన సమ్మేళనాలు- రాజకీయ వాసనలు లేని మిత్ర బృందం నిష్కల్మష వ్యవహారతీరు. గార్లపాటి రాఘవరెడ్డి గారు, కాళోజీ సోదరులు, సదాశివరావులతో ఒక మంచి సినిమాను చూసిన తర్వాత దాన్ని గురించి గంటల తరబడి విమర్శనా చర్చలు చేయడంలో ఎంతో ఆనందం పొందేవారు. అప్పుడప్పుడూ సాయంత్రం మిత్ర బృందంతో మట్టెవాడ పోలీసు స్టేషన్ ప్రక్క సందులో నుండి భద్రకాళీ చెరువు వైపు వ్యాహ్యాళి పోవడం, చెరువు కట్ట మీద కూర్చొని జైభారత్ టాకీసు (ఇప్పుడు రాం లక్ష్మన్ టాకీసు స్థలంలో వున్న అలనాటి టాకీస్) ముందు కొన్న వేడి వేడి గారెలు, మిర్చీ బజ్జీలను ఆస్వాదించడం జరిగేది.
ఇవన్నీ అప్పటి (1945-55 మధ్యకాలం కు చెందిన) మధుర స్మృతులు. ఎపుడైనా మిత్రుల ప్రోత్సాహంతో పీవీ “బైజూ బావ్ రా” సినిమాలోని ‘ఓ దునియాకీ రఖ్ వాలీ ‘ అని గొంతెత్తి తన మధుర స్వరంతో ఆ పాటను ఆలాపించాడంటే మిత్రులే కాదు; ఆకాశంలో ఎగిరే పక్షులే కాదు; ప్రక్కనే గడ్డిని, ఆకులు అలములను మేస్తున్న ఆవులూ, గొర్రెలే కాదు; భద్రకాళీ తటాకంలో నీటి తలంపై పైకీ క్రిందకూ దుముకుతున్న చేప పిల్లలే కాదు; చుట్టూ వున్న ప్రశాంత ప్రకృతీ, పైన వున్న నీలి ఆకాశం, ఆ ఆకాశంలో యెటువైపో మెల్లిగా పయనిస్తున్న ఆ తెల్లని మబ్బు తునకలూ – నిశ్శబ్దంగా ఆ గానమృతాన్ని ఆస్వాదించడం ఒక అద్భుత సన్నివేశం. ఇటువంటి ఆ గానామృత సన్నివేశాలెన్ని జరిగాయో ఆ చెరువుకట్ట మీది అనేక రాతి గుండ్లకు తప్పకుండా జ్ఞాపకం ఉండి ఉంటుంది.
ఆరోగ్యం సహకరించని డెబ్బై యేండ్ల ప్రాయంలో రాజకీయాలకు స్వస్తి చెప్పి తన కిష్టమైన రచనా వ్యాసంగం; మధుర సంగీత ఆస్వాదనం; పాత మిత్రుల చలోక్తుల సంభాషణం; మనుమలూ, మనుమరాండ్రలను ప్రక్కన కూచోబెట్టుకొని వారికి చెప్పే హాస్య కథల చమత్కారం – ఇంకా ఇటువంటివెన్నో మధుర ఘట్టాల జీవన యాత్ర సాగించాలనుకున్న ఆ మహనీయుడికి మళ్ళీ ఆ రాజకీయ జీవితం ఆహ్వానం పలకడం; తప్పని సరి పరిస్థితుల్లో దానికి ఆయన తల వూపడం; ఆ తుఛ్చ రాజకీయాలే ఆయన ప్రశాంత జీవనానికి ఆటంకం కలిగించడం; తన జీవిత చరమాంకంలో ఆయన పడిన మనో వేదనం తలచుకుంటుంటేనే మా బోటి వారి కన్నులలో అక్కడక్కడా అశృబిందువులు… మరల ఒకసారి అనుకుందాం దీనినే ‘కాల మహిమ ‘ అంటారని. ఐనా, ఎన్ని రతనాలు కలిసినా మా కన్నీటి ముత్యాలకు సమమా…? (మనవి: ఈ కథనంలోని పీవీ గారి గురించి చెప్పిన ప్రతి వివరణా మన కండ్లెదుట జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, వీటన్నిటినీ (ఇంకా మరెన్నింటినో) వివరించింది, శ్రీ పీవీ గారి ఆjప్త మిత్రుడు శ్రీ పాములపర్తి సదాశివరావుగారు. ఒకసారి కాళోజీ గారు అంటారు: “వీడు తన ఆరోగ్యం, కుటుంబ విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడూ పీవీ గురించే ఆలోచిస్తాడు” అని. నిజంగా పీవీ గారి కంటే ఎక్కువగా పీవీ గారి గురించి తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీ సదాశివరావు.
1971 లో పీవీ గారు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియుక్తులైనప్పుడు ప్రఖ్యాత “జనధర్మ” వారపత్రిక ఒక అభినందన సంచిక వెలువరించింది. ఆ పత్రిక సంపాదకుడు శ్రీ ఎం ఎస్ ఆచార్య గారు పీవీ గారి కి సన్నిహిత మిత్రుడే కాదు నిజమైన జర్నలిజానికి ఆయన ఒక నిర్వచనం. ఆ ప్రత్యేక సంచిక లో సగ భాగం (148 పేజీలు) సదాశివరావు గారి వ్యాసమే. పీవీ గారి గురించి బాల్యం నుండి ఆయన ముఖ్యమంత్రి మకుటధారి అయ్యేవరకు ఆయన చెప్పిన వివరాలు అనేకం, చెప్పిన పద్ధతి అమోఘం. ఆ వివరాలనుండి కొన్ని సేకరించి నా పద్ధతిలో ఈ వ్యాస రూపంగా తెలపడం జరిగింది).
(అయిపోయింది )
-పాములపర్తి నిరంజన్ రావు
పిన్నా శివకుమార్





