మక్కల కొనుగోళ్లలో కావాలనే జాప్యం

– రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
– రేప‌టిలోగా సమాధానం రాకపోతే ఆందోళన తీవ్రం
– ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్

జనగామ, ప్రజాతంత్ర, మే 5: రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, ఆ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం పది లక్షల టన్నుల పంటను మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తోందని, మిగతా పంటను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పంటను కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం వల్ల వర్షాల కారణంగా పంట దెబ్బతింటుందని, దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆరఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జనగామ మండలంలోని యశ్వంతపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. 15 నుంచి 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డితో వెంటనే ఫోన్‌లో మాట్లాడి మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.22,000 కోట్ల అప్పులు తీసుకు వచ్చిందని ఆరోపించారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో జరిగిన అక్రమాల కారణంగా అక్కడినుంచి నిధులు రాకపోవడంతో మార్క్‌ఫెడ్ నిధులను వాడుకుంటున్నారని చెప్పారు. తాను చెప్పిన లెక్కలు తప్పు అయితే ప్రభుత్వం రుజువు చేయాలని సవాల్ విసిరారు. రైతులను ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, బుధవారం వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు. లేకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *