– బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం
– కేంద్ర మంత్రులు బండి, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలి
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతున్నదో సమాధానం చెప్పాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని, ఆలోపు దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ దర్యాప్తుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ఆయన కేంద్ర మంత్రి అనే ఫీలింగే రావటం లేదని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. గతంలో బీఆరఎస్ అవినీతిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు పలుమార్లు ఆరోపణలు చేశారని, అలాగే సీబీఐ విచారణను కోరారని గుర్తు చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి ఎనిమిది నెలల క్రితం ఈ కేసును సీబీఐకు బదిలీ చేశామని గుర్తు చేశారు. బండి సంజయ్.. చేతిలోని తుపాకీ కాల్చకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే లాభం ఏమిటి అంటూ టీపీసీసీ చీఫ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన లోపాయికారీ ఒప్పందంలో ఉండి ఈ దర్యాప్తునకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండానే బీజేపీకి వోట్లు పడ్డాయా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతగా ఎనిమిది నెలలుగా సీబీఐ దర్యాప్తును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతుల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ గతంలో అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు. రైతులు, పేదలకు లాభం చేసిన ప్రభుత్వం తమదే అని చెప్పారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. పంటల దిగుబడులు కూడా పెరుగుతున్నాయని, ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలతో కాంగ్రెస్ ముందుకు పోతున్నదన్నారు. బెంగాల్‌లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవన్నారు. అక్కడ బీజేపీ గెలిచిందంటే అది వోట్ల చోరీ వల్ల మాత్రమే అని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో వోటు చోరీ జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరగొచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వోటు హక్కు కాపాడుకోవాలంటూ పౌరులకు పిలుపునిచ్చారు. అయినా తెలంగాణలో అలాంటి ఆటలు సాగవు అని స్పష్టం చేశారు. ‘సర’ పేరిట వోట్లు దొంగలించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




