ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం(ఏఎస్ఐ) ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం-1958 కింద ఈ నిర్ణయం తీసుకుంది. యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ గొల్లల గుడి ఉంది. తూర్పు ముఖంగా మండపం, చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన త్రికూటాలయంగా ఈ ఆలయం అలరారుతోంది. ఎత్తయిన వేదికపై శిల్పాలంకరణతో కూడిన ప్రహరీ, హంసల వరుసతో కూడిన ద్వారబంధాలు, విష్ణువు, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ప్రధాన ఆలయానికి ముందు భాగాన అందమైన ద్వారపాలక విగ్రహాలతో కూడిన రెండు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. కాకతీయుల నాటి అత్యంత సునిశితమైన శిల్పకళా నైపుణ్యానికి అద్దం పట్టే ఈ ప్రాచీన ఆలయానికి జాతీయ ప్రాధాన్యం లభించడం పట్ల చరిత్రకారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





