ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

– 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం
– సెప్టెంబర్ 15వరకు దరఖాస్తుల స్వీకరణ
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్దిదారులుగా కాక స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19,లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో మిషన్ విలువ రూ.12,000 కాగా 100 శాతం సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. ఈనెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత

కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం తెలిపారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణను కూడా తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తూ వాటి నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల బలహీనవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు.

పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణకు భారీగా తరలిరావాలి

ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు హెచఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. అలాగే ఈనెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *