సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

– అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : జిల్లాలో ఈనెల 16న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రావమ్‌నాథ్ కేకన్‌లతో కలిసి ఆమె గురువారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పైలాన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, పార్కింగ్‌తోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలన్నారు. అనంతరం విలేకరులతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మేడారం చేరుకుని శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. వనదేవతల సన్నిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకున్న వారిని గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మేడారం కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రోడ్ల పనులకు సంబంధించిన అభివృద్ధి పనుల పైలాన్‌ను గట్టమ్మ సమీపంలో ఆవిష్కరిస్తారన్నారు. తర్వాత ముఖ్యమంత్రి నూతన కలెక్టరేట్‌కు చేరుకుని తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారని, కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ, జిల్లా ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ చందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *