ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం

– సవాల్‌ను స్వీకరించే దమ్ముందా కేటీఆర్?
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్ అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. అదే హైదరాబాద్‌లో ఇండ్ల అంశంపై సవాల్ చేస్తే ఆ సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావన్నారు. చేతల ప్రభుత్వం కాబట్టే, చిత్తశుద్ధి, సత్తా ఉన్నాయి కాబట్టే తొలి రెండున్నరేళ్లలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నామని, హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని వివరించారు. అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి దిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది మీరు.. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మీ సోదరి కవిత సైతం ప్రస్తావించారని ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న మీకు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి నుండి డబుల్ బెడ్ రూం ఇండ్ల వరకు.. అన్నీ మాటలు తప్ప చేతలు ఎక్కడైనా ఉన్నాయా డ్రామారావు అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాల గురించి కేటీఆర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు.. 2014కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటటో.. పదేండ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసునని మంత్రి పొంగులేటి అన్నారు. గ్రామాల్లో మీరు పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు నిర్మించిందన్నారు. హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణంపై మరోసారి సవాల్ విసురుతున్నా.. బీఆరఎస్ ప్రభుత్వం పదేండ్లలో కట్టిన ఇండ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే పోటీకి మీరు దూరంగా ఉంటారా.. అని కేటీఆర్‌నుద్దేశించి మంత్రి పొంగులేటి నిలదీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *