ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

– ఆ స్థలాల్లో మహిళలకు వాటా కల్పిస్తాం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్‌గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే  అల్పదాయ, మధ్యతరగతి వర్గాలకు లక్ష ఇండ్లు నిర్మించబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార , పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్ష ఇండ్లను నిర్మించి ఆ స్థలంలో వారి వాటాకు యజమానిని చేస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్షించారు. 2026-27కు క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు, ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షలు మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే ప్రరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా నగరానికి 30-40 కి.మీ దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని విమర్శించారు. ఇల్లు అనేది పేద కుటుంబానికి ఎంత అవసరమో వారి జీవనోపాధి కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని గత పాలకులు విస్మరించారన్నారు. రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలపై ఆధారపడే పేద కుటుంబాలు నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేకపోయాయని, ఉపాధి దూరమవడంతోపాటు పిల్లల విద్య, వైద్య సదుపాయాలు, రవాణా వంటి సమస్యలు ఎదురవడంతో అనేక కుటుంబాలు ఆ ఇళ్లలో నివసించడానికి ఆసక్తి చూపలేదని చెప్పారు. ఫలితంగా ఆ గృహాలు నిరుపయోగంగా మిగిలాయన్నారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, ఈ దిశగా విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్ష ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. సొంత ఇల్లు మహిళ సాధికారతకు, కుటుంబ స్థిరత్వానికి, భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందన్నారు. పేదలకు సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్‌లను రూపొందించాలని, ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో హౌసింగ్ సెక్రెటరీ వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *