కృష్ణా జ‌లాలపై మీకు అవ‌గాహ‌న లేదు

– పాల‌మూరు-రంగారెడ్డి ప‌థ‌కాన్ని కేసుల‌తో అడ్డుకున్న‌ది మీరే
– కేసుల‌ను ఎదుర్కొని ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించాం
– బీఆర్ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసింది
– ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించాం
– అబ‌ద్ధాల ప్ర‌చారం మానుకోండి
– రేవంత్‌పై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  మీ ప్రభుత్వ పాలనలో కృష్ణా నీటి వినియోగం ఎంత జరిగింద‌నేకనీస అవగాహన రేవంత్ రెడ్డికి లేక పోవడం పాలమూరుకే కాదు, యావత్ తెలంగాణకు దురదృష్టకరమ‌ని బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. ఇలాంటి ఆవగాహన లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతమ‌న్నారు. నీళ్ల మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి కూడా కనీస అవగాహన లేదా? మీ ఇద్దరికి మీ ప్రభుత్వం రాసిన అధికారిక లేఖల్లో ఏం ఉందో తెలియదా? 30 నెలలు దాటింది. ఇంకెప్పుడు ఇరిగేషన్ మీద ప్రిపేర్ అవుతారు? ఈ ఏడాది మే 2న‌  నాడు తెలంగాణ ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది నిజం. ఆ లేఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 74.23శాతం నీటి వాటాను, తెలంగాణ కేవలం 25.77శాతం వినియోగించుకున్నదని చెప్పింది నిజం. మీ లాగా ఆధారం లేకుండా, అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడే అలవాటు త‌న‌కు లేద‌న్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసింది గుండు సున్నా. 12.30 లక్షల ఎకరాలకు సాగు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరుకు ద్రోహం చేస్తున్నాడ‌న్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేసులు వేయించి, ఆనాడు ప్రాజెక్ట్ పనుల పురోగతిని అడ్డుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి, నాటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టించింది. భూసేకరణపై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమికి నిదర్శనం. పాలమూరు ప్రాజెక్ట్ కు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది రైతులను రెచ్చగొట్టినా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసింది నిజం. పాలమూరు ప్రాజెక్టుకు గాను మీ రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని ఎకరాల భూమి సేకరించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. సగం పాలనా కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు కుంభకర్ణ నిద్ర లేచి భూసేకరణకు ప్రతిపాదనలు అనడం సిగ్గుచేటన్నారు. ఏడాదికి ఆరు లక్షల ఎకరాల చొప్పున రెండేళ్లలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పిన రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు, అర్హత లేవ‌న్నారు. ప్రాజెక్టులు కట్టడం అంటే కోట్లు ఖర్చు చేసి లేని ప్రచారం చేసుకున్నంత సులువు కాదు రేవంత్ రెడ్డి. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్. వలసబోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలే సాగైతే, భూసేకరణ చేసి, ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది బీఆర్ఎస్. పదేళ్ల మా పాలనలో ఒక్క పాలమూరులోనే మొత్తంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించిన ఘనత మాది. గత పాలకుల పుణ్యమా అని ఆర్‌డీఎస్‌ ఆయకట్టుకు నీళ్లు అందకపోతే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ తో రైతాంగానికి సాగు నీరు అందించాం. 30 నెలల్లో తట్టెడు మట్టి తీయకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడటం నీ చేతగానితనానికి నిదర్శనం. ఈఎన్సీ జనరల్ రాసిన లేఖను జత చేస్తున్నా, చదువుకుని ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడటం మానాల‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *