చివరి లబ్దిదారుడికీ ఇందిరమ్మ ఇల్లు

– ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
– కూసుమంచిలో రెండో విడత ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి శ్రీకారం

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని రెవెన్యూ, హౌసింగ్, శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చివరి అర్హుడైన లబ్దిదారుడికి కూడా న్యాయం జరిగే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దసరా పండుగను పురస్కరించుఖకుని తన సొంత నియోజకవర్గమైన పాలేరులోని కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కూసుమంచి మండలానికి చెందిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంత్రి మంజూరు పత్రాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన ప్రకటనలు, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిన గత ప్రభుత్వాల తరహాలో కాకుండా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ విధానమని తెలిపారు.

లక్షలాది ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేయడంతోపాటు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. నగరంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు సైతం ప్రారంభించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు తండాల్లో నివసించే అర్హులైన పేద కుటుంబాలకు కూడా విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.30 లక్షల నుంచి 2.40 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎన్ని విడతలు అవసరమైనా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, మంజూరులో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పేదరికమే ప్రామాణికంగా అర్హులను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతు బీమా వంటి పథకాల ద్వారా పేదలు, రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, కూసుమంచి మండల ఎంపీడీవో జశ్వంత్ కుమార్, తహసీల్దార్ సైదులు, హౌసింగ్ డీఈ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *