భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం కేవలం ఒక పత్రం కాదు; అది భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల, ఆకాంక్షల, స్వప్నాల సమ్మేళనం. ఇది స్వతంత్ర భారతదేశానికి ఒక మార్గదర్శక సూత్రగ్రంథం. దీనిలోని మూల విలువలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం భారతీయ సమాజపు శతాబ్దాల సాంస్కృతిక పరిణామాల సారం.  “రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా, దానిని నడిపించే వారు చెడ్డవారైతే అది చెడిపోతుంది; కానీ రాజ్యాంగం సాధారణమైనదైనా, దానిని నడిపించే వారు మంచివారైతే అది గొప్పదవుతుంది.” అని డా. బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో స్పష్టం చేసిన ఈ వాక్యమే భారత ప్రజాస్వామ్యానికి ఆధారమైన సత్యం.”

ఇటీవలి కాలంలో లొంగిపోయిన మావోయిస్టు నాయకుల చేతిలో భారత రాజ్యాంగం కనిపించడం ఒక గాఢమైన ప్రతీకాత్మక సంఘటనగా చూడవచ్చు. శస్త్రసాయుధ పోరాటం ద్వారా రాజ్యాన్ని కూలదోయాలని ప్రయత్నించిన వారు, చివరికి అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలలో ఆశ్రయం పొందడం భారత రాజ్యాంగానికి గల పరివర్తనాత్మక శక్తికి నిదర్శనం. ఇది కేవలం చట్టపరమైన బలం మాత్రమే కాదు, రాజకీయ, సామాజిక, నైతిక విలువల సమ్మేళనంగా ఉన్న రాజ్యాంగ జీవనశీలతను సూచిస్తుంది. ఈ సందర్భంగా అనేక భిన్నమైన అభిప్రాయాలు, చర్చలు, మేధావివర్గంలోనూ, సామాజిక మాధ్యమాలలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం రాజ్యాంగం గొప్పతనమే కాకుండా, ఈ దేశ ప్రజల మానసిక దృక్పథానికి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న ఆత్మీయ విశ్వాసానికి ఒక ప్రతీక. ఇది యాదృచ్ఛిక అంసం కాదు, దీనికి ఒక చారిత్రక పరంపర ఉంది.

రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామనే ఆలోచనతో రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించిన వారు కూడా, చివరికి అదే రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయడం రాజ్యాంగానికి గల చట్టబద్ధమైన బలాన్ని తెలియజేస్తుంది. సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వ వ్యవస్థను కూలదోయాలని ప్రయత్నించిన విప్లవకారులు సైతం చివరికి అదే రాజ్యాంగం కల్పించిన రాజకీయ, పౌర స్వేచ్ఛలలో ఆశ్రయం పొంది రావడం భారత రాజ్యాంగంనకు గల అపారమైన పరివర్తనాత్మక శక్తిని సూచించే చారిత్రక ఉదాహరణ. రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం మాత్రమే కాదు, అది దేశంలోని విభిన్న భావజాలాలను, తాత్విక దృక్పథాలను, సామాజిక వాస్తవాలను ఒకే పటంలో మేళవించే జీవంతమైన పత్రం. భారత స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన రాజ్యాంగం, విభిన్న భాషలు, మతాలు, వర్గాలు, ఆర్థిక స్థితులున్న ప్రజలను ఒకే జాతీయ స్ఫూర్తిలో ఏకం చేసింది. విప్లవ మార్గంలో నడిచినవారు, రాజ్యాంగ వ్యతిరేక భావజాలాలను ప్రచారం చేసినవారు కూడా చివరికి అదే రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమయ్యారు. ఇది రాజ్యాంగం ఒక చట్టపరమైన పరిమితి కాకుండా, సమాజాన్ని పరివర్తితం చేసే ఒక నైతిక-తాత్విక శక్తి అని స్పష్టంగా చూపిస్తుంది.

  భారత రాజ్యాంగం కేవలం ఒక పత్రం కాదు; అది భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల, ఆకాంక్షల, స్వప్నాల సమ్మేళనం. ఇది స్వతంత్ర భారతదేశానికి ఒక మార్గదర్శక సూత్రగ్రంథం. దీనిలోని మూల విలువలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం భారతీయ సమాజపు శతాబ్దాల సాంస్కృతిక పరిణామాల సారం. “రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా, దానిని నడిపించే వారు చెడ్డవారైతే అది చెడిపోతుంది; కానీ రాజ్యాంగం సాధారణమైనదైనా, దానిని నడిపించే వారు మంచివారైతే అది గొప్పదవుతుంది.” అని డా. బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో స్పష్టం చేసిన ఈ వాక్యమే భారత ప్రజాస్వామ్యానికి ఆధారమైన సత్యం.

స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో కమ్యూనిస్టులు సాగించిన సాయుధ పోరాటం ఒక ఘట్టం. తెలంగాణాలో 1946–1951 మధ్య జరిగిన రైతాంగ పోరాటం ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైనది. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ “రాజ్యాంగం అనేది బూర్జువా పత్రం” అని విమర్శించింది. కానీ కొద్ది కాలానికే, అదే పార్టీ రాజ్యాంగం కల్పించిన ఎన్నికల వ్యవస్థలో పాలుపంచుకుని, ప్రజాస్వామ్య మార్గంలో ప్రజల న్యాయం కోసం పోరాడడం ప్రారంభించింది. ఈ పరిణామం భారత ప్రజాస్వామ్య విస్తృతిని సూచిస్తుంది. ఎందుకంటే, రాజ్యాంగం విభిన్న అభిప్రాయాలకు, విరుద్ధ భావజాలాలకు వేదికని అందిస్తుంది.

సాయుధ పోరాటం చేసిన వారు కూడా చివరకు రాజ్యాంగ మార్గంలో తమ వాదాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇది రాజ్యాంగం ప్రతిపాదించిన శాంతియుత మార్పు పద్ధతి విజయమని చెప్పాలి. లొంగిపోయిన మావోయిస్టుల చేతిలో రాజ్యాంగం సాయుధ విప్లవాన్ని ప్రజాస్వామ్య మార్పుగా మలచిన ప్రతీకాత్మక అర్థం. ఈ సంఘటనను రాజ్యాంగం  “మోరల్ సుప్రీమసీ”గా పరిగణించవచ్చు. రాజ్యాంగం పట్ల విశ్వాసం కేవలం చట్టరూపంలోనే కాకుండా, దాని విలువల రూపంలో ప్రజల్లో వ్యాప్తి చెందిందనే సూచన ఇది.  “రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదు; ఇది జీవన వాహనం” అని జస్టిస్ కె.సుబ్బారావు ఒక తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

 ఇక నేటి కాలంలో మతవాదులు, కమ్యూనలిస్టులు వంటి రాజ్యాంగ వ్యతిరేక ధోరణులు కూడా అదే రాజ్యాంగానికి లోబడి అధికారంలో ఉన్నారు. ఇది ఒక విస్మయకరమైన విరోధాభాసంలా కనిపించినా, వాస్తవానికి ఇది రాజ్యాంగం శక్తి. రాజ్యాంగం ఎవరికైనా, ఏ భావజాలానికైనా సమాన అవకాశాలు కల్పిస్తుంది. కానీ ఆ అవకాశాల మధ్యే ఒక పరిమితి ఉంది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయకూడదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మార్పులు సాధ్యమని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అందుకే, రాజ్యాంగం మార్చాలని మాట్లాడే శక్తులు కూడా అదే రాజ్యాంగం కల్పించిన ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తాయి, అదే రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గల అంతర్భూత బలాన్ని సూచిస్తుంది.

                 భారత రాజ్యాంగం రచయితలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలు దేశంలోని విభిన్న భావజాలాలు, వర్గాలు, మతాలు, భాషలు, ప్రాంతాల మధ్య ఒక ప్రజాస్వామ్య సమన్వయాన్ని నెలకొల్పడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం గొప్పదనానికి సమానంగా భారత ప్రజల మానసిక దృక్పథం కూడా గొప్పది. ఎందుకంటే ఈ దేశ ప్రజలు విభిన్న మతాలు, భాషలు, వర్గాలు, భావజాలాలతో ఉన్నప్పటికినీ, ప్రజాస్వామ్య పంథాను ఎంచుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు స్వాతంత్ర్యం తర్వాత సైనిక నియంతృత్వాల, వంశపారంపర్య రాజ్యాల బారిన పడ్డాయి. కానీ భారతదేశం మాత్రం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటోంది. 1947 నుండి ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. ఎన్నో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ, రాజ్యాంగం సగర్వంగా నిలిచింది. ఇది భారత ప్రజల ఆలోచనా స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్య విశ్వాసానికి నిదర్శనం.

భారతదేశంలో ప్రజాస్వామ్య భావన కొత్తది కాదు. బౌద్ధ కాలంలో గణ- ఘ వ్యవస్థలు, శ్రమణ సంప్రదాయాలు, పంచాయతీ వ్యవస్థ, ఇవన్నీ భారత నాగరికతలో లోతుగా పాతుకుపోయిన ప్రజాస్వామ్య నీతిని ప్రతిబింబిస్తాయి. ఈ చారిత్రక నేపథ్యం భారత ప్రజలలో రాజ్యాంగ విలువలను సహజంగా కలిగించింది. భారతీయ చరిత్రలో “సభ”, “సమితి”, “పంచాయతీ”వంటి పదాలు ప్రజాస్వామ్య పరంపరను సూచిస్తాయి. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ పురాతన ప్రజాస్వామ్య భావనలకు ఆధునిక రూపం ఇచ్చింది. అందుకే ప్రజలు ఈ రాజ్యాంగాన్ని తమదిగా భావించారు.

( మిగతా రేపటి సంచికలో ..)

Jayaprakash photo
జయప్రకాశ్ అంకం…
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ,
గవర్నమెంట్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్(ఎ), కామారెడ్డి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page