బాధ్యతలు విస్మరిస్తున్న పౌర సమాజం

పోలీసు వ్య‌వ‌స్థ లేని స‌మాజాన్ని ఊహించ‌లేం. ఆరాచ‌కుల ఆగ‌డాలనుంచి సామాన్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డమ‌నే త‌మ విధినిర్వ‌హ‌ణ‌లో ప్రాణాల‌కు ఎంత‌మాత్రం వెర‌వ‌ని పోలీసుల త్యాగాలు స‌దా సంస్మ‌ర‌ణీయం.  విధి నిర్వ‌హ‌ణ‌లో ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి  వ‌ర‌కు 191 మంది పోలీసులు అసువులు బాయ‌టం సామాన్యుల ర‌క్ష‌ణ‌కు, అరాచ‌క‌శ‌క్తుల‌ను అణ‌చివేయ‌డంలో త‌మ ప్రాణాల‌ను లెక్క‌చేయనిత‌నాన్ని వెల్ల‌డిస్తున్న నిష్టుర స‌త్యం. ఇటువంటి అమ‌ర‌వీరుల త్యాగాల‌ను సంస్మ‌రించుకోవ‌డం మ‌నంద‌రి క‌ర్త‌వ్యం.
ఇక మ‌న రాష్ట్రం విష‌యానికి వొస్తే, ఒక పేరుమోసిన రౌడీ షీట‌ర్  రియాజ్ జ‌రిపిన క‌త్తిపోట్ల‌కు నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్ర‌మోద్ (48)  బ‌ల‌వ‌డం తాజా ప‌రిణామం.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం, ఇంటి స్థ‌లం మంజూరు చేయ‌డం ద్వారా ఇటువంటి విషాద సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వం వీరికి అండ‌గా ఉంటుద‌న్న భ‌రోసా క‌ల్పించ‌డం ముదావ‌హం. అయితే ఈ నిజామాబాద్ సంఘ‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లో సుప్ప‌ష్టంగా క‌నిపించి సామాజిక బాధ్య‌తారాహిత్యం క‌ల‌వ‌ర‌పెడుతోంది.  ముఖ్యంగా 24 కేసులు న‌మోదై రౌడీషీట్ కూడా తెర‌చిన  రియాజ్ ను  ఇద్ద‌రు కానిస్టేబుళ్లు ఈనెల‌ 17న ప‌ట్టుకొని బైక్‌పై తీసుకువొస్తున్న సమయం లో ప్ర‌మోద్‌ను క‌త్తితో పొడిచి పారిపోయిన‌ప్పుడు, తీవ్ర గాయాల‌తో విల‌విల లాడుతున్న కానిస్టేబుల్‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాల‌న్న క‌నీస మాన‌వ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా, సెల్‌ఫోన్ల లో వీడియోలు తీస్తూ పోస్ట్ చేయ‌డానికి ఉత్సాహం చూపిన ప్ర‌జ‌ల‌ను ఏమ‌నాలి?  సెల్‌ఫోన్లు రాని కాలంలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బాధితుడు ఎవ‌రైనా, సామాజిక స్పంద‌న వారిని ఆదుకునే రీతిలో ఉండేది.
త‌క్ష‌ణ సాయం అందించి అవ‌స‌ర‌మైతే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌డానికి య‌త్నించేవారు. ఇప్పుడు అటువంటి మాన‌వ‌త్వం అడుగంటిపోవ‌డం దారుణం. సాటి మ‌నిషి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే, వీడియోలు తీసి మాధ్య‌మాల్లో పెట్టి లైక్‌ల కోసం ఎదురుచూసే ఒక దౌర్భాగ్య సంస్కృతి రాజ్య‌మేలుతోంది. దీన్ని బ‌ట్టి చూస్తే మ‌నం అట‌విక స‌మాజంలో ఉన్నామా అనిపిస్తుంది! ఈ సంఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన పోలీసులు రెండు రోజుల్లోనే అంటే ఆదివారం రియాజ్‌ను ప‌ట్టుకోగ‌లిగారు. ఈ క్ర‌మంలో గాయాలు త‌గిలిన స‌ద‌రు రౌడీషీట‌ర్‌ను చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ప్పుడు పోలీసుల కథనం ప్రకారం  అత‌డు ఏఆర్ కానిస్టేబుల్ వ‌ద్ద తుపాకిని లాక్కోవ‌డానికి చేసిన య‌త్నంలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో అత‌గాడు మ‌ర‌ణించాడు.  త‌క్ష‌ణ‌మే  హాస్పిట‌ల్ ముందు జ‌నం గుమిగూడి ఆనందోత్సాహాలు వ్య‌క్తం చేయ‌డం మ‌రో వైప‌రీత్యం. కానిస్టేబుల్‌ను పొడిచిన‌ప్పుడు ప‌ట్టుకోకుండా కాల‌క్షేపం చేసిన‌వారు, రౌడీషీట‌ర్ చనిపోయిన‌ప్పుడు ఆనందం వ్య‌క్తం చేస్తూ అతిగా ప్ర‌వ‌ర్తించ‌డం ఏవిధ‌మైన సామాజిక బాధ్య‌త‌?
కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి జరుగుతున్న సమయంలో   పౌరులు స్పందించి, కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడి ఉంటే, రియాజ్ పోలీసులకు సకాలంలో చిక్కి, అతనిపై చట్టపరమైన విచారణ మాత్రమే జరిగి ఉండేది. తద్వారా, రియాజ్ మరణానికి దారితీసిన ఎన్కౌంటర్ వంటి పరిస్థితిని నివారించగలిగే వారేమో..! పౌరుల నిర్లక్ష్యం, సామాజిక బాధ్యత పట్ల లోపించిన స్పృహ ఒక ప్రాణాన్ని తీయడమే కాకుండా, మరొక వ్యక్తి అకాల మరణానికి, న్యాయ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తడానికి కారణమైంది…! సహజంగానే ఈ సంఘటన ..రియాజ్ ఎన్కౌంటర్ పై  పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు స్పందిస్తాయి ..కానీ ఎన్కౌంటర్ కు బాధ్యులైన పోలీసుల పై చర్య తీసుకోవాలని ఈ సంఘాలు, వేదికలు డిమాండ్ చేసే ముందు పౌరులకు హక్కులనే కాదు బాధ్యతలను కూడా గుర్తు చేయాలి.
పౌరులకు పోలీసుల పై ఉండే అభిప్రాయాన్ని తెలియజేసే మరో అంశం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ చేసిన హెచ్చరిక పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ ..! ప్ర‌భుత్వానికి నిక్క‌చ్చిగా ప‌న్నులు క‌ట్టేది మందుబాబులే అన్న‌ది నిఖార్స‌యిన నిజం ! త‌నివితీరా తాగి  ప‌న్నులు క‌ట్టండి చాలు అన్న‌ట్టుగా రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాలు కొన‌సాగుతున్నాయి. అధిక ప‌న్నులు విధిస్తే భ‌రించ‌లేక తాగ‌ర‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశం కావొచ్చు. కానీ విధించిన ప‌న్నుతో సంబంధంలేకుండా య‌దేచ్ఛ‌గా తాగ‌డం అనేది మందుబాబుల‌కు తాగుడు నేర్పిన అల‌వాటు! అస‌లు విష‌యానికి వొస్తే కొత్త‌గా సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌జ్జ‌న్నార్ ప్రజలు  తాగి వాహ‌నాలు న‌డ‌పొద్దంటూ చేసిన హెచ్చరిక  ఒక్క‌సారిగా మందుబాబుల మ‌ద్ద‌తుదార్ల‌లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. సోష‌ల్ మీడియాలో ఆయ‌నను  తెగ ట్రోల్ చేస్తున్నారు. తాగుబోతులు నేర‌స్థులైతే, అమ్ముతున్న వారు దోపిడీ దొంగలా .. ఇందుకు ప్రోత్స‌హించే ప్ర‌భుత్వం కూడా నేర‌స్థురాలే న‌న్న‌ది సోష‌ల్ మీడియాలో వీరు చేస్తున్న వాద‌న‌! ఒక వేళ ప్ర‌భుత్వం మ‌ద్య‌నిషేధం విధిస్తే వీరు తాగ‌కుండా ఉంటారా? ఋగ్వేద కాలంనుంచి  కొన‌సాగుతున్న ఈ సురాపానాన్ని వ‌దిలే ప్ర‌స‌క్తే లేదంటారు!  ఇంకా రెచ్చిపోయి తాగుతారు!
ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు తాము అమ‌లు ప‌ర‌చే సంక్షేమ కార్య‌క్రమాల‌కు, మ‌ద్యంపై ప‌న్ను విధింపు కూడా ఒక ఆదాయ వ‌న‌రుగా చేసుకున్నాయి! చివ‌రికి  ఈ ఆదాయం లేక‌పోతే ప్ర‌భుత్వాలు కుప్ప‌కూల‌డం ఖాయమ‌నే ద‌శ‌కు చేర‌కుంది!!  ఇటు ప్ర‌భుత్వం, అటు మందుబాబుల మ‌ధ్య న‌లిగిపోవ‌డం ఇప్పుడు పోలీసుల వంతైంది. కమిషనర్  స‌జ్జ‌నార్ చెప్పింది  తాగి వాహ‌నం న‌డ‌పొద్ద‌ని! అంతేకాని తాగొద్ద‌ని ఆయ‌న చెప్ప‌లేదు క‌దా! మధ్య నిషేధం ఆయన పరిధిలోని అంశం కాదు. మద్యం సేవించి వాహనం నడపొద్దు అని  చట్టం చెబుతుంది ..చట్టాన్ని కమిషనర్ అమలు చేస్తున్నారు.
దీన్ని చిల‌వ‌లు ప‌ల‌వలు చేసి ఆయ‌నేదో త‌ప్పు మాట్లాడ‌న్న రీతిలో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోవ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌సం?  ఆవిధంగా చెప్ప‌డం, తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డాన్ని అరిక‌ట్ట‌డం పోలీసుల విధి!  తాగి వాహ‌నం న‌డిపితే ఎవ‌రికి ప్ర‌మాదం?  ప్రజల మంచికోస‌మే చెప్పిన మాట‌ను త‌ప్పుగా చూప‌డం, విజ్ఞ‌త అనిపించుకోదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల వ‌ద్ద మందు బాబులు చేసే ఫీట్లు, రోడ్డుపై నిర్ల‌క్ష్యంగా న‌డుపుతూ ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వీరి వ్య‌వ‌హార‌శైలిపై ఎల‌క్ట్రానిక్ మీడియాలో మ‌నం ఎన్నో వీడియోల్లో చూశాం, చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వారికి మంచి చెప్పినా చెడుగానే అనిపిస్తుంది! తాను చెడ్డ కోతి వ‌న‌మెల్లా చెడ‌గొట్టింద‌న్న రీతిలో, తాగి తాము చెడ‌ట‌మే కాదు, కుటుంబానికి, స‌మాజానికి ఇబ్బంది క‌లిగిస్తున్న మందుబాబుల వ్య‌వ‌హార‌శైలి ఏవిధంగా చూసినా ఖండ‌నార్హమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page