“కొండా దంపతులు, వారి కుమార్తె ప్రవర్తించిన తీరు, సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన ఏర్పడుతుందన్న టాక్ బలంగా వినిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా కొండా సుస్మిత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై చేసిన ఘాటైన విమర్శపై సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించే అవకాశాలు లేకపోలేదు. సమ్మక్క జాతరకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతోపాటు, రెడ్లు, బీసీలన్న కులవిబేదాలను తీసుకురావడంపైన ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిలోనూ సురేఖపై చర్యలు తీసుకుంటాడని అందరూ ఊహించారు. కాని, అందరి ఊహలకు భిన్నంగా వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్లు వారి చర్చలు ప్రశాంత వాతావర్ణంలో జరిగినట్లు తెలుస్తున్నది..”
గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ చివరకు టీ కప్పులో తుఫాన్‌లా మారిందా అంటే అవుననే సమాధానం వస్తున్నది. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఆపార్ధాలకు దారితీసిందని మంగళవారం ఒక మీడియాకిచ్చిన ఇంటర్ వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ కొట్టిపారేడంతో ఇక ఈ ఎపిసోడ్‌కు తెరపడినట్లేనన్నది స్పష్టమవుతున్నది. ఇవన్నీ చిన్న విషయాలని, వచ్చిన అరమరికలను ముఖ్యమంత్రి పెద్ద మనుసుతో ఆలకించారని ఆయన చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రికి మంత్రులంతా సమానమేనంటూ, ఏ సంస్థ అయిన ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దక్కన్ సిమెంట్ విషయంలో వచ్చిన ఆరోపణలపై సిఎం స్పందనపై గౌడ్ వివరణ ఇచ్చారు. అంతకు మించి వారి మధ్య ఎలాంటి వేడి వేడి చర్చలు జరుగనట్లుగా ఆయన మాటల్లో అర్థమవుతున్నది. గౌడ్ సన్నాయి నొక్కులు నొక్కినతీరు చూస్తుంటే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై సాక్షాత్తు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీసుకుని గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన చర్చలన్నిటినీ తుంగలో తొక్కినట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో కొండా దంపతులు కూడా వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతున్నది. అయితే ఈ పరిణామానికి తెరవెనుక జరిగిందేమిటన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టని రహస్యంగానే ఉండిపోయింది.
కొండా ఎపిసోడ్ రాష్ట్ర ఎల్లలుదాటి ఏఐసీసీ దృష్టికి వెళ్ళింది. ఏఐసీసీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌లు రంగంలోకి దిగారు. కొండా దంపతులు సురేఖ, మురళీధర్‌రావులను వారు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరకు తీసుకువెళ్ళారు. అయితే వీరి మధ్య ఏం జరిగిఉంటుందన్న ఉత్సుకత రాష్ట్ర ప్రజల్లో ఉండింది. ఎందుకంటే కొండా దంపతులు, వారి కుమార్తె ప్రవర్తించిన తీరు, సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన ఏర్పడుతుందన్న టాక్ బలంగా వినిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా కొండా సుస్మిత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై చేసిన ఘాటైన విమర్శపై సిఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించే అవకాశాలు లేకపోలేదు. సమ్మక్క జాతరకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన విమర్శలతోపాటు, రెడ్లు, బీసీలన్న కులవిబేదాలను తీసుకురావడంపైన ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిలోనూ సురేఖపై చర్యలు తీసుకుంటాడని అందరూ ఊహించారు. కాని, అందరి ఊహలకు భిన్నంగా వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్లు వారి చర్చలు ప్రశాంత వాతావర్ణంలో జరిగినట్లు తెలుస్తున్నది.
దీంతో సురేఖ మంత్రి పదవికి ఎలాంటి డోకాలేదన్నది స్పష్టమవుతున్నది. కాని, దక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని తుపాకితో బెదిరించిన అంశం, ఆ తుపాకి ఎక్కడినుండి వచ్చిందన్న విశయం, అందుకు బాధ్యుడిగా చెబుతున్న సుమంత్‌పైన, ఆయన వెంట సిఎంకు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్న రోహిన్‌రెడ్డిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీలేదు. మేడారం పనులకు సంబందించిన టెండర్ల వివాదం బయటికి వచ్చిన తర్వాత రెండు సార్లు సిఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌కు విచ్చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వంత జిల్లాకు విచ్చేసినప్పటికీ ఈ రెండు సార్లుకూడా క్యాబినెట్ మంత్రిగా కొండా సురేఖ ముఖ్యమంత్రిని కవలవకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే తాజాగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోకూడా ఆమె పాల్గొనకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత భట్టి విక్రమార్కతో, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో వరుసగా మంతనాలు జరిపిన నేపద్యంలో వారిద్దరు కలిసి సురేఖను సిఎం దగ్గరకు తీసుకు వెళ్లారు. అయితే వారి మద్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో తెలియదుగాని, బయట మాత్రం ఎవరికి ఎవరూ క్షమాపణలు చెప్పుకోవడంగాని, జరిగిందానికి సమాధానం ఇచ్చుకున్నదిగాని లేదు. అంతా గప్‌చుప్!!





