– పరిశ్రమల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలి
– సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతోపాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల పునరుద్ధరణ, చెరకు పంట విస్తీర్ణం పెంపు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 86 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సచివాలయంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 చక్కెర కర్మాగారాలు ఉండగా ప్రస్తుతం ఏడు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఆ పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఏటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరమవుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు. వరి పంటతో పోలిస్తే చెరకు సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తే దిగుబడులు పెరగడంతోపాటు సాగు వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. 2026-27 వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 19 వేల మంది రైతులు 26 వేల హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నట్లు తెలిపారు. చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు, చక్కెర పరిశ్రమలకు అవసరమైన చెరకు లభ్యతను మెరుగుపరచేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను త్వరగా సమర్పించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ చెరకు రైతులకు కూడా వరి రైతులకు అందిస్తున్న తరహాలో టన్నుకు రూ.500 ప్రోత్సాహకం అందించాలని కోరారు. చెరకు సాగులో అధిక పెట్టుబడి, వ్యవసాయ కూలీల కొరత ప్రధాన సవాళ్లుగా మారాయని వివరించారు. చెరకు ద్వారా చక్కెరతో పాటు ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందంటూ ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు
భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకంలో భాగంగా రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ భవ్య పథకంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుల పురోగతిపై సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవ్య పథకంలో మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే నాలుగు ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన పూర్తి ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రానికి నెలాఖరులోగా అందజేస్తున్నామని తెలిపారు. ఒక్కో పార్కు 500 ఎకరాలకన్నా అధిక విస్తీర్ణంలో ఉంటుందని, ఇందుకుగాను భూసేకరణ ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలిపారు. వీటిలో కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారం ఉన్నాయన్నారు. వీటిలో ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటితోపాటు మరో 16 ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చేనేత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, సిక్తా పట్నాయక్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





