దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండగ

– 48మందికి గ్రేడ్-3, ఇద్దరికి గ్రేడ్-2, ఒకరికి గ్రేడ్-1 ఈవోలుగా పదోన్నతి
– 15మంది అర్చకులకు/కుటుంబ సభ్యులకు రిటైర్మెంట్, గ్రాట్యుటీ, వివాహ రుణం
– ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న మంత్రి సురేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : దేవాదాయ శాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో, వారికి దక్కాల్సిన ప్రయోజనాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవాదాయశాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియం(దేవులపల్లి రామానుజరావు కళామందిరం) వేదికగా బుధవారం జరిగిన ఉద్యోగుల పదోన్నతుల కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇకపై స్వాతంత్య్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు, రివార్డులు అందించేలా కార్యాచరణను రూపొందించాలని దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావును ఆదేశించారు. 48మంది ఉద్యోగులు గ్రేడ్-3 ఈవోలుగా, ఇద్దరు గ్రేడ్-2 ఈవోలుగా, ఒకరు గ్రేడ్-1 ఈవోలుగా మంత్రి సురేఖ చేతుల మీదుగా పదోన్నతుల ఉత్తర్వులను అందుకున్నారు. వీరితోపాటు అర్చక సంక్షేమ నిధి ద్వారా అర్హులైన 15మంది అర్చకులకు(వారి కటుంబ సభ్యులు) పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు ఉత్వర్వులను మంత్రి సురేఖ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గ్రేడ్-3 ఈవోలుగా పదోన్నతులు అందుకున్నవారితో కలిపి గతంలో గ్రేడ్-1, గ్రేడ్-2 కేటగిరీల్లోనూ పదోన్నతులు ఇవ్వడం ద్వారా మొత్తం 168మంది ఉద్యోగులకు కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతి కల్పించి ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపామని స్పష్టం చేశారు. సరిగ్గా పది రోజుల క్రితం రవీంద్ర భారతి వేదికగా వేద పండితులు, అర్చకులు, పరిచారకులు, డోలు, సన్నాయి కళాకారులు తదితర 191 ధార్మిక నియామక ఉత్తర్వులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అర్చక సంక్షేమ నిధి కింద పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడంతోపాటు అంత్యక్రియల సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచి అర్చక కుటుంబాలకు మరింత భరోసా కల్పించామని మంత్రి తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని, గోదావరి పుష్కరాలు-2027, కష్ణా పుష్కరాలు (2028) కోసం ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడడంతో ఈవోలుగా పదోన్నతులు అందుకున్న ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ ఉద్యోగ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన గుర్తింపు లభించడంతో వారంతా మంత్రి సురేఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావులపై ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, దేవాలయ పాలనా సంస్థ (సిటా) డైరక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ఆÂర్జేసీ రామకృష్ణారావు, డిప్యూటి కమిషనర్ వినోద్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు జ్యోతి, శ్రీనివాస్, ఈవోల సంఘం అధ్యక్షుడు నరేందర్, టెంపుల్ ఎంప్లాsTÖస్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి, దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ, పలువురు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *