వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్స

– ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక బృందం
– వేసవి నేపథ్యంలో హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు
– అగ్ని ప్రమాదాల నివారణకు #చర్యలు
– ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖానలలో తాగు నీటి సౌకర్యం, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, వడ దెబ్బ బాధితులకు చికిత్స ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి బుధవారం సమీక్షించారు. వడ దెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామంటూ ఇన్, అవుట్ పేషెంట్ల కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఇన్, అవుట్ పేషెంట్లు, వారి సహాయకులకు, హాస్పిటల్ సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని, పెద్ద హాస్పిటల్స్‌లో ప్రతి బ్లాక్, ప్రతి ఫ్లోర్‌లో తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఆవరణలో అవసరమైనచోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నందున ఇన్, అవుట్ పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా అవసరమైనచోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీయూలు, ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాతల సహకారం తీసుకోవాలని సూచించారు.=

అవగాహనతోనే నివారణ సాధ్యం

హాస్పిటల్స్, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సామాజిక మాద్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు అవసరమైన అంశాలు రూపొందించుకోవాలని చెప్పారు. యేటా ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని, పట్టణాల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ఇతర గిగ్ వర్కర్లకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని మంత్రి రాజనర్సింహ సూచించారు. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు అంకిత భావంతో పనిచేసే బృందాన్ని హాస్పిటల్ ఎమర్జన్సీ ఏరియాలో సిద్ధంగా ఉంచాలని, ఈ బృందంలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

జనరేటర్లు సిద్ధంగా ఉండాలి

వేసవిలో గాలి దుమారాలు, ఈదురు గాలులు, అకాల వర్షాలతో విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగవచ్చని, ఇలాంటి సమయాల్లో రోగులకు ఇబ్బంది కలగకుండా వెంటనే జనరేటర్లు ఆన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు అన్ని హాస్పిటల్స్‌లో జనరేటర్లు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. వెంటనే వాటి పనితీరును పరిశీలించాలని, అవసరమైనచోట మరమ్మతులు చేయించాలని మంత్రి ఆదేశించారు.

అగ్ని ప్రమాదాల ముప్పు

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని, షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్‌లో పవర్ కేబుల్స్‌ను వెంటనే తనిఖీ చేయించాలని మంత్రి దామోదర్ ఆదేశించారు. అవసరమైనచోట పాత వాటి స్థానంలో కొత్త వైరింగ్ చేయించాలన్నారు. అన్ని హాస్పిటల్స్‌లో ఫైర్ అలార్మ్, స్మోక్ట్ డిటెక్టర్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. అవసరమైనచోట కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడ ఉన్నాయో లేవో చూడాలని, వాటి గడువు తేదీలను పరిశీలించాలని ఆదేశించారు. మంటలు ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీకి మరోసారి శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించి చేయాల్సిన, చేయకూడని పనుల గురించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీపంలోని ఫైర్ స్టేషన్ అధికారులతో హాస్పిటల్ అధికారులు సమన్వయం చేసుకుని ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. సమీక్షలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎసఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు అండగా ఉండండి

ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలన్నారు. తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితుడిని తరలించాలని, 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి ప్రజలను విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *