గ్రామీణాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు రూపొందించాలి

– టీజీ ఐఆర్డీ కు మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: ఎంతోమంది నిపుణులున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజీ ఐఆర్డీ ) గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. రాజేంద్రనగర్‌లోని సంస్థ కార్యక్రమాలు, కార్యకలాపాలపై ఆమె బుధవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల పురోగతిని సీఈవో నిఖిల మంత్రి సీతక్కకు వివరించారు. టీజీ ఐఆర్డీ ద్వారా ఇప్పటివరకు వివిధ విభాగాల పరిధిలో చేపట్టిన శిక్షణల ఫలితాలు, వాటి ప్రభావం గురించి కూడా వివరించారు. ముఖ్యంగా శిక్షణ పూర్తి చేసిన మాస్టర్ ట్రైనర్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చినట్లు, ప్రస్తుతం వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. సంస్థలోని వివిధ విభాగాల పనితీరును సమగ్రంగా పరిశీలించి మంత్రి సీతక్క పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు స్థానిక సంస్థల విధులు, నిధులు, హక్కులపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు సులభంగా అర్థమయ్యే శిక్షణ సామగ్రిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తమ హక్కులు భాద్యతలు తెలియజెబితే గ్రామాల అభివృద్ది సంపూర్ణమవుతుందన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న చట్టాలపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన పెంపొందించే దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను టీజీ ఐఆర్డీ నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అమలులో ఖచ్చితత్వం ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, సంస్థ ఆడిటోరియం నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అత్యున్నత శిక్షణ సంస్థగా పేరుగాంచిన టీజీ ఐఆర్డీ ప్రతిష్ఠను మరింత నిలబెట్టేలా సిబ్బంది శ్రమించాలని మంత్రి సీతక్క సూచించారు. సంస్థ ద్వారా అందించే శిక్షణలు గ్రామీణ పాలనలో నాణ్యతను పెంచేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమీక్షలో శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, టీజీ ఐఆర్డీ ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *