వివిధ రకాల ప్రాధామ్యాల లతో కవుల పరంగా నేటి కవిత్వ సృష్టి జరుగుతున్నది. ఒకరికి వస్తువు, మరొకరికి శిల్పం ముఖ్యం. ఇంకొందరు రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ కవిత్వం రాస్తున్నారు.సంక్షిప్తత, గుప్తత, నవ్యత కవుల కవిత్వానికి విశిష్టతను తీసుకొస్తాయన్నది సాహిత్య విమర్శకుల సూచన. వస్తువులో, అభివ్యక్తిలో వైవిధ్యాన్ని సంతరింపజేసుకుని కవిత్వాన్ని సృజిస్తున్న కవయిత్రి డాక్టర్ కొండపల్లి నీహారిణి. సమాజానికి బింబ ప్రతిబింబంగా, దర్పణంగా కనిపించే తమ కవితలతో ఎనిమిదో అడుగు అన్న సంపుటిని ఆమె వెలువరించారు. వైవిధ్యమే ప్రధానమైన 77 కవితలు ఇందులో ఉన్నాయి.
ఆకాశమంత ఆకాంక్ష తెల్లని గునుగు పువ్వోలె / అదుగో సూర్యుడు మళ్ళీ ఉదయించిండు అని తెలంగాణ పోరుకు ఒక్కొక్కరు ఒక్కో సూర్యుడు అవ్వాలని ఉదయించెను సూర్యుడు ఈ సంపుటి తొలి కవితలో యుద్ధభేరి మ్రోగించారు. ప్రకృతి రస రమ్య అందాల మధ్య విలసిల్లే వరాల నేల నా తెలంగాణ అని కవితా గీతికను వినిపించారు. సంజె కెంజాయిని సాదరంగా ఆహ్వానిస్తూ ముందటర్ర గచ్చు వేదికపై బాపమ్మ వెలిగించిన ఎక్కాబుడ్డిని అందమైన అప్పటి మాన్యుమెంట్ గా ఇప్పటి తరాల కోసం అభివర్ణించారు. అనంత ఆదర్శ వెలుగుల సంకేతం దీపకాంతి అన్నారు. తరచి చూస్తే రేపటి ఆశల రెక్కల గుర్రం ఆకాశమంత సముద్రాన్ని ప్రతిబింబిస్తూ తూర్పున కనిపిస్తుందని చెప్పారు. అవస్థలెన్నున్నా వ్యవస్థ మారదు / మరణం తప్పదని తెలిసి బ్రతకడం మానరు అని మనిషి గమనం, గమ్యం గురించి తెలిపారు. వేదనల గాయాల మోతలేని సమాంతర రేఖలవడానికి, నూతన ఆదర్శ కుటుంబ కదంబం కోసం ఎనిమిదవ అడుగును వేయాలని మనిషికి సూచించారు. సియాటిల్ గుండె తలుపు తెరిచి తెలంగాణ తల్లి హృదయం మెరుపును కనుగొని సలాం చేశారు. పచ్చని చెట్టుకు మనిషి చిచ్చు పెట్టవద్దన్నారు. జీవితాంతం కవితలో బ్రతుకు బాటకు భరోసా అద్దమన్నారు.
కంటి ధారల నుండి దుఃఖ సముద్రపు జడిని వినిపించి మానవతా తీరాన్ని తట్టారు. సద్దుల బతుకమ్మ నాడు చెరువులో మునిగి పోతుంటే అక్కయ్య, బుచ్చయ్యలు కాపాడిన జ్ఞాపకాలను కొంగుబంగారం కవితలో తలుచుకున్నారు. జనం నిజమంత కఠినం అని కఠిన నిజం చెప్పారు. కవి అంటే కాళోజీనే అన్నారు. ఆకస్మిక భీతి నుండి దూరంగా ఉండి యువశక్తి మంచి పనుల కోసం ఉద్యమించి ప్రజ్వలించాలని పిలుపునిచ్చారు. నరుడు నేర్పని నాగరికతను మోదుగు పూసిన బీడులో నిట్ట నిలువుగా చూపారు. కిటికీని భావోద్వేగాల దృశ్యమాలికగా తెలిపారు . అగ్నిశిఖల మెరుపులు ఇప్పుడు కావాలని గొంగట్ల మెతుకులు కవితలో ప్రగాఢంగా కోరారు. కరిగిపోయే కలలతో సహవాసం వద్దన్నారు. మేధావి వర్గం మౌనముద్ర వేడి నిజాల నిగ్గును తేల్చాలని న్యాయానికో పరీక్ష కవితలో చెప్పారు. మరణం పేర్చిన కష్టాల పరుపులో తెల్లపావురాలు ఏడుస్తున్నాయని వేదన చెందారు. తెలంగాణ సిరులు హరితహారాలై వెలగాలని ఆకాంక్షించారు. మొండి రాయిలోనూ గుండె చప్పుడును వినమన్నారు. రెండు నాలుకల మడతలల్ల ప్రజలు నలిగిపోకుండా తెలంగాణ వచ్చి నయమైందని చెప్పారు. ఆత్మవంచన పునాదులపై కొత్త సౌధాలు నిర్మించవద్దని అన్నారు. విలయత్వాన్ని అలవర్చు కున్న మనిషి వెచ్చని అశ్రువులు రాల్చడం అనివార్యం అని చెప్పారు. ఈసడింపు మాటలతో ఇంటి జీవితానికి ఇంపెక్కడిది అని ప్రశ్నిం చారు. రిక్త హస్తంగాని నడిచొచ్చే నిధే అడ్డా అని చెప్పారు. బిడ్డ అంటేనే సౌభాగ్యం, సౌమనస్యం అన్నారు. సంసారం ఓ వృక్ష రాజ్యం అని నిర్వచించారు. పుస్త కమే ఒక అద్భుత ప్రపం చమని అన్నారు.
పౌరుషాలు కాదు చేయాల్సినవి పురుష కార్యాలు అని ఒక స్వప్నం- కొన్ని ఆలోచనలు కవితలో నిర్దేశించారు. నేరమే గెలుస్తున్నదని ఇప్పుడిక చెప్పవచ్చు అన్న కవితలు వేదన చెందారు. స్త్రీ జాతికి మార్గదర్శకులు వీరనారీ మణులే అని చెప్పారు. మనుషుల్ని పులుముకోవడానికి ఇప్పుడు ఒక సందర్భం కావాలి అని తెలిపారు. జీవితం గోళి బిల్లల గోలగా మారిందన్నారు. బతుకమ్మ కుంట ఊరూరి కలల పంట అని చెప్పారు. బతుకమ్మను స్వేచ్ఛా కేతనంగా,మానవీయ చిత్రంగా అభివర్ణించారు. చెరువు బ్రతుకు ఆదెరువు అని చెప్పారు. పాడు సమాజాన్ని ఒక వ్యర్థ సాక్ష్యంతో పోల్చారు. తలవంపులను జీవితపు తెంపెరలు అన్నారు. ఆలోచన, ఆచరణతో అస్తిత్వపు కేతనం అవ్వాలని చెప్పారు. మనసున్న వాళ్లు మౌనం వహిస్తే నష్టమే అన్నారు. మనోనేత్ర దృశ్యంతో జీవన కడగండ్లను చూశారు. గులకరాళ్ళలోని ముత్యపు చిప్పల కోసం అన్వేషణ జరిపారు. పరిమిత కలలలో మనిషి అవస్థలను విశ్లేషించారు. మరణం కోరక/ అనడం చేయక / మంచి మానవతా ఆనవాళ్లు వెతుకుదామన్నారు. విశిష్ట తరువుగా తమ ఊరు చిన్న పెండ్యాలను పోల్చి అక్కడి గొప్పతనాలను మనసారా, కృతజ్ఞతాపూర్వకంగా అక్షరీకరించారు. ఇంకుడు గుంత.. పూర్ణకుంభమంత అని నీటి బుక్క కవితలో చెప్పారు. భూమి పుత్రునికి బురద పుండవ్వదు అని తెలిపారు. నిలబడిన కొమ్మను నరుక్కుంటూ చెట్టును నిందించకూడదని చెప్పారు. ముదమారగ తెలుగును చదివేందుకు సంకల్పించు అని పిలుపునిచ్చారు. కళ్లను కడిగే కన్నీళ్లను అవిభాష్యం కవితలో చూపించారు. బంధాలు- అనుబంధాలను మానవీయతతో ముడివేసి చెప్పారు.
జీవితాలు నలిగిపోకుండా చూడాలన్నారు. ఉల్లిని కల్పవల్లితో పోల్చారు. అంతా కొత్తగానే అనిపించినా ఆలోచించి అడుగేయడమే మహిళకు ముఖ్యమని చెప్పారు. చిన్న చెరువు అయినా ఊరికి కన్నతల్లి వంటిదని అన్నారు. విలక్షణ కవి జాషువాకు సలక్షణంగా నమస్కృతులు సమర్పించారు. చిన్న జీయర్ స్వామి విశ్వశాంతి దృక్పథానికి ప్రణామాలు అర్పించారు. కలల్ని వెలిగించే భాస్వర స్వరంగా మహాకవి శ్రీశ్రీని పోల్చారు. అందరాని లోకాలకు ఏగిన అబ్దుల్ కలాం కు సలాం సమర్పించారు. పొడుగూతా పల్లేరు చెట్ల గాయాలేనని ఎవరనుకున్నరు ఇట్లా అవుతదని కవితలో ఖేద పడ్డారు. నదికి పారే గుణం ఇచ్చేది, దారి చూపేది భూమేనని నిజం నీకూ తెల్సు కవితలో చెప్పారు. వాన ఆగగానే ఆకాశం శుభ్రపడ్డ దృశ్యాన్ని చూపారు. ఆమె కన్నులు కురిసిన ఎర్ర జీరల గుర్తులే తీర్పులని చెప్పారు. నిద్రలోంచి మాయమయ్యే ప్రాణం గురించి చెబుతూ జీవితం ఎంత విచిత్రం అని గతి- ప్రకృతి కవితలో వివరించారు. కాల సమాధిపై దయ్యపు చేష్టలకు గర్వభంగం తప్పదన్నారు. ముఖస్తుతులు మానడం మంచిదన్నారు. మనిషిలో జంతు స్వభావం అంతం కాకుంటే అభివృద్ధి ఉంటది అన్నారు. తాళం వేయలేని పాట శృతి చేయని వీణ అంటూ నియంత్రణ లేని సమాజ పోకడలను ఎండగట్టారు. ఆకురాయి పట్టు కవిత తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని ప్రతిబింబించింది. రాతిరిని అంతర్ముఖ చిత్రం అన్నారు. కుటుంబ చక్రాన్ని మోసే భార్య భర్తలను శరత్ చంద్రికలు, మనోజ్ఞతా ప్రభాత గీతికలు అని అభివర్ణించారు. ప్రకృతి నేర్పే పాఠాలను మనిషి జాగ్రత్తగా గమనించాలన్నారు. మట్టికి నమస్కరించని మనస్సు పురోగమించలేని తనానికి నిదర్శనం అని చెప్పారు.
తెలుగులో మాట్లాడి ప్రాంతీయత పరిమళాలను అందుకోవాలని అన్నారు. సాటిలేని ఖ్యాతి గీతమే ఉస్మా నియా విశ్వవిద్యాలయం అని కొనియాడారు. ఒక్కటికి అటుపక్కన చేరితే విలువ లేదని తెలియక సున్న అయి ఎగిరి పడడం హాస్యాస్పదమని భావించారు. ఉమ్మడి కుటుంబాలు తిరిగి రావాలని కోరుకున్నారు. సమ్మోహన వర్ణ సమ్మిళితమై, దృశ్య మాన సంశోభితమై, మానవీయ అంతర్లీన సామాజిక భావ సమ్మేళనమైన ఈ కవిత్వం ఓ జ్వలితశిఖ.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764