రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు
కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు
బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించారు. దీంతోపాటు ఆ విధానంలో శ్లాబ్‌లను కూడా మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు. కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు.. ఈ విధంగా ఉన్నారు.
కొత్త పన్ను విధానం… శాతం లో
రూ.0-4 లక్షలు – 0
రూ.4-8 లక్షలు – 5
రూ.8-12 లక్షలు – 10
రూ.12-16 లక్షలు – 15
రూ.16-20 లక్షలు – 20
రూ.20-24 లక్షలు – 25 శాతం
రూ..24 లక్షల పైన 30 శాతం
కొత్త పన్ను ప్రకటనతో ప్రస్తుతం రూ.12 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి అత్యధికంగా రూ.80,000 వరకు మిగిలే అవకాశం ఉంది. గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షల ఆదాయం దాటితే వారు ఏకంగా 30శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రూ.16-20 లక్షలు, రూ.20-24 లక్షలు, రూ.24 లక్షలు ఆ పైన కొత్త శ్లాబ్‌లను తీసుకొచ్చారు. దీంతో రూ.24 లక్షల ఆదాయం దాటితేనే 30శాతం పన్ను పడుతుంది. దీంతో గతంలో రూ.15-24 లక్షల మధ్య బ్రాకెట్లో ఉన్నవారికి లబ్ధి చేకూరనుంది. ఈ ప్రకటనతో‘మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, దీని వల్ల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుంది.’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంటులో మాట్లాడుతూ చెప్పారు. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. తగ్గించిన స్లాబ్ రేట్లతోపాటు, సాధారణ ఆదాయంలో రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు.
ఫలితంగా ఈ ఆదాయంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, రూ. 12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి రూ. 80,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది, ఇది ప్రస్తుత పన్ను నిర్మాణం ప్రకారం చెల్లించాల్సిన పన్నులో 100? తగ్గింపు ఉంటుంది. అదేవిధంగా రూ. 18 లక్షలు సంపాదించే వ్యక్తికి రూ. 70,000 తగ్గింపు లభిస్తుంది. అయితే రూ. 25 లక్షల ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు రూ. 1,10,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది. పన్ను చెల్లింపుదారులకు స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయి. మార్పుల ఫలితంగా ప్రత్యక్ష పన్నులలో (ఆదాయ పన్ను) రూ. 1 లక్ష కోట్ల నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. అదనంగా, కస్టమ్స్ సుంకాలు సహా పరోక్ష పన్నులు దాదాపు రూ. 2,600 కోట్ల నష్టం వాటిల్లుతుంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో ఈ కొత్త పన్ను ప్రతిపాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. పాత పన్ను విధానాన్ని మాత్రం ఆర్థిక మంత్రి ఈసారి కదిలించలేదు. దీని ప్రకారం రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. అక్కడినుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5,00,001 నుంచి రూ.10 లక్షల వరకు 20 శాతం, ఆ తర్వాత నుంచి 30 శాతం పన్ను విధిస్తారు. ప్రజల చేతిలో నగదును పెంచేందుకు, కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా పన్ను శ్లాబులను మార్చడంతో ఉన్నత ఆదాయ వర్గాలను కూడా సంతృప్తి పర్చారు. మధ్యతరగతి వర్గాలు మిగులు ఆదాయాలను సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌మార్కెట్లకు, రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇవ్వొచ్చు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వేతన జీవికి ఇది తీపికబురు.
ఈ సందర్భంగా ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలకు కేంద్రం కీలక ముందడుగు వేసింది. వచ్చే వారం ఆదాయ పన్నుపై బిల్లును తీసుకురానున్నట్లు నిర్మలమ్మ తెలిపారు.‘ముందు విశ్వాసం-తర్వాతే పరిశీలన’ అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బిల్లు ఆదాయ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తాం. టీడీఎస్, టీసీఎస్‌ను కూడా క్రమబద్ధీకరిస్తాం‘ అని ఆర్థిక మంత్రి వెల్లడిరచారు.ఈ సందర్భంగా వృద్ధులకు నిర్మలమ్మ ఉపశమనం కల్పించారు. ‘సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నాం. ఇక, అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ను రూ.2.4లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచుతున్నాం‘ అని ఆర్థిక మంత్రి వివరించారు. ఇక, ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును పెంచారు. ఏద్కెనా మదింపు సంవత్సరానికి అప్‌డేటెడ్ రిటర్నులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్‌ను మినహాయిస్తున్నట్లు వెల్లడిరచారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. బిఎన్‌ఎస్ స్ఫూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తామని, లిటిగేషన్లు తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం ఉంటుందని వివరించారు. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత పన్ను విధానం తీసుకొస్తామని ప్రకటించారు. టిడిఎస్ పై మరింత క్లారిటీ ఇస్తామని, సీనియర్ సిటిజన్స్‌కు టిడిఎస్ మినహాయింపులు ఉంటాయని అన్నారు. స్వయం సహాయక గ్రూపులకు గ్రావిరీణ్ క్రెడిట్ కార్డులు ఇవ్వడంతో పాటు 6 ల్కెఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై పన్నుల తగ్గిస్తామన్నారు. ఇవి బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్‌టెక్ మిషన్ ఏర్పాటు చేస్తామని, మరో 120 రూట్లలో ఉడాన్ పథకం అమలు చేయడంతో పాటు పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్ డిఐలకు అనుమతి ఉంటుందని, ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి ఇస్తామని నిర్మలా చెప్పారు.
నిర్మలమ్మ బడ్జెట్‌కు ప్రధాని ప్రశంసలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి1: కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బ్జడెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ నిర్మలమ్మను ప్రశంసించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్‌లో బ్జడెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ నిర్మలాసీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. బ్జడెట్ చాలా బాగుంది’ అని మోదీ ఆమెతో పేర్కొన్నట్లు తెలుస్తుంది. మరోవైపు.. బ్జడెట్ ప్రసంగంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు.’ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడంలో దోహదపడుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.