“ప్రభుత్వం మత రహితంగా, మతానికి దూరంగా ఉండవలసిందే. గద్దె మీద కూచున్నవారి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా సరే, గద్దె మీది నుంచి జరిగే పనులు ఏ ఒక్క విశ్వాసాన్నో గద్దె మీద కూచోబెట్టేవిగా ఉండగూడదు. ఈ కనీస రాజ్యాంగ విలువ తెలంగాణాధీశులకు తెలియకపోవచ్చు. దేశ పాలకులలో అత్యధికులు ఈ కనీస విలువ తెలియకుండానే, గౌరవించకుండానే పాలించారనేది నిజమే. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ‘పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం’ అని ఒక సమర్థన ఇచ్చుకున్నారు గనుక, అందరూ చేసిన తప్పే నేనూ చేస్తాను అంటున్నారన్నమాట..”
తెలంగాణ గతవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ మహాయాగం అనే విచిత్రమైన సన్నివేశాన్ని చూసింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో నీటి పారుదల శాఖ మంత్రి సతీసమేతంగా జరిపిన ఈ యాగంలో ముగింపు పూర్ణాహుతిని సతీసమేతంగా ముఖ్యమంత్రి స్వీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వాధికారులు ఎందరో పాల్గొన్నారు. ప్రభుత్వమే పూనుకుని ఈ పని చేసింది గనుక ప్రచార మాధ్యమాలన్నీ అది ఎంత వైభవోపేతంగా, కనుల పండుగగా జరిగిందో కథలు కథలుగా వర్ణించాయి. కృష్ణా తీరంలో ఒకానొక రోజు ఉదయం 4.05కు గోపూజతో ప్రారంభమైన యాగం, 3.24 కు పూర్ణాహుతితో ముగిసిందట. (కచ్చితంగా అంతే, ఒక నిమిషం ఆటో ఇటో అయితే యాగం విఫలమవుతుంది! వరుణుడికి కోపం వచ్చి వానలు ఆపేస్తాడు!)
“కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలనే మహోన్నత సంకల్పంతో, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, సుభిక్షాన్ని కోరుతూ వరుణయాగం నిర్వహించాం. వర్షాల కోసం యాగాలు, యజ్ఞాలు, పూజలు చేయడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. దానిని మేం గౌరవించి ఈ యాగాన్ని నిర్వహించాం. ప్రభుత్వం శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవిత పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రకృతి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ఎల్ నినోను తట్టుకునేందుకు వరుణదేవుడు కరుణించాలని ప్రార్థించాం” అని ముఖ్యమంత్రి అన్నారని వార్తలు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అనుసరించవలసి ఉంటుందని ఈ యాగ నిర్వాహకులకు తెలుసునో లేదో తెలియదు. రాజ్యాంగ ప్రవేశికలోనే ఇది లౌకిక రాజ్యం అనే మాట ఉంది. అంటే లౌకిక మానవ ఆచరణలోకి లోకాతీత భావనలు రాగూడదని అర్థం. మనిషికి లోకాతీత శక్తుల గురించి విశ్వాసం ఉంటే ఉండవచ్చు, అది వ్యక్తిగత జీవితానికి పరిమితం కావాలి గాని, ప్రభుత్వ పాలన, విద్య, సామాజిక జీవనం వంటి లౌకిక అంశాలలో మత జోక్యం ఉండగూడదని ఫ్రెంచి విప్లవం ప్రకటించిన, ఆధునిక ప్రపంచం ఆమోదించిన విలువ. భారతదేశం వంటి అనేక మతాలు, లోకాతీత శక్తి మీద భిన్న విశ్వాసాలు ఉన్న సమాజంలో ఈ భావననే సర్వధర్మ సమభావ అని వ్యాఖ్యానించారు.
“ఇంతకూ ఎల్ నినో ఏమిటి? దానికీ లేని వరుణుడికీ సంబంధం ఏమిటి? ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రత పెరిగే ఒక ప్రాకృతిక పరిణామం. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి సహజంగా జరుగుతుంది. అందువల్ల భారత ఉపఖండం మీదికి వచ్చే నైరుతి రుతుపవనాల మీద ప్రభావం పడుతుంది. ఆ నైసర్గిక పరిణామానికి ప్రపంచంలో నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తోడవుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో అనివార్యమైన అవసరంగా మారిన కార్లు, ఏర్ కండిషనర్లు, విద్యుదుత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి, పారిశ్రామిక కాలుష్యం, ఆకాశ హర్మ్యాలు, విమానయానం, అడవుల నరికివేత, గనుల తవ్వకం వంటి అనేక కార్యక్రమాలు వాతావరణ తాపాన్ని విపరీతంగా పెంచుతున్నాయి..”
అది సహనానికీ, మానవ బహుళత్వ సహజీవనానికీ సంబంధించిన అంశమే తప్ప అధిక సంఖ్యాకుల మత విశ్వాసాలను ప్రభుత్వం పాటించాలని కాదు. ప్రభుత్వం మత రహితంగా, మతానికి దూరంగా ఉండవలసిందే. గద్దె మీద కూచున్నవారి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా సరే, గద్దె మీది నుంచి జరిగే పనులు ఏ ఒక్క విశ్వాసాన్నో గద్దె మీద కూచోబెట్టేవిగా ఉండగూడదు. ఈ కనీస రాజ్యాంగ విలువ తెలంగాణాధీశులకు తెలియకపోవచ్చు. దేశ పాలకులలో అత్యధికులు ఈ కనీస విలువ తెలియకుండానే, గౌరవించకుండానే పాలించారనేది నిజమే. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ‘పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం’ అని ఒక సమర్థన ఇచ్చుకున్నారు గనుక, అందరూ చేసిన తప్పే నేనూ చేస్తాను అంటున్నారన్నమాట.
అలాగే, “శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, అన్వేషణా, సంస్కరణా స్ఫూర్తిని అభివృద్ధి చేయడం” పౌరులలో ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా భారత రాజ్యాంగం నిర్దేశించింది. వర్షాలు కురవడం వరుణదేవుడి దయ అనుకోవడం శాస్త్రీయ దృక్పథం కాదు. ప్రకృతి చలన నియమాలు తెలియని అతి ప్రాచీన కాలంలో మనుషులు తమ కళ్ల ముందు జరుగుతున్న పరిణామాలను ఏవో అతీత శక్తులు నడుపుతున్నాయనుకుని, ఆ శక్తులకు పేర్లు పెట్టుకున్నారు, ఆ శక్తులను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు జరిపారు, ఆ శక్తులను ఆరాధించారు. అక్కడి నుంచి సమాజం వేల ఏళ్లు ముందుకు సాగి ప్రకృతి పరిణామాలకు శాస్త్రీయ కారణాలు కనిపెట్టింది, అర్థం చేసుకుంది. ప్రభుత్వాలు, పౌరులు కూడా ఆ శాస్త్రీయ దృక్పథాన్ని పాటించాలని రాజ్యాంగం ఆదేశించింది.
అనావృష్టి సందర్భాలలో కప్పతల్లికి పెళ్లి చేయడం, ఊరేగించడం, యాగాలు, యజ్ఞాలు, పూజలు చేయడం నిజంగానే ఒక సంప్రదాయంగా పూర్వీకుల నుంచి కొనసాగుతూనే ఉన్నది. అయితే అటువంటి ప్రయత్నాలతో ఏ ఒక్క సందర్భంలోనూ వానలు కురవలేదనేది కూడా పదేపదే రుజువైన సత్యం. ఆ ప్రయత్నాలు మండుటెండాకాలాల్లో కాక, వర్షాకాలాల్లోనే, ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పుడే జరపడమే ఆ మూఢనమ్మకపు అసలు రహస్యాన్ని బైటపెడుతున్నది. అటువంటి మూఢనమ్మకం ఒక మంత్రికో, ముఖ్యమంత్రికో వ్యక్తిగతంగా ఉంటే, వారు తమ ఇంట్లో అటువంటి యాగాలు చేసుకుంటే వారి అజ్ఞానానికి జాలి పడవచ్చు. కాని ఆ అజ్ఞానాన్ని బహిరంగ, ప్రభుత్వ, అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం, ప్రభుత్వాధికారులందరూ విధిగా హాజరు కావలసి రావడం రాజ్యాంగ వ్యతిరేకం. ఈ మూఢనమ్మకపు కార్యక్రమానికి ప్రజాధనం ఎంత వ్యర్థమైందో లెక్కలేదు.
“మొత్తానికి ఈ సంవత్సరానికి తెలంగాణలో కాలం పోయింది. వ్యవసాయ సమాజాల్లో కాలం అంటే సూర్య గమనంతో లెక్కించే సాధారణ కాలం కాదు. కాలమంటే వానాకాలమే. కాలం ఎట్లుంది, కాలమైందా, కాలం బాగుందా అనేవి గ్రామీణుల సహజమైన ప్రశ్నలు. అంటే వానలు బాగున్నాయా అని మాత్రమే. వర్షాధార వ్యవసాయం, వర్షాల మీదనే ఆధారపడిన బావులూ వాగులూ వంకలూ చెరువులూ కుంటలూ, వాటి మీద ఆధారపడిన వ్యవసాయం తెలంగాణ జీవితం. అసలు దేశ జీవితంలోనే వర్షం ఎంత ముఖ్యమైనదంటే, సంవత్సరానికి పర్యాయ పదం వర్షం. తలాపున గోదావరి, కాళ్లకట్టున కృష్ణ రెండు జీవనదులుండీ, నిండా లెక్కలేనన్ని చిన్న నదులూ ఏర్లూ వాగులూ ఉండీ కూడా సాగుకైనా, తాగడానికైనా నీటిచుక్క కోసం అల్లాడిన నేల తెలంగాణ. అందువల్లనే నీరు జీవనావసరమూ, వ్యవసాయావసరమూ మాత్రమే కాదు, భావోద్వేగంగా కూడా మారిన నేల తెలంగాణ.”
ఇంతకూ ఎల్ నినో ఏమిటి? దానికీ లేని వరుణుడికీ సంబంధం ఏమిటి? ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రత పెరిగే ఒక ప్రాకృతిక పరిణామం. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి సహజంగా జరుగుతుంది. అందువల్ల భారత ఉపఖండం మీదికి వచ్చే నైరుతి రుతుపవనాల మీద ప్రభావం పడుతుంది. ఆ నైసర్గిక పరిణామానికి ప్రపంచంలో నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తోడవుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో అనివార్యమైన అవసరంగా మారిన కార్లు, ఏర్ కండిషనర్లు, విద్యుదుత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి, పారిశ్రామిక కాలుష్యం, ఆకాశ హర్మ్యాలు, విమానయానం, అడవుల నరికివేత, గనుల తవ్వకం వంటి అనేక కార్యక్రమాలు వాతావరణ తాపాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. ఒకవైపు ఎల్ నినోతో తక్కువ వర్షపాతం, లేదా అనూహ్యమైన మార్పులతో అతివృష్టి, అనావృష్టి కలయిక, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కలిసి నేలలో తేమ అంతకంతకూ తగ్గిపోతున్నది. ఉష్ణోగ్రతల పెంపు వల్ల జలాశయాలలో నీరు ఎక్కువగా ఆవిరైపోతున్నది. ఈ పరిణామాలే సాగుకైనా, తాగడానికైనా మరిన్ని ఎక్కువ నీళ్లు కావాలనే అవసరాన్ని పెంచుతున్నాయి. ఆ నీటికే కొరత వచ్చింది కాబట్టి వ్యవసాయమూ, మానవ జీవనమూ కూడా ఇబ్బందిలో పడుతున్నాయి.
ఇదంతా విషవలయం. ఇందులో ఎల్ నినో దానికదిగా ఒక సహజ పరిణామం కాబట్టి మనం చేయగలిగినదేమీ ఉండకపోవచ్చు. భూతాపం పెరగడానికి కారణమవుతున్న ఆధునిక జీవనశైలి ప్రపంచమంతా విస్తరిస్తున్నది, జడలు విప్పి నర్తిస్తున్నది గనుక ఒక్క తెలంగాణలో మనం ఏమీ చేయలేకపోవచ్చు, చేయబోయినా ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. కాని ఒక పరిణామం జరిగినప్పుడు అది ఎందుకు జరిగిందో, పూర్వాపరాలు ఏమిటో, జరగకుండా ఆపగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేవో, ఆ పరిణామం జరుగుతున్నప్పుడు దాని దుష్ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయో ఆలోచించడం, అమల్లో పెట్టడం, ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వపు కనీస బాధ్యత. ఆ బాధ్యత మరిచి మంత్రాలకు చింతకాయలు రాలగొట్టాలని ప్రయత్నించడం ఆత్మవంచన, పరవంచన.
మొత్తానికి ఈ సంవత్సరానికి తెలంగాణలో కాలం పోయింది. వ్యవసాయ సమాజాల్లో కాలం అంటే సూర్య గమనంతో లెక్కించే సాధారణ కాలం కాదు. కాలమంటే వానాకాలమే. కాలం ఎట్లుంది, కాలమైందా, కాలం బాగుందా అనేవి గ్రామీణుల సహజమైన ప్రశ్నలు. అంటే వానలు బాగున్నాయా అని మాత్రమే. వర్షాధార వ్యవసాయం, వర్షాల మీదనే ఆధారపడిన బావులూ వాగులూ వంకలూ చెరువులూ కుంటలూ, వాటి మీద ఆధారపడిన వ్యవసాయం తెలంగాణ జీవితం. అసలు దేశ జీవితంలోనే వర్షం ఎంత ముఖ్యమైనదంటే, సంవత్సరానికి పర్యాయ పదం వర్షం. తలాపున గోదావరి, కాళ్లకట్టున కృష్ణ రెండు జీవనదులుండీ, నిండా లెక్కలేనన్ని చిన్న నదులూ ఏర్లూ వాగులూ ఉండీ కూడా సాగుకైనా, తాగడానికైనా నీటిచుక్క కోసం అల్లాడిన నేల తెలంగాణ. అందువల్లనే నీరు జీవనావసరమూ, వ్యవసాయావసరమూ మాత్రమే కాదు, భావోద్వేగంగా కూడా మారిన నేల తెలంగాణ.
ఇప్పటికీ తెలంగాణలో వ్యవసాయ భూమిలో సగానికన్న ఎక్కువ వర్షాధారంగానే ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఒక కోటీ పదహారు లక్షల ఎకరాలలో నీటి పారుదల సౌకర్యం ఉన్న నికర భూమి నలబై నాలుగు లక్షల ఎకరాల కన్నా తక్కువ. ఈ నికర సాగునీటి సౌకర్యం ఉన్న భూమిలో కూడా కాలువల కింద ఉన్నది ఇరవై శాతం కూడా కాదు, మిగిలినది బావుల కింద, బోర్ బావుల కింద, చెరువుల కింద ఉన్నదే. అందువల్లనే వర్షం ప్రాధాన్యత పెరుగుతున్నది.
సాధారణంగా జూన్ మొదటివారానికల్లా నైరుతి రుతుపవనాలు తెలంగాణ మీద వ్యాపించి, వర్షాలు ప్రారంభం కావాలి. అక్టోబర్ దాకా అడపా దడపా క్రమబద్ధంగా వర్షాలు కురవాలి. ఒక్కసారే కుంభవృష్టి కురవడమూ కాదు, వారాల తరబడి, నెలల తరబడి చుక్క కూడా రాలకపోవడమూ కాదు. దుక్కులకు, విత్తనాలకు, మొక్కల ఎదుగుదలకు, ఫలదీకరణానికి ఎప్పటికి ఎంత అవసరమో అంత కురవాలి. నేలకూ చినుకుకూ మనిషికీ వ్యవసాయానికీ అటువంటి అన్యోన్య సంబంధం వేల సంవత్సరాలు కొనసాగింది. అప్పుడప్పుడు అతివృష్టో, అనావృష్టో రాలేదని కాదు. కాని మొత్తంగా వర్షాలు సక్రమంగా ఉండడమూ, వాటి మీద ఆధారపడి రైతు జీవితమూ, మొత్తంగా సమాజ జీవితమూ సజావుగా ఉండడమూ ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీ చెరిగిపోయింది.
గణాంకాల ప్రకారం చూస్తే జూలై 10 నాటికి సాధారణంగా కురవవలసిన వర్షం కన్నా 19 శాతం తక్కువ కురిసింది. జూలై 16 నాటి లెక్క ప్రకారం 35 శాతం కొరత ఉండింది. జూలై చివరా, ఆగస్టు మొదటా అక్కడక్కడ కాస్త వర్షం కురిసింది గాని అది రుతుపవనాల వల్ల కాదు, బంగాళాఖాతంలో వాయుగుండాల వల్ల. ఆగస్ట్ 10 నాటికి చూస్తే కురవవలసిన దానికన్న 6 శాతం మాత్రమే తక్కువ కురిసిందని నమోదయింది. అయితే ఇవి సగటు గణాంకాలు గనుక సమగ్ర చిత్రాన్ని ప్రదర్శించవు. మొత్తంగా చూస్తే కొరత తక్కువగా ఉన్నదని అనిపించినా, కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురిసి, అసలే కురియని ప్రాంతాలను సరిసమానం చేసి ఉండవచ్చు. రాష్ట్రంలో వ్యవసాయం జరిగే 32 జిల్లాల్లో 21 జిల్లాల్లో సగటు కన్న తక్కువ వర్షపాతమే ఉంది. వ్యవసాయ పనులకు అదునులో కురియక, అదును తప్పిపోయిన తర్వాత కురిసింది. ఎల్ నినో ప్రభావం ఈ అసమానతను మరింత పెంచింది. పశ్చిమ కనుమలలో, ఎగువ ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది గనుక గోదావరి, కృష్ణ వరదలు రాలేదు. వాగులూ వంకలూ ప్రవహించలేదు, చెరువులు నిండలేదు. అంటే భూగర్భ జలాలు పెరగలేదు.
ఈ స్థితిలో ప్రభుత్వం తలచుకుంటే చేయదగిన పనులున్నాయి. కురిసిన తక్కువ వర్షాన్ని ఒడిసిపట్టడానికి, పొదుపు చేయడానికి ప్రయత్నించవచ్చు. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు ప్రచార కార్యక్రమాలు చేపట్టవచ్చు. చెరువులను నీటి పారుదల వనరులుగా కాక, భూగర్భ జలాలను పెంచే వనరులుగా మార్చవచ్చు, ఎక్కువ నీటిని ఆశించే పంటలు వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేసి, అందుకు తగిన చర్యలు తీసుకోవచ్చు, శాస్త్రీయ పరిశోధనలను, అంచనాలను మరింత పకడ్బందీగా మార్చవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఫలితం ఇస్తాయి గాని, యజ్ఞ యాగాలు ఏమీ ఫలితం ఇవ్వవు.





అగౌరవం కాదు, అవసరమైన నిష్కర్ష!