- వరి వద్దు.. ఉద్యాన పంటలకే మొగ్గు
- పంట మార్పిడిపై మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక
- వొచ్చే మూడేళ్లలో 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి లక్ష్యం
- కొత్తగా మరో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక
- కేంద్ర విత్తన చట్టంలో మార్పులు చేయాలి: మంత్రి తుమ్మల డిమాండ్
- రామగుండం యూరియాలో 90% తెలంగాణకే ఇవ్వాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : రాష్ట్రంలో పంట మార్పిడి అవశ్యకతపై వ్యవసాయశాఖ కమిషన్ రూపొందించిన నివేదికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు శనివారం సచివాలయంలో అందజేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటలపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ కమిషన్ సమగ్ర నివేదిక రూపొందించింది.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని, వొచ్చే మూడు సంవత్సరాల్లో అందులో కనీసం 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆయిల్‌సీడ్స్ సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు.
పంట మార్పిడిలో మార్కెట్ లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం వుంది కనుక అటువంటి పంటలు మరియు దేశ ప్రాంత అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక చెయ్యాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో 45 వేల ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగును తీసుకురాగా.. వచ్చే సంవత్సరంలో 1 లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రణాళిక తయారుచేసి, దానిని సాధించాలని అన్నారు. కేంద్రం తయారుచేసిన విత్తనచట్టంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ చట్టంలో నకిలీ విత్తనాల వలన రైతులు నష్టపోతే, రైతులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు. విత్తన నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సముచిత అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వొచ్చే ఖరీఫ్ సీజన్ కి సంబంధించి జూన్ మొదటి వారంలో నాట్లు వేసే అవకాశాలు ఉన్నందున, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తగినంత యూరియా బఫర్ నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా కేటాయింపులకు అనుగుణంగా కేంద్రం సరఫరా చేసేలా కేంద్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్ర అధికారులను కలిసి, యూరియా సరఫరాలో జాప్యం జరగకుండా చూసేలా కోరాలని మంత్రి సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి 90 శాతం కేటాయించి, సరఫరా చేయాలని ఈ సందర్భంగా కేంద్రా న్ని మంత్రి డిమాండ్ చేశారు. సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మీన్ బాషా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.





