కాంగ్రెస్ కు ఇక డెత్ డిక్లరేషనే

– యువతకు రాహుల్ వెన్నుపోటు
– నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే
– రాష్ట్రంలో “స్కాం” క్యాలెండర్ నడుస్తోంది
– రేవంత్ జాబులు కాదు రాహుల్ జేబులు నింపుతున్నడు
– నిరుద్యోగులకు అన్నగా తోడుంటా
– ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క
– సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ గర్జన

=హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 18: యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదికపైనే.. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషన్ రాస్తుందన్నారు. మూడేళ్ల క్రితం ఏ సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ బురిడీ పత్రాన్ని ఆవిష్కరించిందో అదే వేదికపై ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత కాంగ్రెస్ మోసాలను గ్రహించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. మాట తప్పి, నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గడ్డపై నుంచి యువత ‘డెత్ డిక్లరేషన్’ (రాజకీయ మరణ శాసనం) రాయడానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ హెచ్చరించారు. శ‌నివారం సరూర్ నగర్ లో జరిగిన యువసంగ్రామం సదస్సులో మాట్లాడిన కేటీఆర్, 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్.. కొత్త డూప్లికేట్ రూపాల్లో వచ్చి నకిలీ ప్రేమను కురిపించి యువతను బలిపీఠం ఎక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ప్రచారం చేసుకునే ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమ దుకాణం) తెలంగాణ యువత పాలిట ‘గద్దారీ కా మకాన్’ (ద్రోహుల ఇల్లు) గా మారిందని కేటీఆర్ విమర్శించారు.  రాహుల్ కు తెలుగు రాదు కాబట్టి, తెలంగాణ యువత పడుతున్న వేదనను ఆయనకు అర్థమయ్యే భాషలోనే చెపుతానంటూ హిందీలో మాట్లాడారు. మూడేళ్ల క్రితం అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులతో దిగిన ఫోటోలు, ఇచ్చిన జూటా హామీలు గుర్తున్నాయా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దేశమంతా రాజ్యాంగం పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాయమాటలు చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలోని నిరుద్యోగుల వీపుల పైన పోలీస్ లాఠీలు మోగుతుంటే…అక్రమ కేసులతో ఆడబిడ్డలను కూడా చూడకుండా అణిచివేస్తుంటే ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అప్రజా స్వామిక అరాచక అణిచివేత చూడకుండా కళ్ళు మూసుకొని ఢిల్లీలో గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ప్రశ్నించారు.

జ‌రుగుతున్న‌దంతా లూటీఫికేషన్

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీల పరిస్థితి ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్ తో పాటు 4,000 నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థులు కొలువుల కోసం రోడ్లపైకి వస్తుంటే, ఈ ప్రభుత్వం ఉద్యోగాల ‘నోటిఫికేషన్’ ఇవ్వడం పక్కనబెట్టి, కేవలం ‘లూటీఫికేషన్’ (దోపిడీ) లో మునిగిపోయిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ‘ఓటు కొట్టు.. జాబ్ పట్టు’ అని పత్రికల మొదటి పేజీల్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్, నేడు ఏడాది దాటినా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదన్నారు. అశోక్ నగర్, దిల్ షుక్ నగర్ వేదికగా కొలువులు అడుగుతున్న నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సర్కార్ లాఠీఛార్జీలు, అర్ధరాత్రి అరెస్టులతో దమనకాండ సాగిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావండి, బావిలో దూకండి అన్న రేవంత్ అహంకారానికి రాబోయే రోజుల్లో యువత ఘోరి కట్టడం ఖాయమన్నారు.

రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్

బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రేవంత్ రుజువు చేస్తే.. తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. ఉద్యోగాలపై కాంగ్రెస్ నాయకులు కాకి లెక్కలు చెప్తూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను చూస్తూ కూడా మేధావులు మౌనంగా ఉండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. జీనా హై తో మర్నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో అంటూ కొట్లాడిన యువతరం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే పాలకుల కుర్చీలు కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. యువతకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. 2028లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. రాబోయే ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు న్యాయం చేసే బాధ్యత నాది” అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ రోజు యువతను దారుణంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా నిరుద్యోగుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు అడిగితే కోసి నెత్తురు చల్లుకోండి అంటున్నాడు మరోవైపు బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిన్ తాగి చాగ తాగండి బాయిలో దూకండి అంటున్నారు. ఇంతటి ఉన్మాదం, అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి ఓట్లు వేసిన విషయాన్ని గుర్తుంచుకొని తగిన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ నుంచి మొదలుకొని డీఎస్సీ వరకు అన్ని అంశాల్లో చెప్పిన మాటలు మరిచి నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీస్తే నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్టులు శంఖిణులు అంటూ అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. డీఎస్సీ మెగా డీఎస్సీ వేస్తా అన్న రేవంత్ రెడ్డి, వేసిన డీఎస్సీ కూడా ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అహంకారం, బలుపు మాటలను తెలంగాణ యువత మరిచిపోదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. యూనివర్సిటీ విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా అమ్ముకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి తాను నమ్ముకున్న హిట్లర్ కంటే దారుణమైన ముగింపును చూడబోతున్నారన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా సిన్సియర్ గా పని చేశామన్నారు. 2,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, దీంతోపాటు దాదాపు 27 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. అయితే టీఎస్పీఎస్సీ వంటి వ్యవహారంలో పేపర్ లీక్ వ్యవహారంలో మరింత వేగంగా స్పందించాల్సి ఉండేదని కేటీఆర్ అన్నారు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సవరించుకుంటామని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకాశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదేదో పేపర్ లీక్ అయిందంటూ అడ్డగోలుగా ప్రాపగండా చేశారన్నారు. 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తాము ఏనాడు గొప్పలు చెప్పుకోలేదన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పాలనలో చందాలు దందాలు అనే కల్చర్ నడుస్తుంది, అని పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు, అందుకే ఐటీ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు పోతున్నాయని కేటీఆర్ అన్నారు.మరోవైపు బీజేపీ తెలంగాణకు వచ్చే పెట్టుబడులను పరిశ్రమలను తన్నుకు పోతున్నదని, ఇదేనా జాతీయవాదం అని ప్రశ్నించారు. ఒక విద్యార్థిగా అనేక పరీక్షలు రాసి పూణే తోపాటు న్యూయార్క్ యూనివర్సిటీ వరకు సీట్లు సాధించి ఎవరి పైరవీలు లేకుండా ఉద్యోగం సాధించుకున్న తనకు ఉద్యోగ సాధన ఎత కష్టమైనదో దాని కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలుసు అన్నారు. కానీ ఎలాంటి ఉద్యోగాల కోసం ఒక్క రోజు కూడా ప్రయత్నం చేయని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు అడ్డగోలుగా విద్యార్థుల పై మాట్లాడుతున్న అంశంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టి హబ్ స్టార్టప్ అయిన స్కైరూట్ సంస్థ ఈ రోజు ప్రయోగించిన మొదటి రాకెట్ ప్రయోగానికి సంబంధించిన విజయాన్ని అందరూ అభినందించాలని కోరారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువత కాంగ్రెస్ తమకు చేసిన ద్రోహాన్ని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *