- సిద్దమవుతున్న ఓరుగల్లు
- బహిరంగ సభకు భారీగా హాజరుకానున్న బీసీలు
- హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో విస్తృత ఏర్పాట్లు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): హలో బీసీ- ఛలో వరంగల్ పేరుతో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు కోట్లుగా ఉన్న బీసీలు తమ ఆత్మగౌరవాన్ని, తమ హక్కులను కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా బీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్ నగరంలో భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. బీసీలకు చెందిన వివిధ కుల సంఘాలు ఈ మేరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో తమ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, పోస్టర్లు, కరపత్రాల ద్వారా బీసీ సమూహాన్ని సన్నద్ధంచేసే కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా మైక్‌ల ద్వారా వరంగల్ నగరంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకాలంగా వివిధ బీసీ సంఘాలు ఎవరి ఉద్యమాన్ని వారు చేసుకుంటూ పోవడంతో హక్కులను సాధించుకోలేకపోతున్నారు.
అందుకు ఈ సంఘాలన్నిటినీ సంఘటితంచేసి, రాబోయే కాలంలో రాజ్యాధికారం సాధించుకోవాలన్న దృక్పథంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ నేత వట్టె జానయ్య యాదవ్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు నేతృత్వం వహిస్తున్న ఈ బహిరంగ సభను హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జయశంకర్ ప్రాంగణంలో ‘బిసీ రాజకీయ యుద్దభేరి’ పేరిట నిర్వహిస్తున్నారు. ఇంతవరకు తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగాయి. అయితే అన్ని ఉద్యమాల్లోనూ బీసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ, ఉద్యమ ఫలాల విషయానికొచ్చినప్పుడు బీసీలకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతున్నది. రెండు, మూడు శాతం ఉన్న ఉన్నత కులాల వారికి దక్కుతున్న ఫలాలను బీసీలు పొందలేకపోతున్నామన్న ఆవేదన వారిని పోరాటానికి సిద్ధం చేసింది. ఈ పోరాటం బీసీల కోసం ప్రత్యేకించింది. రాజకీయ చైతన్యం బిసీల్లో రానంత వరకు ఆ కులాలకు న్యాయం జరగదన్న భావన ఇప్పుడు వారిలో నెలకొంది.
అధికారాన్ని చలాయిస్తున్న ఉన్నత కులాలు బీసీలు సంఘటితం కాకుండా వారిని కులవృత్తులు చేసుకోమని, నామమాత్రపు తాయిలాలు ప్రకటిస్తూ అధికారానికి దూరం చేస్తూ వొచ్చాయి. అందుకే వోట్లు మావే.. సీట్లు మావే.. అన్న నినాదంగా యుద్ధభేరి మోగించేందుకు వారు సిద్దమయ్యారు. రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా ప్రాతిపదికగా కనీసం 50 శాతం ఎమ్మెల్యే, ఎంఎల్సీ అవకాశం కల్పించాల్సి ఉండగా కేవలం ఒకటి రెండు శాతానికే పరిమితం చేస్తున్నారన్న ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగించాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకే కులగణను ముందుకు తెచ్చిందంటున్నారు.
స్వాతంత్య్రం వొచ్చిన ఈ 75 ఏళ్ల కాలంలో బీసీలకు ఇలానే అన్నింటా అన్యాయం జరుగుతుంది. అందుకే పాలకుల వైఖరిని ఎదుర్కోవాలంటే బీసీలంతా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్న విషయాన్ని గ్రహించి, సంఘటిత ఉద్యమాలకు చేయూతనివ్వాలని, అంతిమంగా రాజ్యాధికారం దిశగానే పోరాడాలని వారు పిలుపునిస్తున్నారు. ఎసీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా కమిషన్లను, ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసినట్లు బీసీల కోసం ప్రత్యేక కమిషన్‌ను గాని మంత్రిత్వ శాఖను గానీ ఏర్పాటు చేయక పోవడం తమపట్ల ఇంతకాలంగా ప్రభుత్వాలు చూపిస్తున్న ఉదాసీన వైఖరిని నిదర్శనమంటున్నాయి ఆ వర్గాలు. అలాగే సమాజంలో రెండు, మూడు శాతంగా ఉన్న ఉన్నత వర్గాల వారికి పది శాతం ఈబీసీ రిజర్వేషన్లను కల్పించడాన్ని ఆ వార్గలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వెంటనే తొలగించాలంటూ ఆ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.





