– ‘హామ్’పైౖ హరీష్‌రావు ఆరోపణలు
– అవి నిరాధారం
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. వాస్తవాలను మరుగుపరిచి అర్థం లేని విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఆవేశానికి లోనుకాకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని ఒక ప్రకటనలో హితవు పలికారు. గ్రామీణ రహదారులను జాతీయ రహదారుల స్థాయిలో ఆధునికీకరించడం, కొత్త రహదారుల నిర్మాణం చేపట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాకముందే అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ‘హామ’ను కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2016 నుంచి విజయవంతంగా అమలు చేస్తోందని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 374కు పైగా ప్రాజెక్టులు, సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ మోడల్ ద్వారా రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ వంటి రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దీర్ఘకాలిక నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అందు కోసం గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల లక్ష్యంగా ‘హామ’ ద్వారా రహదారుల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. తొలి దశలో రూ.6,250 కోట్లతో 2,162 రహదారులను 7,450 కి.మీ పొడవులో అభివృద్ధి చేయడానికి 17 ప్యాకేజీలుగా పనులు మంజూరు చేశారన్నారు. వీటిలో 14 ప్యాకేజీలకు బిడ్లు దాఖలయ్యాయని, మిగతా మÖడు ప్యాకేజీలకు ఈ నెల 11 వరకు గడువు ఉందని మంత్రి సీతక్క వివరించారు. ప్రస్తుతం సాంకేతిక పరిశీలన పూర్తయి ఆర్థిక బిడ్ల పరిశీలన కొనసాగుతోందన్నారు. ఈ పథకం కింద కాంట్రాక్టు సంస్థలు 30 నెలల్లో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేసి అనంతరం పదిహేనేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను చేపడతాయని తెలిపారు. నిర్మాణ దశలో ప్రాజెక్టు వ్యయంలో 40% ప్రభుత్వం చెల్లించగా మిగిలిన 60శాతాన్ని 15 సంవత్సరాల నిర్వహణ కాలంలో యాన్యుటీ రూపంలో చెల్లిస్తుందన్నారు. దీని ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ రహదారుల నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ విధానానికి అనుగుణంగా బ్యాంకు గ్యారంటీపై గరిష్టంగా 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వవచ్చని, ఈ అడ్వాన్స్‌ను వడ్డీతో కాంట్రాక్టర్ బిల్లుల నుంచి దశలవారీగా తిరిగి వసూలు చేస్తారని ఆమె వివరించారు. ఇది కొత్త విధానం కాదని, దేశవ్యాప్తంగా అమలులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడం కాంట్రాక్టర్‌కు తప్పనిసరి కాదని కూడా తెలిపారు. ఈ టెండర్లు పూర్తిగా ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలతోపాటు ఒక అంతర్జాతీయ సంస్థ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. అన్ని నిబంధనలు ఎన్‌హెచ్‌ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి సీతక్క కోరారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




