ఆ పార్టీ నేతలు బిజెపిని విమర్శించడం సిగ్గుచేటు
బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24 : బంజారాహిల్స్ పీఎస్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. గతంలో దొంగ నోట్ల ప్రింటింగ్ చేసి బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వొచ్చింది. దొంగనోట్ల వ్యాపారం కాకుండా పాస్ పోర్ట్ వ్యాపారం చేసింది బీఆర్‌ఎస్ నాయకులేనని ఆరోపించారు. మానవ అక్రమ రవాణా చేసి డబ్బులు దోచుకున్న ఆరోపణలు బీఆర్‌ఎస్ నాయకులపై ఉన్నాయి. ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ గతంలోనే చేసింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో బీఆర్‌ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవాల్సిన బీఆర్‌ఎస్ నాయకులు.. ఉల్టా బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేయడం వారి అవివేకానికి నిదర్శనం. ఖచ్చితంగా 2001 నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, గత ముఖ్యమంత్రి, మంత్రుల మీద అనేక ఆరోపణలు వచ్చాయి.
బండి సంజయ్ కుమార్ చేసిన ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని బిఆర్‌ఎస్ పారీ కోరకుండా బిజెపిని విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అవినీతి మురికిగుంటలో కూరుకుపోయి, దాని పర్యవసానంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పటికైనా దొంగనోట్ల వ్యాపారం విషయంపై విచారణకు అంగీకరించాలి. అంతేగాని బండి సంజయ్ కుమార్ పై ఉల్టా ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది. రూ. 50 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రూ. లక్షా 40 వేల కోట్లకు పైగా వెచ్చించారు. ఆ అవినీతి సొమ్మును బీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేలకోట్ల రూపాయల భూమిని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేసింది. గుట్టల బేగంపేట, మియాపూర్ భూములు, గచ్చిబౌలి తో సహా అన్ని ప్రాంతాల్లో అతి విలువైన ప్రజల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. కంపెనీలకు దారాదత్తం చేసి, అక్రమంగా సొమ్ము సంపాదించిన బీఆర్‌ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి నిలువెత్తు రూపం టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) నాయకులు.
దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న బండి సంజయ్ మఠం పెట్టుకోవాలంటూ విమర్శలు చేసిన కేటీఆర్ కు సిగ్గుండాలి. రాములవారి అక్షింతలపై కూడా కేటీఆర్ దిగజారి మాట్లాడి, హిందూ దేవుళ్లను, హిందువులను మనోభావాలను కించపర్చేలా మాట్లాడారు. మెజారిటీ ప్రజల నమ్మకాన్ని అవమానించే దుర్మార్గుడు కేటీఆర్ అని ఫైర్ అయ్యారు. కేటీఆర్ వంటి నాయకులు హిందూ దేవుళ్లను అవమానిస్తారు. కానీ, రంజాన్ పండుగ రోజు టోపీ పెట్టుకుంటారు. హిందూ దేవుళ్లను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని, వారి పూజా పద్ధతిని గౌరవిస్తుందని, కాని, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం దొంగ వేషాలతో ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. వాళ్లు టోపీ పెట్టుకోవడమే కాకుండా, ప్రజలకు కూడా టోపీ పెట్టాలని చూస్తారు. బీఆర్‌ఎస్ నాయకులకు కావాల్సింది కేవలం వోట్లు. వోట్ల కోసం కేటీఆర్ ఏ స్థాయికైనా దిగజారుతారు.
దేశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని కేటీఆర్ మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, రాష్ట్రాన్ని అప్పలుపాల్జేసి, మతవిశ్వాసాలను రెచ్చగొట్టి, మళ్లీ నేడు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతోంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే. ఆ పార్టీల భావజాలం ఒక్కటే.. ప్రాంతాల వారీగా, భాషల వారీగా, ఉత్తర, దక్షిణ దేశంగా భారతదేశం విడపోవాలని కుట్ర చేసే శాడిస్టిక్ సైకాలజీ ఆ పార్టీలవి. దేశం కోసం ఆలోచించేది బిజెపి మాత్రమే. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేశాయి. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు అనుసంధానంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోంది. ఎంఐఎం రాజకార్ల పార్టీ. రజకార్ల పార్టీకి దాసోహమైన కేటీఆర్ కు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పాలని ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.